– బిల్లును అడ్డుకుని పెద్ద తప్పు చేశాయి
– ఊరూరా ఈ విషయం ప్రచారం చేయండి
– కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సూచన
– కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు
– రూ.13వేల కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు
న్యూదిల్లీ, ఏప్రిల్ 18 : మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో విపక్షాలు జీవితాంతం చింతిస్తాయన్నారు. ప్రధాని అధ్యక్షతన దిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో శనివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని అన్నారు. ఇందుకు వారు భారీ మూల్యం చెల్లించుకుంటాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకమనే విషయాన్ని ప్రతి గ్రామానికి చేరేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా 298-230 ఓట్ల తేడాతో వీగిపోయిన విషయం విదితమే. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (డీఏ) 2 శాతం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏటా జనవరి, జూలైలో కేంద్ర ప్రభుత్వం డీఏను సవరిస్తుంది. అయితే ఈసారి డీఏ పెంపు ప్రకటన ఆలస్యమవడంతో ఉద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. అలాగే ఈ కేబినెట్ సమావేశంలో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. దీనికోసం రూ.13వేల కోట్లు కేటాయించనున్నారు. దీనికింద భారత జెండా నౌకలు, భారత్ నుంచి రాకపోకలు సాగించే నౌకలకు బీమా కవరేజీ అందించడమే లక్ష్యం. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో హర్మూజ్ జలసంధిలో రవాణా నౌకలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిధిని ఏర్పాటు చేయడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





