– బిల్లును అడ్డుకోవడం విపక్షాల చారిత్రక తప్పిదం
– అవి మహిళా ద్రోహులుగా నిలిచిపోతాయి
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు పార్లమెంటులో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ బిల్లులను అడ్డుకుని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని, ఆ పార్టీలు మహిళా ద్రోహులుగా నిలిచిపోతాయని ఘాటుగా విమర్శించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ అసలు బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పలేకపోయారన్నారు. బిల్లు పెట్టకముందు దక్షిణాదికి అన్యాయం అన్నారు.. బిల్లు పెట్టిన తర్వాత ఎంపీ, అసెంబ్లీ స్థానాలను పెంచుకునే కుట్ర అన్నారు అని విమర్శించారు. 50% సీట్లు పెంచుకోవాలనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, ఈ విషయాన్ని ప్రధానమంత్రి అన్ని భాషల్లోని పత్రికల్లో దేశ ప్రజలకు వివరించారని, లోక్‌సభలో అఖిలపక్ష సమావేశంలోనూ వివరించారని చెప్పారు. అందరి సహకారం ఉంటుందనే ఆకాంక్షతో ఈ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్, మిత్రపక్షాలు కుట్రతో ఈ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకున్నాయన్నారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మొదటిసారి కాదని, మహిళలకు లబ్ది చేకూర్చే బిల్లును ఏడుసార్లుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ దాని మిత్రపక్ష పార్టీలు చెన్నైలో సమావేశం పెట్టాయి.. ఇప్పుడేమో ఇలాంటి అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేలా ప్రయత్నిస్తే ఈ బంగారు అవకాశాన్ని అడ్డుకున్నారన్నారు. మోదీ మీద ద్వేషాన్ని, బీజేపీపై ద్వేషాన్ని దేశంలోని మహిళలమీద, దక్షిణాది మీద చూపించారన్నారు. వారంతా కలిసి దక్షిణాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయపరమైన ద్వేషంతో దక్షిణాదికి నష్టం చేశారని, తెలంగాణకు జరిగే లాభాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్ అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళామణులకు, చట్టసభల్లోకి వచ్చి దేశానికి, సమాజానికి మేలు చేయాలనుకున్న మహిళలకు, అనేక పార్టీల్లో అవకాశాలు రాని వారందరి ఆశల మీద నీళ్లు చల్లారని కిషన్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అవలంబిస్తున్న విధానం, ఆయన ప్రకటనలు పూర్తిగా దేశ వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన నుంచి ఇంతకంటే గొప్పగా దేశ ప్రజలు ఏమీ ఆశించకూడదని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌కి తెలంగాణలో మార్గదర్శకుడు, అత్యంత సన్నిహితుడైన అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం చూసేందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఈ బిల్లును అడ్డుకున్నారని చెప్పారు. ఇది బీజేపీకో, మోదీ కో, కేంద్ర ప్రభుత్వానికో ఓటమి కాదు.. ఇది 70 కోట్ల మంది మహిళలకు ఓటమి అని స్పష్టం చేశారు.
సీఎం వ్యాఖ్యలపై మండిపాటు
బీజేపీకి మహిళా అధ్యక్షుడిని చేశారా అని రేవంత్ ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నలకు తలాతోకా లేదంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పాలించినప్పుడు ఏనాడైనా మహిళను ముఖ్యమంత్రిని చేశారా.. ఏరోజైనా బీసీని ఉమ్మడి ఏపీ ప్రత్యేక తెలంగాణలో ముఖ్యమంత్రిని చేశారా అని ప్రశ్నించారు. మీకు బీసీల గురించి, మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కుందా అని నిలదీశారు. మేం ప్రజాక్షేత్రంలో గెలుస్తూనే ఉన్నాం.. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు మిమ్మల్ని ప్రతిచోటా ఓడిస్తున్నాం.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించిందని కిషన్‌రెడ్డి చెప్పారు. దక్షిణాదికి సంబంధించిన పార్లమెంటు సీట్ల పునర్విభజనలో ఇంతకన్నా మేలైన పథకం ఇంకొకటి లేదన్నారు. దక్షిణాది ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీదేనన్నారు. తెలంగాణలో 17 సీట్లను మేం 26కు పెంచే ప్రతిపాదన తెస్తే మీరు ఓడించారని, ఏపీలో 25 నుంచి 38 సీట్లకు, కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాట 39 నుంచి 59 స్థానాలకు పెంచాలనుకుంటే వ్యతిరేకించారని తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్ వద్ద ఎలాంటి ప్రతిపాదనల్లేవని విమర్శించారు. దక్షిణాది, ఉత్తరాది అని విభజించి పాలించేలా బీజేపీ ప్రయత్నిస్తోందంటున్న కాంగ్రెస్, రేవంత్, ఒవైసీలు ఎలాంటి ప్రతిపాదనలు ఇస్తారో చెప్పాలన్నారు. తాము 70 కోట్ల మంది మహిళలను ఇంటింటికీ వెళ్లి కలుస్తాం.. మహిళలు ఎదురు తిరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో త్వరలో చూస్తారు అని హెచ్చరించారు. బీజేపీ కూడా దక్షిణాదిలో రాజకీయాలు చేస్తోంది.. దక్షిణాదిలో ఊరూరా, వాడవాడలా బీజేపీ జెండా ఎగురవేస్తాం. దక్షిణాదికి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులను నిష్పక్షపాతంగా అందిస్తున్నాం అని చెప్పారు. దక్షిణాదిలో బలపడాలని, అక్కడి ప్రజల మద్దతు కూడగట్టాలనే తమ ప్రయత్నం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





