కేసిఆర్‌ ‌పాలనకు మరో పార్శ్వం..!

‘‘‌నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే పాలనకు మరోకోణం కూడా చూడాల్సి ఉంది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందగా, అన్ని పార్టీల బాటలోనే తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధం లేని వారిని పార్టీలో చేర్చుకోవడాలు, అధికారాలు కట్టబెట్టడాలు, తెరాస ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేసిన, జెండాలు మోసిన వారికి మింగుడు పడని అంశంగా మారింది.’’

నేడు తెలంగాణ తొలి సీఎం గా కేసిఆర్‌ ‌ప్రమాణ స్వీకారం చేసిన దినం
తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్‌ 2‌వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. రెండవసారి 2018 డిసెంబర్‌ 23 ‌న ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం గావించారు. ఆ నేపథ్యాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. నిజాం నిరంకుశ పాలన నుండి 1948లో హైదరాబాద్‌ ‌సంస్థానం భారత దేశంలో విలీనమైనా, 1953లో మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్రం విడివడినా, ఉమ్మడి రాష్ట్రంలోని సమస్త వనరులు తరలించ బడతాయన్న తెలంగాణ ప్రాంతీయుల అభిప్రాయాలను కాలరాచిన ఫలితంగా, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుండి స్వార్థ రాజకీయ పాలకుల కారణంగా తెలంగాణకు అడుగడుగునా అన్ని రంగాలలో తీరని అన్యాయమే జరిగింది. ఫలితంగా 1852లో నాన్‌ ‌ముల్కీ గోబ్యాక్‌, 1969‌లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, పెద్ద మనుషుల ఒప్పందాలు, ఆంధ్ర ప్రాంతీయులను ఉద్యోగాలలో వెనక్కు పంపే జీఓ 38, తెలంగాణ ఎన్టీవో పోరాట ఫలితమైన జీవో 610 అమలు కానే లేదు. ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే అన్నింటికీ పరిష్కార మార్గమని ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్న తరుణంలో, కేసిఆర్‌ ‌నేతృత్వంలో తెరాస ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది. బాలారిష్టాలు, ఆటుపోట్లకు వెరవక, ఎన్ని అడ్డంకులెదురైనా కేసీఆర్‌ ‌మాటల్లో ‘‘గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించని ఉద్యమాన్ని’’ కేసిఆర్‌ ‌భుజ స్కంధాలపై మోసారు. సకల జనుల సమ్మె వరకు అనేకానేక ఘట్టాలకు తెర లేపారు. మరణ శాసనం రాసుకునే వరకు వెళ్ళి, జీవితాన్ని ఫణంగా పెట్టి ఆమరణ దీక్షకు పూనుకుని, ఢిల్లీ పెద్దలను కదిలించి, వారిపై ఒత్తిడిని పెంచారు.

చివరకు రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చుటకు కారణ భూతులైనారు. కేసీఆర్‌ ‌భాష, యాస, వివిధ అంశాలపై ఆయనకు గల సాధికారతలు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టేలా చేశాయి. ఉద్యమ కాలంలో విశ్రాంత సమయాలను సద్వినియోగ పరుచుకుని, వివిధ రంగాలలో నిష్ణాతులతో కేసీఆర్‌ అపారమైన అవగాహన పొందారు. వీటిని జోడించి బంగారు తెలంగాణ బాటలో ప్రభుత్వాన్ని నడిపేందుకు కంకణధారియైనారు. ఆమరణ దీక్షా సమయంలో వివిధ సందర్భాలలో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలను ఆహ్వానించడంలో, ఎందరు అభిప్రాయ బేధాలతో పార్టీని వీడినా వెరవక, ముందుకు సాగిన కేసిఆర్‌ ‌మొండి వైఖరి, ఏదైనా సాధించగలరనే ప్రబల విశ్వాసం ప్రజలలో కలిగించింది. అందుకే నీళ్ళు, నిధులు, నియామకాలతో సహా కేసీఆర్‌ ‌నేతృత్వంలో అన్నీ సాధ్యమనే భావన తెలంగాణ వాసుల్లో కలిగింది. అన్ని సమస్యల నుంచి విముక్తి ప్రదాతగా కేసీఆర్‌ ‌ను ప్రజలు భావించి ఎన్నికలలోతిరుగులేని మద్దతు పలికారు. ఎవరి సాయం అక్కర లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా ప్రజలు ఆయనకు మద్దతిచ్చారు. అధికారం ‘‘హస్తానికి గతమై తెరాసకు హస్తగతమయ్యాక’’, ప్రభుత్వాధినేతగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక, సామాజిక, వైయక్తిక ప్రాయోజిత కార్యక్రమాలకు అంకుర్పణ చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ ‌పూర్తి స్థాయిలో అనుకూలించదని తెలిసి, రెండవసారి ఎన్నికల్లో అభివృద్ది మంత్రం ప్రధానంగా పఠించి, ఆశించిన దానికన్నా, అధిక స్థానాలను కైవసం చేసుకుని, తనకు, తన పార్టీకి రాష్ట్రంలో తిరుగు లేదని నిరూపించారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలూ చేపట్టారు.

నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే పాలనకు మరోకోణం కూడా చూడాల్సి ఉంది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందగా, అన్ని పార్టీల బాటలోనే తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధం లేని వారిని పార్టీలో చేర్చుకోవడాలు, అధికారాలు కట్టబెట్టడాలు, తెరాస ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేసిన, జెండాలు మోసిన వారికి మింగుడు పడని అంశంగా మారింది. సమర్థత కొలమానం కాకపోగా, కొన్ని నిర్ణయాలు అపాత్రదానాలైనాయి. నీళ్ళు, నిధులు మాట ఎలా ఉన్నా నియామకాల విషయంలో ఆశావహులు చకోరపక్షుల్లా ఎదిరి చూస్తునే ఉన్నారు. ఉద్యమ కారులపై కేసులు ఇంకా ఎత్తి వేయబడనే లేదు. ఉద్యమకాల ఆసాంతం రోడుపైకి వచ్చి, పోరాటాలు సాగించిన ప్రైవేటు విద్యాసంస్థలు గడ్డు కాలాన్ని అనుభవిస్తున్నాయి. కేంద్రంతో సమానంగా రాష్ట్ర ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగుల పట్ల ఉదాసీన వైఖరి, స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు, రాజకీయ జోక్యం లేని ధార్మిక పరిషత్‌ ఏర్పాటు, సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలు, పేదలకు ఇళ్ళు, భూపంపిణీలు, కేజీ టు పీజీ ఉచిత విద్య తదితర ఇంకా కొన్ని అంశాలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. సెంటిమెంట్‌ ‌కను మరుగై వేళ.. అభివృద్ధియే కొలమానంగా ఇటీవల ఎన్నికలకు వెళ్ళి, తిరుగే లేని ఘన విజయం సాధించిన క్రమంలో, కేసీఆర్‌ ‌పాలన పట్ల ప్రజలకు విశ్వాసం ఇంకా సడల లేదని స్పష్టం అవుతున్నది. అనుభవైకవేద్యుడైన తెరాస అధినేత, ఉమ్మడి పాలనకు ఇప్పటికి తేడా లేదనే కొందరి భావనలను తప్పు అని రుజువు చేసేందుకు, రానున్న రోజులలో పలు వర్గాల ప్రజల అసంతృప్తులను, అసహనాలను, అసమ్మతులను దూరం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారో? ఎలా ప్రజల మద్దతును చేజారి పోకుండా చర్యలు చేపట్ట నున్నారో? లాంటి ప్రశ్నలకు సమీప భవిష్యత్తే సమాధానం చెప్పనుంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *