కేటీఆర్ హద్దు మీరి మాట్లాడుతున్నారు..!

  • తెలంగాణ రాష్ట్రంలో బిజేపి బుల్డోజర్స్ వస్తాయనే భయం..
  • కేంద్ర మంత్రిగా కేసీఆర్ యూపీఎ హయాంలో తెలంగాణకు ఏం తెచ్చారో కేటీఆర్ చెప్పాలి..: ఎంపి జీవీఎల్
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: తెలంగాణ, ఏపిలో బీజేపీ విజయబావుటా ఎగరవేయటం ఖాయం. .బీజేపీ బుల్డోజర్‌ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాజ్య సభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం తన వాటా కింద ఇస్తున్న నిధులు, పథకాలు ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని స్కీంలకు తమ స్టిక్కర్లు పెడుతున్నాయని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో తన నివాసంలో జీవిఎల్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడిపై మంత్రి కేటీఆర్ హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటిఆర్ వ్యాఖ్యల్లోనే బిజెపి అంటే టీఆర్ఎస్ కు ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందన్నారు. టీఆరెఎస్ పార్టీ ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రధాని మాటలను వక్రీకరిస్తూ, ప్రధాని, కేంద్ర ప్రభుత్వంపై నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే పత్రికలు విషం చిమ్ముతూ తప్పుడు వాఖ్యలు చేయడం సహేతుకం కాదన్నారు. అందుకే ఈ రెండు పత్రికలకు రాజ్యసభలో ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసులకు వారు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని తెలిపారు. సభాహక్కుల ఉల్లంఘనపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై విచారణ జరిపించాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరానని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలతో కేంద్రాన్ని అవమానిస్తే… చట్ట పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించేందుకే ఈ సభా హక్కుల నోటీసులు అన్నారు. కేంద్రాన్ని, నరేంద్రమోడీని, బిజెపిని దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడమని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలని విమర్శించారు. 
ముందు నీ తండ్రిని అడుగు…
యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పటి కంటే,  మోడి నేతృత్వంలోని బిజేపి సర్కార్ తెలంగాణకు ఎనిమిది రేట్లు అధికంగా నిధులు ఇచ్చిందన్నారు. కేంద్ర సహకారంపై మంత్రి కేటీఆర్ ప్రధాని మోడిని ప్రశ్నించే ముందు, మాజీ కేంద్ర మంత్రిగా పని చేసిన తన తండ్రి కేసీఆర్ ను ప్రశ్నించాలని జీవీఎల్ సూచించారు. లేదంటే కేటీఆర్‌ వ్యాఖ్యలు కేవలం రాజకీయ దుశ్చర్య మాత్రమేనని అన్నారు.  “కేసీఆర్‌కు కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్నపుడు తెలంగాణ గుర్తు లేదా? లెక్కలు చూసుకోలేదా?. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే తెలంగాణ ఏమైనా ఫర్వాలేదా?” అని ప్రశ్నించారు. గాంధీ, గాడ్సే విష‌యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు… బిజేపిపై ఇత‌ర రాష్ట్రాలు అమ‌లు చేసిన వ్యూహాన్నే తెలంగాణలో ప్ర‌యోగిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ వ్యూహాలు ఇప్ప‌టి వ‌ర‌కు స‌ఫ‌లీకృతం కాలేద‌న్నారు.
ఆయుష్మాన్ భార‌త్ అనే స్కీంను 2019 వ‌ర‌కు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎందుకు అంద‌కుండా చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 2014-15 లో కేంద్రం నుంచి తెలంగాణ కు వ‌చ్చిన నిధుల్ని పోల్చితే, ప్ర‌స్తుతం మోడి హ‌యాంలో 320 రెట్లు నిధులు పెరిగాయ‌న్నారు.  ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందని, అందుకే  కుటుంబ పార్టీల పాలన అంతం చేసేలా 2024 ఎన్నికల ఎజెండాను మోడి ఖరారు చేస్తున్నారని చెప్పారు. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు అనే ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరితే… టీఆర్ఎస్, వైఎస్సార్ సిపిలు కూడా చేరుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page