– ఎన్నికల్లో పోటీ చేసిన వారి పునర్నియామకానికి అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన అంగన్‌వాడీ సిబ్బందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి ఎన్నికల్లో విజయం సాధించని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల అప్పీల్స్‌ను పరిశీలించనున్నారు. అయితే వారి స్థానంలో ఇప్పటికే మరో అభ్యర్థిని నియమించని సందర్భాల్లో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శాఖ సెక్రటరి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కార్యకర్తలు, హెల్పర్లు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు అందించే కీలక భాగస్వాములని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనేకమంది అంగన్‌వాడీలకు కు ఊరట లభించనుంది. అర్హులైన వారి అభ్యర్థనలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి వారి పునర్నియామకం చేపట్టనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





