మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని, కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమని, కొరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కున్నదో అందరకీ తెలుసునని, ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదని, పైగా, న్యాయంగా రావల్సిన నిధులపై కూడా కోత విధించిందని, ఈ విషయంలో కేంద్రం ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నదని, కేంద్రంపై ఈ అంశంపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని కెసిఆర్ అన్నారు. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయని, కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతున్నదని, రాష్ట్ర జాబితా తరుగుతున్నదని, రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయంప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నదని కెసిఆర్ దుయ్యబట్టారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం-బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నది. మనతో పాటు స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్‌లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నమని, ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతున్నదని, దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలు చేసే ప్రసక్తి లేదని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. అలా చేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా రూ.5వేలకోట్లు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయిందన్నారు. ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోవాల్సి వొస్త్తుందని, కానీ రూ.25 వేలకోట్ల కోసం చూస్తే రైతుల బాయిలకాడ వి•టర్లు పెట్టాల్సి వొస్తుందని, రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాల్సి వొస్తుందని, అది తమ విధానం కాదని కెసిఆర్ తేల్చి చెప్పారు.