కాలం…
రెండక్షరాల పదమే
ఆగమన్నా ఆగనిది
చుక్కల్లో చంద్రునిలా
నడిచేకొద్దీ పరుగెత్తేది,
అలసటలేని
ప్రయాణం సాగిస్తూ
నిత్యం ఆశలతో కవ్విస్తూ
పరుగులు పెట్టించే
చేతన ప్రవాహం.
పదవీవిరమణ లేని
పాలనచేస్తూ,
అన్నీ తానై
మనిషి హృదయాలనేలుతూ,
కలల్ని కన్నీరుగాను
కన్నీటిని పన్నీరుగాను
మార్చగల నెరజాణ

ఓ మనిషీ!
కనిపించని గాలి ఊపిరైనట్టు
అన్నీ తానైన
కాలం విలువ తెలుసుకో,
మార్పుని ఆహ్వానించు.
ఆశలు,ఆశయాలు సిద్ధించేలా
పయనం సాగించు…
జీవితానికి సార్ధకత చేకూర్చు

   – వేమూరి శ్రీనివాస్‌
 9912128967
      ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page