కార్పోరేట్‌ ‌కడుపు కోతలు

‘‘‌నేటి ఆధునిక కాలంలో సహజ ప్రసవాలు అనేవి మాత్రం చాలా అరుదై పోయాయి.గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీసే సిజేరియన్‌ ‌ప్రసవాలు అత్యంత సహజం అయిపో యాయి.ఈనాడుసహజ ప్రసవాలు అనేవి మాత్రం ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్‌ ‌కాన్పులు అధికంగా ఉంటున్నాయి.’’

ప్రపంచంలో ఒక ప్రాణిని సృష్టించాలి అంటే కేవలం ఇద్దరికి మాత్రమే సాధ్యం. ఒకటి దైవం, రెండు అమ్మ. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడంతో పాటు తల్లి తాను కూడా పునర్జన్మ పొందుతుంది. ప్రసవ సమ యంలో ముఖ్యంగా సహజ ప్రసవంలో తల్లి పడే ప్రసవ వేదన నరకంగా ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన తరువాత ఆ కష్టాన్నే మరచిపోతారు మాతృ మూర్తులు. అయితే నేటి ఆధునిక కాలంలో సహజ ప్రసవాలు అనేవి మాత్రం చాలా అరుదై పోయాయి.గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీసే సిజేరియన్‌ ‌ప్రసవాలు అత్యంత సహజం అయిపో యాయి.ఈనాడుసహజ ప్రసవాలు అనేవి మాత్రం ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్‌ ‌కాన్పులు అధికంగా ఉంటున్నాయి.కారణం ఏమిటి అంటే కార్పోరేట్‌ ‌హాస్పి టళ్లలో వ్యాపార ధోరణి వలన సహజ ప్రసవాలు అయ్యే వాటికి సిజేరియన్‌ ‌చేస్తున్నారని విమర్శ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో జరిగే ప్రతీ అయిదు ప్రసవాలలో ఒకటి సీజీరియన్‌ ‌పద్దతిలో జరుగుతుంది. అంటే దాదాపు 21 శాతం వరకూ సీజీరియన్‌ ‌కాన్పులు జరుగుతున్నాయి.ఇదే రీతిలో కొనసాగితె 2030కల్లా సిజేరియన్లు 29శాతానికి చేరుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ ఓ) అధ్యయనం వెల్లడిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం చూస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో తప్పని సరి పరిస్ధితులలో చేసే సిజేరియన్లు 14 శాతం మాత్రమే ఉండగా,ప్రయివేటు ఆసుపత్రులలో మాత్రం ఇది 47 శాతం వరకు ఉంది.వైద్య పరంగా ఇబ్బందులు ప్రసవం సమయంలో తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రమాదం ఉంది అన్నప్పుడు మాత్రమే సిజేరియన్‌ ఎం‌చుకోవాలి.ఎందుకంటే సిజేరియన్‌ ‌కాన్పువలన కలిగే దుష్ప్రభావాలు దీర్ఘ కాలం పాటు ఉంటాయి.ఈ విషయంలో ప్రపంచం అంతటా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.వాటిని దృష్టిలో ఉంచుకునే సిజేరియన్‌ ‌చేయాలా సహజ ప్రసవమా అనేది నిర్ణయించాలి.

వయసు పైబడిన తరువాత సంతానానికి యత్నించే వారి విషయంలో తల్లికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నప్పుడు, గర్భాశయంలో బొడ్డుతాడు సమస్య వంటివి ఉన్నప్పుడు, బిడ్డ అడ్డం తిరిగిన సమయంలో,లేదా కృత్రిమ పద్దతిలో గర్భం దాల్చిన వారి విషయంలో సిజేరియన్‌ ‌చేయడానికి వైద్యులు సిద్ధపడతారు.ఆయితే ఈ సమస్యలు ఏవీ లేనప్పటికీ కూడా సిజేరియన్‌ ‌శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి.కారణం ఏమిటంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలలో ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు గర్భిణీ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోతున్నాయి… వ్యక్తిగత కుటుంబాలలో మా బిడ్డ సున్నితంగా పెరిగింది.. నొప్పులు తట్టుకోలేదంటూ తల్లిదండ్రులు. మా ఆవిడ కష్టపడటం చూడలేనంటూ భర్తలు.ఈ హడావిడి చూసి నేను నొప్పులు భరించలేను అంటూ గర్భిణీలు సహజ ప్రసవం కోసం వైద్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారిపై వత్తిడి తెచ్చి సిజేరియన్‌ ‌చేయించే కేసులే అధికం అని చెప్పవచ్చు.అయితే కొన్ని ప్రయివేటు వైద్యశాలల్లో కూడా సహజ ప్రసవం కోసం చివరి వరకూ ప్రయత్నం చేసే వైద్యులు లేకపోలేదు. అయితే ఈ సమయంలో తల్లికి కానీ బిడ్డకు కానీ మరణం సంభవిస్తే ఆ వైద్యుడిపైన ఆ హాస్పిటల్‌ ‌పైన జరుగుతున్న భౌతిక దాడులు మనం అనేకం చూస్తూనే ఉన్నాం.ఈ తరహా ఘటనలు నుండి బయట పడటానికి వైద్యులు తమను తాము రక్షించుకోవడానికి సిజేరియన్‌ ఎం‌చుకోవడం అనేది దురదృష్టకరం. కేవలం కాసుల కోసమే కడుపు కోతలు చేస్తున్న ప్రయివేటు హాస్పిటల్స్ ‌కూడా లేకపోలేదు.ప్రస్తుత కాలంలో మనకు తెలిసిన వారినెవరినైనా ప్రసవం గురించి ప్రస్తావిస్తే నార్మల్‌ ‌డెలివరీ అనే సమాధానం చాలా అరుదుగా వినిపిస్తుంది.వర్తమాన సమాజంలో తల్లి తండ్రులు మాత్రం బిడ్డలను అపురూపంగా చూస్తూ గర్భవతిగా ఉన్న సమయంలో కాలు కూడా క్రింద పెట్టకుండా పెంచుతారు.ఈ విధానం కూడా సహజ ప్రసవానికి ఆటంకంగా పరిణమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం కోసం చూసినా చాలా ప్రభుత్వ ఆసుపత్రిలలో గైనకాలజిస్టుల కొరత వలన ఎక్కువగా ఉంది. ఈ స్ధితిలో మధ్యతరగతి వర్గం వారు సైతం ప్రసవం కోసం వ్యాపారాత్మక ధోరణే ఊపిరిగా గల కార్పోరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.అయితే ప్రయివేటు ఆసుపత్రిలో కూడా వైద్యులు సహజ ప్రసవం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా తల్లి తండ్రులు బంధువులు పిల్ల నలిగిపోతుందని వైద్యులను వత్తిడి చేసి సిజేరియన్‌ ‌చేయిస్తున్న సంఘటనలు తక్కువేం కాదు. సిజేరియన్‌ ‌తో పోలిస్తే సహజ ప్రసవంలోనే బిడ్డకు తల్లికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సహజ ప్రసవం వలన తల్లి నుంచి బిడ్డకు చేరే సూక్ష్మ జీవులు శిశువు యొక్క జీర్ణాశయ వ్యాధి నిరోధక వ్యవస్ధలను ప్రభావితం చేస్తాయని అనేక పరిశోధన లు నిరూపించాయి. అయితే సిజేరియన్‌ ‌శస్త్ర చికిత్స ద్వారా జన్మించిన శిశువులకు హాస్పిటల్స్ ‌లో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియాచేరే ప్రమాదం ఉంది.దీనివలన సిజేరియన్‌ ‌శిశువులు తల్లులు కూడా అనేక అలర్జీలు విభిన్న రుగ్మతలతో బాధపడుతున్నట్లు నిరూపితం అయ్యింది. సిజేరియన్‌ ‌వలన ప్రసవ వేదన ఉండదు అని భావిస్తున్నారు తప్ప దాని వలన దీర్ఘకాలంలో ఇన్ఫెక్షన్లు, థ్రాంబోసిస్‌ ‌వంటివి విజృంభించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికి మార్పు రావడం లేదు. సిజేరియన్‌ ‌ప్రసవం కోసం చేసిన గాటు విచ్ఛిన్నమవడం, హిస్టరెక్టమీ తదితర సమస్య లతోపాటు కొన్నిసార్లు ప్రాణాంతక పరిస్థితులూ తలెత్తవచ్చుననే సమాచారానికి విస్తృత ప్రచారం జరగడం లేదు. మొదట ప్రసవం సీజీరియన్‌ అయితే రెండవ ప్రసవం కూడా తప్పని సరి అవుతుంది. ఎక్కువుగా గర్భ సంచి సమస్యలు సిజేరియన్‌ అయిన మహిళల్లోనే కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆయినప్పటికి ఈ దుష్పరిణామాలు ను గ్రహించక ఎక్కువ మంది సీజీరియన్‌ ‌బాట పడుతున్నారు.ఈ పరిణామాలు దృష్టిలో ఉంచుకునే పాశ్చాత్య దేశాలు ఎక్కువగా సహజ ప్రసవం వైపే మొగ్గు చూపుతున్నాయి.అదే సమయంలో మన దేశంలో మాత్రం రోజు రోజుకు సిజేరియన్‌ ‌ప్రసవాలు మాత్రం పెరిగిపోతున్నాయి.

సుముహూర్త సిజేరియన్లు
ఈ మధ్య కాలంలో ఈ తరహా సిజేరియన్లు బాగా పెరిగి పోయాయి. వివాహాలకు, గృహ ప్రవేశాలకు, నూతన వ్యాపారాలకు తిథి వారం నక్షత్రం వంటి శుభ ఘడియలు శుభ మూహర్తాలు చూడటం అత్యంత సహజం. అయితే ఈ శుభ ఘడియలు అనే ప్రక్రియ ప్రసవాలకు కూడా పాకింది.మంచి శుభ ముహూర్తాన జన్మించిన బిడ్డ జాతకం అత్యద్భుతంగా ఉంటుందని.సహజ ప్రసవంలో ఇది సాధ్యం కాదనే మూఢ నమ్మకంతో సిజేరియన్‌ ‌ప్రసవం ద్వారా మనకు నచ్చిన ముహూర్తములో వైద్యుల సహాయంతో సిద్ధాంతి చెప్పిన ఘడియలు లోనే ప్రసవాలు చేయిస్తున్నారు. ఈ తరహా ప్రసవాలు చేయించడంలో ఎక్కువ విద్యా వంతులే ముందుకు రావడం దుర దృష్టకరం.ఈ జాడ్యం రోజు రోజుకు పెరిగిపోతు ఉంది.ముఖ్యంగా తెలంగాణ లో ఈ తరహా ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక సర్వే అంచనా.

మిడ్‌ ‌వైఫరీ సేవలు
సాధారణ కాన్పులపై అవగాహనే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్‌ ‌నర్సులకు ‘మిడ్‌ ‌వైఫరీ’ శిక్షణ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ శిక్షణలో భాగంగా నార్మల్‌ ‌డెలివరీ కోసం గర్భిణి స్త్రీలతో వ్యాయామం చేయిస్తారు నర్సులు. ప్రసవం సమయంలో ఎదురయ్యే నొప్పులను కొన్ని ఘడియలు భరిస్తే జీవితాంతం తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని గర్భిణీలకు అవగాహన కల్పిస్తారు..చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. దేశంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా చర్యలు చేపడితే సహజ ప్రసవాల సంఖ్యను పెంచ వచ్చు.తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచనలు
తొలి ప్రసవం అయితే.. కనీసం 12 గంటలు వేచి చూసి, అప్పటికీ కాన్పు కాకపోతే అప్పుడు సిజేరియన్‌పై నిర్ణయం తీసుకోవాలి. అదే రెండో కాన్పు అయితే.. 10 గంటలు వేచి చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చెబుతున్నాయి.పురిటి నొప్పులు మొదలైన తర్వాత ప్రతి గంటకూ గర్భంలోని శిశువు ఒక సెంటీమీటర్‌ ‌మేర బయటకు రావడం తప్పనిసరి కాదని కూడా తేల్చి చెప్పింది. పురిటి నొప్పులు ఆలస్యమైతే సిజేరియన్‌ ‌తప్పనిసరి కాదంటూ 2018 ఫిబ్రవరి 15న కొత్త మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. ‘‘దీనితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నింటిలో జరిగే ప్రసవాలపై ఆడిట్‌ ‌ద్వారా సిజేరియన్లను నియంత్రించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచనను పాటించగలిగినట్లయితే కొంత వరకూ సిజేరియన్‌ ‌ప్రసవాలకు అడ్డుకట్ట వేయవచ్చు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిజేరియన్‌ ‌చేసే సందర్భంలో ప్రభుత్వ మరియు ప్రయివేటు హాస్పిటల్స్ అవలంభించవలసిన మార్గదర్శకాలను తెల్పడమే కాకుండా వాటిని క్షేత్ర స్ధాయిలో చిత్త శుద్దితో అమలుపరచగలిగే విధంగా చర్యలు చేపడితే సత్ఫలితాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.ప్రధానంగా ప్రతీ ప్రభుత్వ హాస్పిటల్‌ ‌లో ఖచ్చితంగా గైనకాలజీ స్పెషలిస్ట్ ఉం‌డేలా చర్యలు చేపట్టగలిగితే ప్రయివేటు హాస్పిటల్‌ ‌లో ప్రసవాలు తగ్గిపోతాయి. ప్రధానంగా సిజేరియన్‌ ‌ప్రసవాలు వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు గురించి విస్తృత ప్రచారం ఇవ్వాలి. అంగన్‌ ‌వాడి కేంద్రాలలో సమీప గర్భిణీలకు నిపుణులైన వైద్యులు చేత పూర్తి అవగాహన కల్పించాలి.అప్పుడే సహజ ప్రసవాలు సాధ్యం అవుతాయి.మాతృమూర్తులకు ప్రసవానంతర వెతలు సమసి పోతాయి.

rudra raju srinivasa raju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *