కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత డిఎస్‌ ‌కన్నుమూత

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
అధికారిక లాంఛనాలతో నేడు నిజామాబాద్‌కులో అంత్యక్రియలు
సిఎం రేవంత్‌, ‌మాజీ సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ ‌కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్‌..‌శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం నిజామాబాద్‌ ‌పట్టణానికి తరలించారు. నేడు ఆదివారం మధ్యాహ్నం ఆయన సొంత నియోజకవర్గమైన ఇందూరు పట్టణంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. పార్లమెంట్‌ ‌సమావేశాల నేపథ్యంలో దిల్లీలో ఉన్న ఆయన కుమారుడు, నిజామాబాద్‌ ఎం‌పీ అర్వింద్‌ ‌మధ్యాహ్నానికి హైదరాబాద్‌ ‌చేరుకున్న అనంతరం అనంతరం డీఎస్‌ ‌భౌతిక కాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్‌కు తరలించారు. డీఎస్‌ ‌మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత వీ హనుమంతరావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్‌ ‌భౌతికకాయానికి నివాళులర్పించారు. బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌, ‌తదితరులు డిఎస్‌ ఇం‌టికి వెళ్లి నివాళి అర్పించారు.

కాంగ్రెస్‌ అభివృద్దిలో కీలక భూమిక : డిఎస్‌ ‌మృతికి సిఎం రేవంత్‌ ‌సంతాపం
కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ ‌మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్‌.. ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ ‌పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారన్నారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్‌ ‌రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్‌ ‌రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తుచేసుకున్నారు. డీ శ్రీనివాస్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

 

ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో  విస్తరింప జేసిన కీలక నేతల్లో డీ.శ్రీనివాస్‌ ఒకరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక డిఎస్‌ ‌మృతి పట్ల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. డిఎస్‌ ‌మృతి పట్ల ఇంకా పలువురు నేతలు, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. డిఎస్‌ ‌మరణం పట్ల బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంకా డీ శ్రీనివాస్‌ ‌మృతిపట్ల మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్‌ ‌సుదీర్ఘకాలం సేవలందించారని హరీష్‌ ‌రావు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page