సమాజానికి అవసరమైన ప్రోగ్రామింగ్ ద్వారా సానుకూల మార్పునకు మద్దతు
చిన్నది ఏదైనా అందంగా ఉంటుందని నానుడి. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో కథ ఈ నానుడికి సరిగ్గా సరిపోతుంది. కమ్యూనిటీ రేడియో శక్తి అంతా సానుకూల సామాజిక లక్ష్యాల దిశగా సమాజాన్ని ప్రభావితం చేయడం, సానుకూల మార్పు ద్వారా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోనే ఉంది.ఇప్సోస్ కోసం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం తరచు చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వినియోగం ప్రాధాన్యతపై కమ్యూనిటీ రేడియో ప్రచారోద్యమం నిర్వహించిన జిల్లాల్లో ఈ ప్రచారం సాగించని బేస్ కేటరిగీ జిల్లాలతో పోల్చితే కోవిడ్-19 కేసులు 7.5% మేరకు తగ్గాయి.
వివిధ రకాల సామాజిక సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజలందరూ కలిసికట్టుగా పని చేసేలా వారి సామర్థ్యాలను పెంచడంలో సామాజిక రేడియో సమర్థతకు ఇది దర్పణం పడుతుంది. విద్య, యువత, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అన్ని అంశాలపై స్థానిక ప్రజలే కార్యక్రమాలు రూపొందించి సమాజ ప్రయోజనం కోసం సామాజిక రేడియో ద్వారా ప్రసారం చేయవచ్చు. ఈ రేడియోలో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో అధిక శాతం గ్రామీణ సమాజం భాగస్వామ్యంతో నిర్వహించే భాగస్వామ్య కార్యక్రమాలే. ఇది తప్పనిసరిగా సామాజిక మార్పునకు దారి తీస్తుంది. కమ్యూనిటీ రేడియో సహాయంతో సూక్ష్మ స్థాయికి అభివృద్ధిని విస్తరింపచేయవచ్చు.
గత 8 సంవత్సరాల కాలంలో దేశంలో కమ్యూనిటీ రేడియో ఉద్యమం మరింత పటిష్ఠం అయింది. 2014 సంవత్సరం నుంచి దేశంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల (సిఆర్‌ఎస్) సంఖ్య రెట్టింపు కన్నా పెరిగింది. నేడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో 356 సిఆర్‌ఎస్ లు కార్యక్రమాలు ప్రసారం చేస్తూ స్థానిక సమాజాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఒక వాహికగా ఉన్నాయి. ప్రధాన మీడియాలో ఇలాంటి కార్యక్రమాలకు తగినంత సమయం గాని, ప్రదేశం గాని ఉండడంలేదు.
సామాజిక, సమాజ సంక్షేమానికి సిఆర్‌ఎస్ సమర్థవంతమైన, ప్రభావవంతమైన మాధ్యమంగా నిలుస్తున్న దనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల అధ్యయన • విధాన పరిశోధన కేంద్రం (సి-ఎన్‌ఇఎస్) 2015 సంవత్సరంలో అస్సాంలోని డిబ్రూగఢ్ ప్రధాన కేంద్రంగా ‘‘రేడియో బ్రహ్మపుత్ర’’గా ప్రసిద్ధి చెందిన బ్రహ్మపుత్ర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను ప్రారంభించింది. ఈ రేడియో కేంద్రం తేయాకు తోటలు, నదీపరీవాహక ప్రాంతాలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో నివశిస్తున్న గ్రామాలకు చెందిన నిరాదరణకు గురవుతున్న వర్గాల ప్రజల కోసం కృషి చేస్తోంది. స్థానిక సమాజ నిర్మాణం, సమాజంలోని విభిన్న సామాజిక వర్గాల జనాభాను దృష్టిలోఉంచుకుని ఈ కేంద్రం అస్సామీ, మిసింగ్, సాద్రి (తేయాకు తోటల్లో పని చేసే వారు మాట్లాడే భాష), హజాంగ్, దియోరి భాషల్లో ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, పర్యావరణం, వైపరీత్య వ్యవసాయం, జానపదం, సంస్కృతి విభాగాల్లో కార్యక్రమాలు రూపొందించి రోజూ 14 గంటల పాటు ప్రసారం చేస్తోంది. అలాగే వయనాడ్ జిల్లాలోని ద్వారకలో ఏర్పాటైన కమ్యూనిటీ రేడియో మట్టోలి… రేడియో, విజువల్ మీడియాలో కెరీర్ ప్రారంభించలన్న ఆశావహులైన స్థానిక ప్రతిభావంతులకు ఒక ప్రయోగవేదికగా నిలుస్తోంది.
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘‘సమాజానికి చెందిన, సమాజం కోసం, సమాజ నిర్వహణ’’లోని సంస్థలుగా పని చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నందు వల్లనే భారతదేశంలో సిఆర్‌ఎస్ లు సమర్థవంతం అయ్యాయి. గ్రామీణ ప్రజలు, సమాజంలోని నిమ్నవర్గాలు, మారుమూల ప్రాంతాల్లో నివశించే జనాభాను అభివృద్ధి పథంలో, పరివర్తన దిశగా నడిపించే శక్తులుగా అవి నిరూపించుకున్నాయి.
– శ్రీమతి ఎస్థర్ కర్, ఇండిపెండెంట్ మీడియా కన్సల్టెంట్, పరిశోధకురాలు, కమ్యూనిటీ రేడియో ఔత్సాహికురాలు.
మాజీ డైరెక్టర్ జనరల్, పిఐబి, భారత ప్రభుత్వం