- పోటాపోటీగా విద్యార్థుల ప్రదర్శనలు
- భారీగా మొహరించిన పోలీసులు
- విసి రాజకీయ ఒత్తిడికి తలొగ్గారన్న రేవంత్
- గాంధీభవన్ ముందు కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రాహుల్ టూర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముందస్తు అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఓయూలో రాహుల్ ముఖాముఖికి అనుమతి ఇవ్వాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఓయూలో ఎన్‌ఎస్‌యుఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఓయు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలావుంటే రాహుల్ పర్యటనకు ఓయూ అనుమతినిరాకరించింది. రాజకీయకార్యకలాపాలకు అనుమతి లేదంటూ ఓయూ విసి స్పష్టం చేశారు. పాలకమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని అన్నారు. అలాగే ఓయూలో ఆందోళనలకు అనుమతి లేదన్నారు. అటు ఓయులో అరెస్ట్‌లపై విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. అరెస్టులపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో గాంధీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను మహిళా కాంగ్రెస్ నేతలు దగ్ధం చేశారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. మొత్తంగా ఇప్పుడు రాహుల్ పర్యటన నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా కేంద్రంగా రాజకీయం వేడెక్కుతుంది.
యూనివర్సిటీలోకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. అక్కడ అడుగు పెట్టకుండానే తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉస్మానియాలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఒకప్పుడు ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన విశ్వవిద్యాలయం నుంచే తెరాసపై దండయాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 6న వరంగల్ రైతు సంఘర్షణ సభకు రానున్న రాహుల్ గాంధీని 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టస్ కళాశాల వద్ద విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఓయూ వీసీని కలిసి అనుమతి కోరడం, ఆయన తిరస్కరించడం జరిగింది. వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మానవతారాయ్ సహా నలుగురు పిటిషన్ దాఖలు చేయగా… హౌస్‌మోషన్ పిటిషన్‌గా తీసుకుని విచారణ జరపాలని కోరారు.
వాస్తవానికి ఓయూ విశ్వవిద్యాలయంలో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. 2016 జూన్ 4వ తేదీన తెలంగాణ జనజాతర సమావేశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓయూలో విద్యా సంబంధ సమావేశాలు తప్ప, రాజకీయ సంబంధిత సమావేశాలకు వేదిక కారాదని హైకోర్టు జూన్ 5వ తేదీన స్పష్టం చేసింది. ఓయు కార్యనిర్వహక కౌన్సిల్ సైతం అక్కడ ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. మైకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని కూడా తీర్మానం చేసింది. 2020లో చేసిన తీర్మానాలను చూపి ఓయూ అధికారులు రాహుల్ సభకు అనుమతి ఇవ్వకుండా దాటవేసారు. మరోవైపు రాహుల్ పర్యటన గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఓయూ కేంద్రంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఓయూలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్, కాంగ్రెస్ దిష్టి బొమ్మలు పోటీలు పడి దగ్ధం చేస్తున్నారు. పోటాపోటీగా ఆందోళనలతో యూనివర్సిటీని అట్టుడికిస్తున్నారు.అసలు రాహుల్ గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్ ఎందుకు భయపడి అడ్డుకుంటున్నారనీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ సహా 18 మంది అరెస్టు చేశారని..ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఓయూ అధికారులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంతో రాహుల్ ఓయూ సందర్శనపై కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. న్యాయస్థానం తీర్పు అనుకూలంగా రాకపోతే హైదరాబాద్ నగరంలో 7వ తేదీ రాహుల్ పర్యటనలో తగినట్లు కార్యక్రమాలను మార్పులు చేయాలని పీసీసీ భావిస్తుంది.