చదువే ప్రపంచాన్ని మార్చే ఆయుధం

– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే శక్తి చదువుతోనే సాధ్యమవుతుందని, ఒకవేళ జీవితంలో అన్నీ కోల్పోయినా చదువు ఉంటే మళ్లీ నిలబడగలుగుతామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, అమ్మకు అక్షరమాల, అంగన్‌వాడీ యూనిఫాంల పంపిణీ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని మహిళలకు పిలుపునిచ్చారు. నెల్సన్ మండేలా చెప్పిన ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉంది అనే సూక్తిని ప్రస్తావించిన మంత్రి, చదువుతోపాటు సంస్కారం కూడా జీవితంలో అంతే ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం, సమాజంతో మమేకం కావడం, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం అవసరమని సూచించారు. స్నేహ సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది టీనేజీ బాలికలను పదివేలకుపైగా స్నేహ గ్రూపులుగా ఏర్పాటు చేసి భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సాధికారత అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా వాటిని విద్య, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. పెళ్లి అయినా, వృద్ధాప్యం వచ్చినా మీతో ఉండేది మీ చదువు, మీ విజ్ఞానం మాత్రమే అంటూ ప్రతి బాలిక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలని కోరారు. అంగన్‌వాడీ యూనిఫాంల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ గర్భధారణ దశ నుంచి మూడేళ్ల వయస్సు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. యూనిఫాంలను ప్రజా ప్రభుత్వం అందిస్తున్నదని, 57 రకాల విద్య, ఆట వస్తువులను పంపిణీ చేస్తున్నదని చెప్పారు. తొలి ముద్ద కార్యక్రమం ద్వారా అల్పాహారం, పాలు, గుడ్లు, పోషకాహారం అందిస్తున్నామని వివరించారు. ప్రైవేట్ నర్సరీల్లో అన్నం, పాలు, గుడ్లు ఇవ్వరు.. కానీ ప్రభుత్వ అంగన్‌వాడీల్లో పిల్లల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పారు. ప్రైవేటు బడి వద్దు.. అంగన్‌వాడి ముద్దు అని మంత్రి అన్నారు. అంగన్‌వాడీ విద్య పూర్తి చేసుకుని మొదటి తరగతిలో చేరుతున్న చిన్నారులకు విద్యారంభ ధ్రువపత్రాలను మంత్రి అందజేశారు. స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్‌లో బాలికలు విద్య, ఆరోగ్యం, సైబర్ భద్రత, రవాణా, పాఠశాల మౌలిక వసతులు, మహిళా ఉపాధ్యాయుల నియామకం, శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ పథకాలపై సంబంధిత అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో బాలికలు తమ సమస్యలను ధైర్యంగా వ్యక్తపరిచే వేదికగా స్నేహ సంఘాలు నిలుస్తున్నాయని అన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు కోసం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా లక్షలాదిమంది మహిళలు చదవడం, రాయడం నేర్చుకుని వేలిముద్రకు బదులు సంతకం చేసే స్థాయికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహిళా కమిషన్ సభ్యురాలు సదాలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, శాఖ డైరెక్టర్ శృతి ఓజా, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అధికారులు, స్నేహ సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *