గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం

– విద్యార్థులపై పెట్టుబడి భవిష్యత్తు తెలంగాణపై పెట్టుబడే
– దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట
– గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: విద్యను ఖర్చుగా కాక భవిష్యత్తు తరాలపై చేసే పెట్టుబడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బలహీనవర్గాల విద్యాభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. నేడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రేపు దేశ ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రాభివృద్ధికి, కుటుంబాల ఆర్థిక సాధికారతకు ప్రధాన శక్తిగా మారుతారని అన్నారు. ‘జనజాతీయ గరిమ ఉత్సవ్-బిర్సా లివ్స్ ఇన్ న్యూ భారత’లో భాగంగా బాబూ జగ్జీవన్ రామ్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీజీటీడబ్ల్యూఆరఈఐఎస్, ఈఎంఆరఎస్, ఆశ్రమ పాఠశాలల వార్షిక విజయోత్సవ సభలో మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పరీక్షా ఫలితాల వేడుక మాత్రమే కాదని, గిరిజన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రతిభ, సాధికారతకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

విద్య ద్వారానే సామాజిక న్యాయం

రాష్ట్రంలో సామాజిక న్యాయం కేవలం నినాదం కాదని, విద్య ద్వారా పేద వర్గాలకు సాధికారత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో విద్యే పేదరిక నిర్మూలనకు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి పేద విద్యార్థి ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకునేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఒక విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సాధిస్తే కేవలం ఆ కుటుంబం మాత్రమే కాదు.. ఒక తరం అభివృద్ధి చెందుతుందని, వేలాదిమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అందుకే విద్యారంగంలో ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని చెప్పారు.

దేశానికి ఆదర్శంగా గిరిజన గురుకులాలు

తెలంగాణ గిరిజన గురుకులాలు దేశవ్యాప్తంగా ఆదర్శ విద్యాసంస్థలుగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. 82 వేల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన ఉచిత నివాస విద్య అందిస్తున్న ఈ సంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ ఫలితాల్లో 98.86 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా 56 విద్యాసంస్థలు వంద శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు. ఇంటర్‌లో 86.53 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. జేఈఈ, నీట్, ఈఏపీసెట్ తదితర జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారన్నారు.

ధర్మపురిలో బాలికల సైనిక్ స్కూల్‌కు ప్రతిపాదనలు

ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన బాలికల కోసం ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు సమగ్ర విద్య అందించే సైనిక్ స్కూల్, డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం లభించనుందని తెలిపారు.

ఉద్యోగులకు ప్రభుత్వం వరాలు

గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 1,185 మంది పార్ట్‌టైం ఉద్యోగుల గౌరవ వేతనాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ప్రిన్సిపాల్ గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 వరకు ప్రమోషన్ అవకాశాలను 70 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ సవరణలు చేపట్టిందన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్స్‌కు నెలకు రూ.5,000 ప్రత్యేక గౌరవ వేతనం, డిప్యూటీ వార్డెన్లకు ప్రత్యేక భత్యం పెంపు, వైస్ ప్రిన్సిపాల్స్‌కు అదనపు ప్రోత్సాహక భత్యాల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు.

మౌలిక వసతులకు భారీ నిధులు

గురుకులాల్లో విద్యార్థులకు మరిన్న మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. రూ.72.83 కోట్లతో మరమ్మతులు, నిర్వహణ పనులకు అనుమతులు మంజూరు చేసినట్లు, ఆధునిక మాడ్యులర్ కిచెన్ల ఏర్పాటుకు రూ.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలన్న లక్ష్యంతో అన్ని విద్యాసంస్థలకు ఎఫఎసఎసఏఐ నుంచి ‘ఈట్ రైట’ సర్టిఫికేషన్ సాధించినట్లు చెప్పారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.565.32 కోట్లు విడుదల చేశామన్నారు.

పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం

విద్యార్థులను ప్రపంచస్థాయి అవకాశాలతో అనుసంధానించేందుకు పలు ప్రముఖ జాతీయ, సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. సీఎసఐఆర్-ఐఐసీటీతో కలిసి రీసెర్చ్, ట్రైనింగ్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీ మెడికల్ కాలేజ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో రూ.1.30 కోట్లతో అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రజాగాయకుడు నరసయ్య (నల్గొండ గద్దర్) ఆలపించిన అంబేద్కర్ గీతం విద్యార్థులను ఉత్తేజపరిచింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ల్లో ఎసఎస్‌సి, ఇంటర్, ఐఐటి, జేఈఈ, నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన, అలాగే విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను మంత్రులు మెమెంటోల,T శాలువలతో నగదు పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ ఇన్‌చార్జి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ, విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, వెడ్మా బొజ్జు, టీజీటీడబ్ల్యూఆరఈఐఎస్ కార్యదర్శి సీతాలక్ష్మి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, టీసీఆర్ అండ్ టీఐ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల, సీఎసఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులకు మంత్రి సీతక్క అభినందన

మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని సాధారణ పాఠశాలలను అధిగమించి అద్భుత ఉత్తీర్ణత శాతం సాధిస్తున్న విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. గిరిజన ప్రాంతాల గురించి మాట్లాడినప్పుడు అక్షరాస్యతలో వెనుకబడి ఉంటారని చాలామంది భావిస్తారు. అది గతంలో.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. ఈసారి టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. గతసారి ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానం సాధించాం. ఈసారి రెండో స్థానంలో నిలిచాం. ఇంకా మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలి అని సూచించారు. మహబూబాబాద్, ములుగు, ఆసిఫాబాద్ వంటి గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో మంచి ఫలితాలు రావడం సంతోషకరమన్నారు. ములుగు జిల్లా సాధించిన అద్భుత ఫలితాలు ఒక ఆదివాసి బిడ్డగా నాకు ఎంతో గర్వాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చరిత్ర సృష్టించారన్నారు. చెంచుపెంటల్లో, దళితవాడల్లో, గిరిజన తండాల్లో మీ విజయాల గురించి చర్చ జరిగితే అక్కడి పిల్లలు కూడా ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతారు. సమాజంలో అసమానతలు తగ్గి అందరికీ సమాన అవకాశాలు లభించే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మంత్రి సీతక్క విద్యార్థులకు ఉద్బోధించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *