కాంగ్రెస్‌ కు బుద్ధి చెప్పేందుకు  ప్రజలు సిద్ధం

– చిన్న కాంట్రాక్టర్లకు నిధులు, టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– జీవో 17 రద్దయ్యే వరకు పోరాటం ఆపేది లేదు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల మహా ధర్నాలో కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద శనివారం జరిగిన మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఎన్నికల ముందు చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18, ఎస్టీలకు 12, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని, అధికారంలోకి వచ్చాక 72 పైసలు కూడా ఇవ్వకుండా అడ్డగోలు జీవోలు తెచ్చారని మండిపడ్డారు. చివరికి గురుకుల పాఠశాలల్లో స్థానిక కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా దక్కకుండా చేస్తూ జీవో నెం.17 తీసుకొచ్చి ఆ టెండర్లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన జీవో 17 రద్దయ్యే వరకు, బడుగు, బలహీనవర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

నిధులు, టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం ఇద్దరికే దక్కుతున్నాయని, రేవంత్ రెడ్డి బావమరికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకే ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం నియోజకవర్గం కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు. కేవలం వాళ్ల బంధువులకే కాక బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో రూ.4 అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులు, చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ సర్కార్‌కు ఉందా అని కేటీఆర్ సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం మాత్రమే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, కేవలం రెన్యూవల్ సీఎం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం పంపి తన కుర్చీని కాపాడుకుంటున్నారని, దిల్లీకి బ్యాగులు మోసినన్ని రోజులు మాత్రమే ఆయన ఉద్యోగం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ బడుగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా దిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ఈ ద్రోహానికి రేవంత్‌తోపాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ హయాంలో సంపద సృష్టి

బీఆరఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సంపద సృష్టించాలి-పేదలకు పంచాలి అనే దృక్పథంతో పనిచేశారన్నారు. నాడు చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుని గౌరవంగా నిలబెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ అప్పులు చేసి వెయ్యికిపైగా గురుకులాలు కట్టించి 6.50 లక్షల మంది బడుగు విద్యార్థులకు ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల నుండి రూ.1.25 లక్షల వరకు ఖర్చు పెట్టి కార్పొరేట్‌స్థాయి ఉచిత విద్య, బూట్లు, బట్టలు, నాణ్యమైన భోజనం అందించారన్నారు. అప్పులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చారని, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, 15 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సాయం అందించారని తెలిపారు. రూ.72 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని నేరుగా ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. తనకు చేతగాక కేసీఆర్ అప్పులు చేశాడని రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు.

2028లో మన ప్రభుత్వమే వస్తుంది

మక్కలు, వడ్లు కొనుగోలు కాక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఏ ఊరికైనా కాంగ్రెస్ వాళ్లు వెళ్లే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టి, బొంద పెట్టాలని ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆరఎస్ ప్రవీణ్ కుమార్ ఎ పోరాడారో బడుగుల సమస్యలపై కూడా అలాగే పోరాడతామన్నారు. బడుగువర్గాల సమస్యలపై అధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఒకవేళ వాళ్ళు వినకపోతే భవిష్యత్తులో దిల్లీ వేదికగా పోరాడతామని హెచ్చరించారు. 2028లో తప్పకుండా బీఆరఎస్ ప్రభుత్వమే వస్తుందని, నాడు 10 వేల మంది కాదు దాదాపు 50 వేల మంది బడుగు, బలహీనవర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ తీసుకుంటారని కేటీఆర్ అభయమిచ్చారు.

న్యాయవాది ఖాజా కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

మాసాబ్ ట్యాంక్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ నివాసాన్ని కేటీఆర్ శనివారం సందర్శించారు. లాయర్ మొయినుద్దీన్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆరఎస్ సీనియర్ నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, తలసాని సాయికిరణ్ యాదవ్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో కీలక పాత్ర పోషించే ఒక న్యాయవాదిని హత్య చేయడం అత్యంత విచారకరమని, ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘోర ఉదంతంపై ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ కేసును వేగంగా విచారించి బాధ్యులకు తగిన శాస్తి జరిగేలా చూడాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేయాలని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కష్టసమయంలో బీఆర్ఎస్ పార్టీ మొయినుద్దీన్ కుటుంబానికి అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతాని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *