- అత్యంత ప్రమాద నిరంకుశ పాలన
- రాజ్యాంగాన్ని తిరగరాస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనం
- రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశంలో టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్
జగిత్యాల, మార్చి 15(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేండ్ల పాలనలో ఏనాడు రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆచార్య కోదండరామ్ దుయ్యబట్టారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సదస్సులో ఆయామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని ప్రజాసంఘాలు, కుల సంఘాలు, హక్కుల సంఘాలు, పొలిటికల్ జెఎసి ల నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుమాల గంగారాం అధ్యక్షతన ఈ సన్నాహక సదస్సు జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మంద కృష్ణ మాదిగ, తెలంగాణ ఉద్యమ రథ సారధి, తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రొ. యం. కోదండరామ్ మాట్లాడుతూ కుల-మత ఘర్షణల వల్ల విడిపోయి ముక్కలైన మన భారతదేశం మళ్లీ కలిసి ఒక్కటయ్యిందంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే సాధ్యం అయిందని అన్నారు. ఏడేండ్ల పాలనలో రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కెసిఆర్ మాత్రమేనని ఆరోపించారు.
అత్యంత ప్రమాదకరమైన నిరంకుశ పాలన కెసిఆర్ దేనని తేల్చిచెప్పారు. అన్ని వర్గాలకు, అగ్రవర్గంలోని నిరుపేదలకు సైతం ఈమాత్రం సంక్షేమ ఫలాలు అంది సముచిత స్థానం దక్కుతుందంటే భారత రాజ్యాంగం వల్లనే సాధ్యం అవుతుందన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని తిరగ రాస్తాననడం కెసిఆర్ స్థాయికి తగదని అన్నారు. అది అతని అహంకారానికి నిదర్శనమని ఆచార్య కోదండరామ్ పేర్కొన్నారు. ఏడేండ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే నామమాత్రంగా బీడీ కార్మికుల రేట్లు పెంచి చేతులు దులుపుకున్నారని అన్నారు. భారత దేశంలో అందరికీ, రిజర్వేషన్లను బట్టి తగు న్యాయం జరుగుతుందని, రాజ్యాంగ బద్ధమైన ఈ రిజర్వేషన్లే లేకపోతే బడుగు, బలహీన, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు ఈమాత్రం స్వేచ్చ – స్వాతంత్రం లభించేది కాదన్నారు. వీటన్నిటినీ కాలరాసి తన పాలనలో కెసిఆర్ తన అహంకార భావంతో వీటిని రద్దు చేసి మన హక్కులను, మన స్వేచ్ఛను, మనలను దోచుకునేందుకు కుట్రలో భాగంగానే కెసిఆర్ నోట రాజ్యాంగ రద్దు, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అనే మాటలు వొచ్చాయని కోదండరామ్ సూచించారు.
కెసిఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేస్తాం : మంద కృష్ణ మాదిగ
మనం అడగకున్నా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి మోసం చేసి, నేడు మన దళితుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రాజ్యాంగ పరంగా మనకున్న వోటు హక్కుతోనే రాజకీయంగా భూస్థాపితం చేద్దామని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మన రాష్ట్రానికి ఒక మహిళా గవర్నర్‌గా రాకుంటే మంత్రివర్గంలో మహిళలకు ఈ మాత్రం చోటు దక్కేది కాదని తెలిపారు. 93 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు లేనన్ని మంత్రి పదవులు అరశాతం కూడా జనాభా లేని దొరలకు నాలుగు మంత్రి పదవులా…? అని ఆయన ప్రశ్నించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే లేకుంటే తెలంగాణ రాష్ట్రం వొచ్చేదా…? కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా…?? అని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఒక చాయ్‌వాలాను ప్రధానమంత్రిగా చేసింది భారత రాజ్యాంగమేనని, భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం గుడి మెట్లు కూడా ఎక్కలేని ఇందిరాగాంధీ రాజ్యాంగం వల్లనే దేశానికి ప్రధాన మంత్రి అయిందన్నారు. నేడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన ఉద్యోగ నియామకాల్లో పెరిగిన జనాభా ప్రకారం కుల రిజర్వేషన్ల శాతం ఎందుకు పెంచలేదన్నారు.
ప్రపంచ దేశాలు మొత్తం ఐక్యరాజ్య సమితిలో కూడా అంబేడ్కర్ రచించిన భారత దేశ రాజ్యాంగమే గొప్పదని తీర్మానాలు చేస్తే మన అహంకార ముఖ్యమంత్రి కెసిఆర్ మన రాజ్యాంగమే పనికి రాదనే విధంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ దేశంలో అర్హులైన మనందరికీ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, కలిగాయంటే ఆనాడు అత్యంత మేధావిగా గుర్తింపబడి రాజ్యాంగాన్ని రాసే గొప్ప అవకాశాన్ని పొందిన అంబేడ్కర్ ఆశయాలే నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కినపెళ్లి కాశీనాథమ్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, బిసి సంక్షేమ సంఘాల జిల్లా అధ్యక్షులు జీకూరి శ్రీహరి, గాజుల నాగరాజు, బిసి నాయకులు భార్గవ్, ఎమ్ ఎస్ పి, ఎమ్మార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు బెజ్జంకి సతీష్, చిట్టపెళ్ళి లక్ష్మణ్, సురుగు శ్రీనివాస్, మోకినపెళ్లి రాజమ్మ, శనిగరపు కాంతమ్మ, కాళ్ళ రాజయ్య, ఏలీయా, చిలుముల లక్ష్మణ్, గడప చంద్రశేఖర్, బనాల రామస్వామి, రాజాం, దుర్గయ్య, రాజయ్య, పెద్దిరాజ్, మహేష్, కరుణాకర్, నక్క సుప్రియ, ఎర్రం అనూష, తదితరులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.