ఉమ్మడి పాలనలో ప్రభుత్వ వైద్యరంగం విచ్చిన్నం

  • జిల్లాకో మెడికల్‌ ‌కళాశాల ఇచ్చిన ఘనత మాదే
  • దేశంలోనే అన్ని జిల్లాలలో మెడికల్‌ ‌కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ: ఆరోగ్య శాఖ పద్దుపై చర్చలో మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటు వైద్య రంగాన్ని ప్రోత్సహించారని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. దీంతో ప్రజలు ప్రతీ ఆరోగ్య సమస్యకు ప్రైవేటును ఆశ్రయించి ఆర్థికంగా చిక్కిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. శనివారం ఆరోగ్య శాఖ పద్దుపై జరిగిన చర్చలో మంత్రి హరీష్‌ ‌రావు సమాధానమిస్తూ సీఎం కేసీఆర్‌ ఈ ‌పరిస్థితులు మార్చేందుకు అనేక చర్యలు చేపట్టారని చెప్పారు. జిల్లాకో మెడికల్‌ ‌కళాశాల ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైన చర్య అని పేర్కొన్నారు. దేశంలోనే అన్ని జిల్లాలలో మెడికల్‌ ‌కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నదని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పాలకులు నిమ్స్ ‌తరువాత ఒక్క సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను కూడా తీసుకు రాలేదనీ, కానీ, సీఎం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌ ‌నగరంలోని నలు మూలలా రూ.1100 కోట్లతో నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నిర్మించబోతున్నదని చెప్పారు.

దేశంలోనే వైద్యరంగంలో ఒక్కొక్కరిపై చేస్తున్న వ్యయం రూ.1698గా ఉండేదనీ, ఇది దేశంలో మూడో స్థానమనీ, కానీ, ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వల్ల ఒక్కొక్కరిపై చేస్తున్న ఖర్చు రూ.3092కు చేరుతుందన్నారు. దీంతో తెలంగాణ వైద్యరంగంలో దేశంలో తొలి స్థానానికి చేరుతుందనీ, గతేడాది వైద్యరంగానికి బడ్జెట్‌లో రూ.6295 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం బడ్జెట్‌లో రూ.11,440 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పదెంచల వ్యవస్థకు నాంది పలికిందన్నారు. ఇందులో భాగంగా మూడంచెల వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి చేసిందని వివరించారు.

ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వైద్య విభాగాలకు తోడు కొత్తగా ప్రివెంటివ్‌ ‌సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యాన్ని సైతం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు. కొరోనా మొదటి, రెండో వేవ్‌లలో ఆక్సీజన్‌, ‌మందులు, పడకల కొరత లేకుండా ప్రభత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందనీ, కొరోనాకు ముందు కేవలం 1400 పడకలకు ఆక్సీజన్‌ ‌సరఫరా ఉంటే ఇప్పుడు మొత్తం 27996 పడకలకు ఆక్సీజన్‌ ‌సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు మాతా శిశు మరణాల తగ్గించడానికి సైతం అనేక చర్యలు చేపట్టామనీ, ఇందుకోసం రాష్ట్రంలో కేంద్రాలను 18 నుంచి 65కి పెంచామన్నారు. రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధికి కేంద్రం సహకరించనప్పటికీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామనీ ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page