ఆహార భద్రత చట్టానికి నగదు బదిలీ తూట్లు

rudra raju srinivasa rajuపేదరికపు రేఖకు దిగువున ఉండి బహిరంగ మార్కెట్లోని అధిక ధరలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని వారిని ఆదు కోవాలి అనే పవిత్ర ఆశయంతో మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.ఎందరో బడు గు జీవుల ప్రాణాలను ఈ పథ కం నిలబెట్టింది. కరువు కాటకాల సమయంలో ఆకలి మరణాలకు ఇది అడ్డు కట్ట వేసింది. కాలక్రమంలో దీని పనితీరులో మార్పు రావడం ప్రభుత్వాలు ఈ పథకాలను వోటు బ్యాంకుగా మార్చుకోవడం వంటి పరిణామాల మధ్య దీని ఆశయానికి తూట్లు పొడవటం ఆరంభం అయ్యింది. ప్రజా పంపిణీ వ్యవస్ధలో పేదలుకు ఆహార భద్రత కలిగించాలనే ఉద్దేశ్యంతో కేటాయిస్తున్న బియ్యం ఎక్కువగా పక్క దారి పడుతున్నాయని , దలారుల ద్వారా అవే బియ్యం రీసైక్లింగ్‌ ‌చేసి తిరిగి బహిరంగ మార్కెట్‌ ‌లో అత్యధిక ధరలకు విక్ర యిస్తున్నారు అనే ఆరోపణలు చాలా కాలం నుండి వస్తు న్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం విషయానికి వస్తే ప్రస్తుతం 1.45 కోట్ల రేషన్‌ ‌కార్డులున్నాయి. సుమారు 5 కోట్ల మంది కార్డుదారు లున్నారు. ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున నెలకు 2లక్షల టన్నుల బియ్యం రేషన్‌ ‌ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇవి కాకుండా మధ్యాహ్న భోజన పథకానికి, ఐసీడీఎస్‌ ‌కు కూడా బియ్యం సరఫరా చేస్తున్నారు. మొత్తం కలిపి ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్ఠంగా 35 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతాయి. రాష్ట్రంలో సగటున ఏడాదికి 80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తున్నారు. వాటిని మిల్లింగ్‌ ‌చేశాక ప్రభుత్వానికి 59 లక్షల టన్నుల బియ్యం అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో 15 నుంచి 20 లక్షల టన్నుల మధ్య ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు ఏపీ ప్రభుత్వం ఇస్తోంది. మిగిలిన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నిల్వ చేసి కొరత వచ్చినప్పుడు వినియోగిస్తుంది.అయితే రేషన్‌ ‌ద్వారా లబ్ధిదారులకు కిలో 1 రూపాయికే అందిస్తున్న మొత్తం బియ్యంలో సుమారు 60 శాతం పై బడి పేద వర్గాల వారు ఆ బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు.. మిగిలిన 40 నుండి 30 శాతం మంది 1 రూపాయికి లభించిన ఈ బియ్యాన్ని దలారులకు 10 నుండి 15 రూపాయిలకు అమ్మి వచ్చిన సొమ్ముతో మార్కెట్లో 40 నుండి 50 రూపాయిలకు సన్న బియ్యం కొనుగోలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ రూపంలో విక్రయించే బియ్యం దళారులకు రైస్‌ ‌మిల్లర్లకు కల్పతరువుగా మారింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అయితే అదే సమయంలో మరొక పక్క అర్థాకలితో అల్లాడుతున్న కోట్లాది మంది నిరుపేదలకు ఈ రేషన్‌ ‌బియ్యం ఆకలి తీర్చుతున్న విషయం కాదనలేని వాస్తవం.ప్రభుత్వాలు ఈ సత్యాన్ని గుర్తెరగాలి. ప్రజా పంపిణీ వ్యవస్ధలో జరిగే అవినీతిని అరికట్టే నిమిత్తం రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ అధికారులు ఉన్నారు. అయితే వీరు నామ మాత్రంగా దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు.సరైన నిఘా లేకపోవడం వల్లనే దలారులు భయం లేకుండా లారీలకు లారీలు బియ్యం మిల్లులకు తరలించేస్తున్నారు. ఇవి చూస్తూ అధికారుల మిన్నకుండిపోవడం అత్యంత సహజంగా మారిపోయింది. ప్రజా పంపిణీ అధికారులు విజిలెన్స్ అధికారులు తలుచుకుంటే ఈ మాఫియాను కట్టడి చేయడం పెద్ద విషయం కాదు.రాజకీయ నాయకుల భరోసాతో ఈ బియ్యం మాఫియా వ్యాపారం సాగిపోతుంది అనేది జగద్విదితమే.అయితే ప్రభుత్వాలు ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఈ పధకం నుండి బయట పడే మార్గం దిశగా నగదు బదిలీ పథకం పేరిట వెలుగులోనికి వచ్చింది పథకం.ఈ విషయంలో ఒక్కరిని మాత్రమే తప్పు పట్టలేము ఎందుకంటే ఈ విషయంలో అన్ని రాజకీయ పక్షాలదీ ఒకే తీరు.గతంలో ఆంధ్రప్రదేశ్‌ ‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రకటించి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు.తదుపరి రాజ శేఖర రెడ్డి కూడా ఈ దిశగా అడుగులు వేశారు.దిల్లీ రాష్ట్రంలో షీలా దీక్షిత్‌ ‌కూడా ప్రయత్నం చేసి వెనుదిరిగారు..జార?ండ్‌ ‌రాష్ట్రంలో నగదు బదిలీ ప్రారంభించినా ప్రజా వ్యతిరేకత నడుమ 3 నెలల కాలంలోనే తోక ముడిచారు.ప్రస్తుతం కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో మాత్రం అమలులో ఉంది. జగన్మోహన్‌ ‌రెడ్డి అధికారంలో నికి వచ్చిన తరువాత రేషన్‌ ‌లబ్ధిదారులు బియ్యం విక్రయానికి గల కారణం దొడ్డు బియ్యం అందించడమే అని నిర్థారించారు.రేషన్‌ ‌లో సన్న బియ్యం అందిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించి పేదలకు సన్న బియ్యం ఇంటి వద్దకే అందిస్తాం అని ప్రకటించారు.ఇది మంచి ప్రత్యామ్నాయం అని ప్రజలు భావించారు.అయితే బియ్యం ఇంటి వద్దకు వస్తున్నాయి కానీ బియ్యం నాణ్యత మారలేదు.ఫలితంగా గతంలాగే కొంత శాతం దొడ్డు బియ్యం పక్క దారి పట్టడం కొనసాగుతూనే ఉంది.

గతంలో ఈ బియ్యం అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను ఉక్కు పాదంతో అణచి వేస్తాం అనే ప్రకటనలు గుప్పించారు. అంతే కాదు నూతన సాంకేతికత ద్వారా రేషన్‌ ‌బియ్యం రీసైక్లింగ్‌ ‌మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో తొలిసారిగా ప్రయత్నం కూడా జరిగింది.అదే బియ్యం కాల నిర్ధారణ పరీక్ష (రైస్‌ ఏజ్‌ ‌టెస్టు) దీని ద్వారా పౌరసరఫరాల శాఖ గతేడాది రెండు సీజన్లలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు.అయినా బియ్యం అక్రమ రవాణా ఆగలేదు.ఈ సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని మరలా తెర మీదకు తీసుకు వచ్చింది.రాష్ట్రంలో పైలట్‌ ‌ప్రాజెక్టుగా కొన్ని మున్సిపాలిటీలను ఎంచుకుని దాని ఫలితాలను బట్టి రాష్ట్రం అంతటా ఈ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది.కిలో బియ్యానికి 12 లేదా 15 రూపాయిలను లబ్ధిదారులు అంటే మహిళల బ్యాంక్‌ ‌ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వ సంకల్పం..ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడానికి పరోక్షంగా బియ్యం అక్రమ రవాణా చేసే మాఫియాను అరికట్టలేము అని చెప్పడమే అవుతుంది.. మిల్లర్లపై ఏ మాత్రం చర్యలు తీసుకోలేం అని ఒప్పు కోవడమే అవుతుంది.అందుచేతనే నగదు బదిలీకి సిద్ధం అయ్యారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.దీనికి పర్యవసానంగా ఎదురయ్యే ప్రభావాలు కొత్త సమస్యలు తీసుకు వస్తాయి.అంతే కాదు ఈ చర్య వలన సమాజంలో మరొక వర్గం వారి భద్రత ప్రశ్నర్థకం అవుతుంది.రేషన్‌ ‌నిమిత్తం ప్రభుత్వం సేకరించి పంపిణీ చేసే బియ్యానికి 30 నుండి 35 రూపాయిలు ఖర్చు అవుతూ ఉంటే దానికి నగదు బదిలీలో 15 రూపాయిలు వరకు బదిలీ చేసి మమ అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ స్ధితిలో లబ్దిదారుడు తనకు వచ్చే 15 రూపాయలతో సన్న బియ్యం కొనాలి అంటే మరొక 30 రూపాయిల వరకూ పెట్టవలసి వస్తుంది ప్రభుత్వానికి మాత్రం కేజీకి 20 రూపాయిలు కలసి వస్తుంది.అంటే దీనిని బట్టి నగదు బదిలీ వలన ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికే తప్ప లబ్ధిదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం కాదని తెలుస్తుంది.

మరొక విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 1 కోటి 40 లక్షల కార్డులు ఉన్నాయి వీటిలో దాదాపు 25 లక్షల వరకు బోగస్‌ ‌కార్డులు అంటే అర్హులు కాని వారు కూడా రేషన్‌ ‌పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
ప్రభుత్వ వ్యయాలను తగ్గించాలి అంటే అనర్హులకు ఏరివేయాలి..కానీ సర్కారుకు అలా చేసే ధైర్యం లేదు.ఎందుకంటే ఓట్లే పరమావిధిగా భావించే రాజకీయ పక్షాలు వలన ఇది సాధ్యపడే విషయం కాదు.40 శాతం బియ్యం అమ్ముతున్నారు అంటే 60 శాతం కడు పేదరికంలో ఉన్న వాళ్ళు 1 రూపాయి బియ్యాన్ని తింటున్నారు కదా వాళ్లకు 15 రూపాయిలు ఇచ్చి చేతులు దులుపుకుంటే వాళ్ళు బహిరంగ మార్కెట్‌ ‌లో అధిక ధరలకు బియ్యాన్ని కొనుగోలు చేయగలరా? అందరకూ నగదు బదిలీ చేస్తే రైతుల వద్ద ఆహార ధాన్యాలను ఎవరు కొనుగోలు చేస్తారు.ప్రజా పంపిణీ ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నా ఇంకా ఇప్పటికి గోదాములలో బియ్యం నిల్వలు పేరుకు పోయి ఉంటున్నాయి.అదే ప్రభుత్వం నగదు బదిలీ వలన ధాన్యం కొనుగోలు నిలిపి వేస్తే రైతు తన ధాన్యాన్ని ఎవరికి అమ్మాలి.వ్యాపారస్తులే గతి వారికి రైతులను మోసం చేయడం మరింత సులభం అవుతుంది.

బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడానికి తెర తీసినట్లు అవుతుంది.ఇది ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుంది.అంతే కాదు ఈ వ్యవస్థ పై ఆధార పడిన రేషన్‌ ‌డీలర్ల కుటుంబాలు రోడ్డున పడతాయి.వాళ్లకు ప్రత్యమ్నాయ ఏమి చూపుతారు.అంతే కాదు రేషన్‌ ‌సరుకులను తరలించే వాహనాలు మరియు దీనిపై ఆధారపడిన వేలాది మంది హమాలీ కార్మికుల భవితవ్యం ఏమిటి? ఇంటి వద్దనే రేషన్‌ అం‌దించే నిమిత్తం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వేల కొద్దీ డెలివరీ వాహనాలు మాటేమిటి వాటిపై ఆధారపడిన కార్మికుల భవిష్యత్‌ ఏమిటి? ఆహార భద్రత కల్పించడం అనే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అయితే దానిని వదిలించుకోవాలని చూడటం ప్రజా పంపిణీ వ్యవస్ధను నిర్వీర్యం చేయడమే అవుతుంది. 1 రూపాయికే బియ్యం ఇవ్వడం వలన ప్రభుత్వానికి భారమే సందేహం లేదు.అయితే ఒక రూపాయికి బియ్యం ఇవ్వమని ప్రజలు ఎప్పుడూ అభ్యర్దించలేదు.మార్కెట్‌ ‌లో ఈ రోజు ఒక రూపాయికి దొరికే వస్తువు ఏదయినా ఉందా? నాణ్యమైన బియ్యం ఇచ్చి పది రూపాయిలు ధర నిర్ణయించండి.ఒక్క బియ్యం గింజ కూడా బయటికి పోదు.కానీ అధికారమే పరమావిధిగా గల ఏ రాజకీయ పక్షం ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోదు.ఒక వేళ తీసుకున్నా ప్రతిపక్షాలు బతకనివ్వవు. ఈ స్ధితిలో నగదు బదిలీ ద్వారా ప్రజా పంపిణీని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి.ఈ మధ్యనే సుప్రీం కోర్టు వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ‌రేషన్‌ ‌పథకాన్ని దేశంలో ప్రతీ రాష్ట్రం అమలుపరచివతీరాలని వలస కార్మికులు ఎక్కువుగా ఉన్న దృష్ట్యా వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఆహార ధాన్యాలు పొందే వీలు కలిపించాలి అని ఆదేశించడం జరిగింది.దీనికి భిన్నంగా నగదు బదిలీ అనే ఆలోచన చేయడం ఆహార భద్రత చట్టాన్ని విస్మరించినట్లు కాదా?నగదు బదిలీ అనేది సంబంధిత బ్యాంక్‌ ‌ఖాతాకు జమ చేసినపుడు ఆ సొమ్ము బ్యాంకు నుండి తీసుకోవాలి.. అయితే గ్రామీణ మారుమూల ప్రాంతాలలో బ్యాంక్‌ ‌సౌకర్యం అందరికి ఉందా ?.

ఒక వేళ సాంకేతిక ఇబ్బందులతో సబ్సిడీ నగదు జమ కాకపోతే నిరక్షరాస్యులు అయిన పేదవాళ్లు బ్యాంకులు చుట్టూ సచివాలయాల చుట్టూ తిరిగే అవస్ధలు ఎన్నో సంభవిస్తాయి.అంతే కాదు మహిళల ఖాతాలో జమ అయిన ఈ డబ్బును వ్యసన పరులైన మగవాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇది నిర్బంధం కాదు నగదు కోరుకున్న వారికే అని చెబుతుంది.రెండు నెలలు నగదు తీసుకున్న తరువాత మరలా బియ్యం తీసుకోవచ్చు అని చెబుతుంది. ఈ ప్రయోగంలో ఉన్న అంతరార్ధం ఏమిటో అర్థం కావడం లేదు.ఏది ఏమైనా ప్రభుత్వ అంతిమ లక్ష్యం అందరినీ నగదు బదిలీకి మార్చడమే.ఇప్పటికే కేంద్రం గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌సబ్సిడీ పై వ్యవహరించిన తీరు అందరికి తెలిసిందే.ఆర్భాటంగా ముందు 150 రూపాయిల వరకు గ్యాస్‌ ‌సబ్సిడీ వేశారు ప్రస్తుతం 10 రూపాయిలు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు..కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు ఈ విషయంలో పట్టుబడుతున్నాయి అంటే ప్రపంచ బ్యాంకు మరియు ఇతర అంతర్జాతీయ ద్రవ్య సంస్ధలు ముంగిట ఈ ప్రభుత్వాలు సబ్సిడీలు అనతి కాలంలోనే తొలగిస్తాం అనే హామీ ఇచ్చాయి..ఒక వేళ ఆ హామీ నెరవేర్చక పోతే వారి నుండి రుణాలు లభించవు.ప్రజా సంక్షేమం కన్నా రుణము ముఖ్యం.అందుకే ఆ దిశగా మన ప్రభుత్వాలు ప్రయాణం చేస్తున్నాయి.ఇంటిలో ఎలుకలు ఉన్నాయని ఇల్లును తగలబెట్టుకోలేం కదా… అలాగే పధకం అమలులో లోపాలు ఉంటే పధకం రద్దు చేయడం ఒక్కటే మార్గం కాదు.పటిష్టంగా అమలు చేసే విధంగా నిర్వహణ చేపట్టాలి.. దానికి వెనక్కు తగ్గితే ప్రభుత్వానికి నిర్వహణా సామర్థ్యం లేనట్టు ఒప్పుకున్నట్లే అవుతుంది.చిత్త శుద్దితో వ్యవహరిస్తే ఖచ్చితంగా అవినీతిని అంతం చేయవచ్చు..ఒక పక్క ఆహార భద్రత చట్టం ఏర్పాటు చేసి మరొక పక్క ఆహార అభద్రత కలిగించే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోవడం సమంజసమా? ఈ తరహా విధానాలను ఆహార భద్రత చట్టం దృష్ట్యా సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పే అవకాశం కూడా లేకపోలేదు.వీటి అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయడం ఎంతైనా శ్రేయస్కరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *