ఆత్మరక్షణ

నిజానికి ఈ ఎఫ్‌ఐఆర్‌ ఒక్క నేరాన్ని కాదు, రెండు నేరాలను నమోదు చేస్తుందన్న మాట. మీరు ఆ ఎఫ్‌ఐఆర్‌ను జాగ్రత్తగా చదివితే అందులో మృతుడు పాల్పడినట్టుగా చెపుతున్న నేరం ఉంటుంది. ఆ వ్యక్తిని ఆత్మరక్షణార్థం కాల్చి చంపిన నేరం కూడ ఉంటుంది. అది ఆత్మరక్షణే అనుకుందాం. కాని అది ఆత్మరక్షణ కోసం చేసిన హత్య. అంటే ఎఫ్‌ఐఆర్‌ ఏం చెపుతుందంటే ఒక హత్య జరిగింది. కాని ఆ హత్యలో అంతకు ముందు హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయాడు. అంటే ఇందులో ఒకరి హత్యా ప్రయత్నం నేరం ఉంది. మరొకరి హత్యానేరం ఉంది.

ఎన్‌కౌంటర్లు ఇప్పుడయితే నిర్విచక్షణగా చేస్తున్నారు గాని మొదటినుంచీ ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనలన్నిటినీ చూస్తే నాయకులను ఏరి చంపడం కనబడుతుంది. అంటే ఏమిటన్నమాట? ఒక నాయకుడ్ని చంపితే ఆ ఉద్యమం బలహీన పడుతుంది. అంటే నాయకులను చంపడమనేది ఒక ఉద్దేశ్యపూర్వక విధానం అన్నమాట. ఇటీవల రామ కృష్ణను చుట్టుముట్టారన్న వార్త వచ్చింది. ఆయన చర్చలలో పాల్గొన్న నాయకుడు. అప్పుడు చాలా మంది ‘అంత పెద్ద చేప దొరికితే చంపకుండా వదిలి పెడతారా’ అన్నారు. ఆ మాట ఏ పోలీసు అధికారి దగ్గరయినా వచ్చి ఉండవచ్చు. లేదా ఎవరయినా మామూలు మనుషులు కూడా అని ఉండవచ్చు. ప్రజలలో ఉన్న అవగాహన అది.రాజకీయాలంటే, పాలన అంటే ప్రజలకు, పోలీసులకు కూడ ఉన్న అవగాహన అదే. నాయకులను పోలీసులు చంపుతారు అనేది అందరికీ తెలిసిన విషయం.

ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనలన్నీ ఎట్లా అయిపోయాయంటే అది జరిగిన చోటికి వెళ్ళకుండా కూడా అది ఎట్లా జరిగి ఉంటుందో నేను రాయగలను. అది నిజం కూడ అవుతుంది. అందువల్లనే పౌర హక్కుల సంఘాలు ఘటనలు జరిగిన చోటికి వెళ్ళి, ప్రజలను కలిసి రూపొందించిన నిజ నిర్ధారణ నివేదికలు అంతగా వాస్తవికంగా ఉంటున్నాయి. పోలీసులు గాని, ప్రభుత్వాలు గాని ఆ నివేదికలలో ఏ ఒక్క అంశాన్నీ తప్పు అని చెప్పలేక పోతున్నాయి.
మేళ్ళచెరువు నాగేశ్వరరావును చంపేశారు. ఆయన దళితుడు. అమృత రెడ్డి అనే ప్రైవేటు వ్యక్తికి తుపాకి ఇచ్చి కాల్చి చంపేయమన్నారు. అప్పుడు కృష్ణమూర్తి ఎస్పీ. ఈ సంఘటన మినహాయిస్తే ఆయన చాల మంచి అధికారి. ఈ హత్యే ఆయన చరిత్ర మీద మచ్చ. మరోరకంగా చెప్పాలంటే, ప్రభుత్వ భాషలో చెప్పాలంటే ఆయన అసమర్ధుడైన ఎస్పీ అన్నమాట. పరిస్థితులు అట్లా మారిపోయాయి. మంచి అధికారులను అసమర్ధులనే పరిస్థితి వచ్చింది. ఆయన ఎస్పీగా తన శాఖను కేవలం కాగితాల మీద పాలిస్తుండే వాడే గాని పెద్దగా చట్టవ్యతిరేక పనులకు పూనుకోలేదు.

నాగేశ్వరరావు హత్య తర్వాత నేను వెళ్ళి ఆయనను ఇంటర్వ్యూ చేశాను. ‘నన్నీ ప్రశ్నలు అడగడానికి మీరెవరు’ అని అడిగాడాయన.
‘నేను ఒక పౌరుణ్ని, మిమ్మల్నీ, ఏ అధికారినైనా ప్రశ్నించే హక్కు నాకుంది’ అని చెప్పాను.
నేను, తారకం గారు మరికొందరం అక్కడికి వెళ్ళాం. మేం అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఆయన నిరాకరించాడు.
అట్లా అడుగుతూ పోతుంటే ‘సెల్ఫ్‌ డిఫెన్స్‌’ (ఆత్మరక్షణ) అన్నాడు. సాధారణంగా పోలీసులకు ఉండే జవాబు అది ఒక్కటే.
ఆత్మరక్షణ అనే మాట వెనుక ఎంత చట్టపరమైన వాదనలు ఉన్నాయి! చంపేసి ఎందుకు చేశావయ్య అంటే ఆ జవాబు చెప్పడానికి ఎంత అవగాహన కావాలి! మన పోలీసులకు దానితో పనిలేదు. ఎవడిని పడితే వాడిని చంపేసి ‘ఆత్మరక్షణ కోసం చంపాం’ అనవచ్చు.

ఈ వ్యవహారమంతా నేను జస్టిస్‌ భార్గవ కమిషన్‌ ముందు వాదనలలో తేటతెల్లం చేశాను. ‘ఆత్మరక్షణ అనే సాకుతో ఎవరినైనా చంపిపారేయవచ్చునా’ అని ప్రశ్నించాను.
ప్రతి ఎన్‌కౌంటర్‌ విషయంలోనూ ఒక ఎఫ్‌ఐఆర్‌ తయారవుతుంది. అందులో చనిపోయిన వ్యక్తిపేరు రాస్తారు. ఆ వ్యక్తి మీద సెక్షన్‌ 307 (హత్యా ప్రయత్నం), సెక్షన్‌ 147, 148, 149 (దొమ్మీ, ఆయుధ ధారణ, చట్టవ్యతిరేక సమావేశం) ల కింద అభియోగాలు నమోదు చేస్తారు.
నిజానికి ఈ ఎఫ్‌ఐఆర్‌ ఒక్క నేరాన్ని కాదు, రెండు నేరాలను నమోదు చేస్తుందన్న మాట. మీరు ఆ ఎఫ్‌ఐఆర్‌ను జాగ్రత్తగా చదివితే అందులో మృతుడు పాల్పడినట్టుగా చెపుతున్న నేరం ఉంటుంది. ఆ వ్యక్తిని ఆత్మరక్షణార్థం కాల్చి చంపిన నేరం కూడ ఉంటుంది. అది ఆత్మరక్షణే అనుకుందాం. కాని అది ఆత్మరక్షణ కోసం చేసిన హత్య. అంటే ఎఫ్‌ఐఆర్‌ ఏం చెపుతుందంటే ఒక హత్య జరిగింది. కాని ఆ హత్యలో అంతకు ముందు హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయాడు. అంటే ఇందులో ఒకరి హత్యా ప్రయత్నం నేరం ఉంది. మరొకరి హత్యానేరం ఉంది.
ఈ రెండు నేరాలను విచారించాలి. పరిశోధించి, సాక్ష్యాధారాల ద్వారా నిజం తేల్చాలి. అది ఆత్మరక్షణార్థమే జరిగిందా, ఆ ఆత్మరక్షణా ప్రయత్నానికి ముందు జరిగిన ఘర్షణ ఎంత, ఆవతలివైపు నుంచి ఎంత పెద్ద ఎత్తున బలప్రయోగం జరిగింది, ఇటువైపు నుంచి జరిగిన బలప్రయోగం అంతదేనా, అంతకన్నా ఎక్కువదా, అది అవసరమైనదేనా- ఇవన్నీ విచారించడానికీ న్యాయస్థానాలున్నాయి.
నేనీ వాదనంతా జస్టిస్‌ భార్గవ ముందర వినిపించాను. ఆయన నా వాదనతో ఏకీభవించారు.
కాని పోలీసులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ చట్టపరమైన విషయాలను పట్టించు కునే స్థితిలో లేరు. నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నారు.

ఈ విషయంలో రాజశేఖర రెడ్డి సూటిగా చెప్తున్నాడు. ‘వాళ్ళు చంపుతుంటే చంపకుండా ఎట్లా ఉంటారయా’ అని నేరుగా అడిగేస్తున్నాడు. రాయలసీమ భాషలో ప్రతీకారం గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు చంపే హక్కు ఉన్నదనే అనుకున్నాడు. ఎన్‌.టి. రామా రావుకు ఈ విషయాలు ఇంతగా తెలియవనుకుంటాను.
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో ప్రభుత్వోద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా ఎవరినైనా చంపితే, అది హత్యానేరానికి మినహాయింపుగా చూడాలి ఉన్నమాట నిజమే. కాని ఆ మినహాయింపు పొందాలంటే ఆ అతి బలప్రయోగం విధి నిర్వహణలో భాగంగా అవసరమైందని రుజువు చేయాలి. న్యాయస్థానం నమ్మడానికి సాక్ష్యాధారాలు సమర్పించాలి. ఎవిడెన్స్‌ ఆక్ట్‌ ఏమంటుందంటే, ఏదయినా విషయంలో నువు మినహాయింపును కోరుతున్నావంటే, ఆ మినహాయింపు ఏ నేరానికి సంబంధించినదో, ఆ నేరం జరిగిందన్నమాట. అప్పుడు ఆ నేరం ఏ పరిస్థితుల్లో జరిగిందో, అది ఎట్లా మినహాయింపు అవుతుందో వివరించాలి. న్యాయస్థానాన్ని ఒప్పించాలి.
అయితే ఈ ధర్మసూక్ష్మాలన్నిటినీ ఏ రకంగానైనా వ్యాఖ్యానించవచ్చు. దేశంలో ఫాసిజం ఎంతగా కమ్ము కుని వస్తున్నదంటే, ఇంకే గత్యంతరం లేదు. సాధారణ అవగాహన ప్రకారం అయితే, ఎవరయినా ‘నా ఆత్మరక్షణ కోసం అవతలి వ్యక్తిని కాల్చి చంపాను’ అని చెప్పినట్టయితే. ఆ అనివార్య పరిస్థితి ఎలా వచ్చింది. ఆ సన్నివేశం ఏమిటి అని వివరించాలి. అటువైపు ఆయుధాలు లేకపోతే ఆ సన్నివేశాన్ని వివరించడం చాల కష్టం. కాని అటువైపు ఆయుధాలు ఉన్నాయి గనుక పోలీసులు సులభంగా ఈ మాట చెప్పగలుగుతున్నారు.

కాని ఆ పరిస్థితిలో కూడ అటువైపు ఉన్న ఆయుధాలేమిటి? చాల సందర్భాలలో తపంచాలు, అంటే రైతులు పంటలను రక్షించుకోవడానికి, పందికొక్కులను చంపడానికి వాడే ఆయుధాలు. వాటితో నిజంగా పోలీసులను చంపగలరా? ఆత్యాధునిక ఆయుధాలున్న పోలీసులు తపంచాలను చూసి ఆత్మరక్షణా భయంలో పడడం నిజమేనా?
ఏదో ఒక విధంగా వివరణ వస్తూనే ఉంటుంది. అది సరైనది కావచ్చు, కాక పోవచ్చు. వినే ప్రజలు శ్రద్ధగా, నిశితంగా పరిశీలించకపోతే, ఇంత అసంబద్ధంగా ఉందేమిటి అని ప్రశ్నించకపోతే చెప్పేవాడు చెపుతూనే ఉంటాడు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని సామెతే ఉంది గదా.
ప్రజలలో మానసిక అప్రమత్తత లేదు. జాగరూకత లేదు. ఇదేమిటి, ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామిక అధికార బాధ్యతలు నిర్వహించేవాడు ఇట్లా మాట్లాడవచ్చునా అని నిరంతరం ప్రజలు కనిపెట్టుకుని ఉండాలి. అది లేదు గనుక ఇటువంటి మాటలు వస్తూనే ఉంటాయి…

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *