ఏండ్లనాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్న
తెలంగాణను నేను.
అన్యాయానికి అణచివేతకు గురై..
నాడు కన్నీటి గీతాన్ని ఆలపించాను.
నేడు జై తెలంగాణ అని అందరిగుండెలో
మ్రోగుతున్న ఆనంద గీతాన్ని వినిపిస్తున్నాను.
నా తెలంగాణ ఇంట.. ఏ పుట్టనడిగిన
ఏ చెట్టునడిగిన…ఏ గుట్టనడిగిన
ఏ రాయిరప్పనడిగిన…ఏ కొండకోననడిగిన
పారుతున్న జలపాతాన్ని అడిగిన..
ఎగురుతున్న పక్షినడిగిన..
దుంకుతున్న లేగ దూడనడిగిన
తెలంగాణ ఉద్యమ చరిత్రను..
అమరుల త్యాగాల కన్నీటి గాధలను..
హృదయాంత రంగాలనుండి వల్లెవేస్తాయి.
తలాపున పారుతున్న గోదారమ్మ
కాళేశ్వరం జలదారలై పుడమితల్లి
గొంతును తడుపుతుంది.
నెర్రలుబారిన నేలమీదిపుడు పసిడి సిరుల
పంటలు..పచ్చని హారాలై..తెలంగాణ తల్లికి
జలహారతులు పడుతున్నయి.
జలజాతరలు అవుతున్నవి.
తెలంగాణ మాగానంతా ఇపుడు ఆకుపచ్చని అమ్మ.
పల్లెలన్నీ పచ్చని పట్టుకొమ్మలై
అందమైన నర్సరీల రూపంలో..
పల్లె పల్లెన దర్శనమిస్తున్నాయి.
ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మహోద్యమానికి
చిరునామగా నిలిచిన తెలంగాణను నేను.
తీరొక్క పూలతో అలంకరించిన
బతుకునిచ్చే అందమైన బతుకమ్మను నేను.
తంగేడుపూలతో తరతరాల సంస్కృతిని
తెలిపే దసరా ఉత్సవాన్ని నేను.
వేపకొమ్మలన్ని కుండలో బోనమై..
పిల్లజెళ్లను సల్లంగజుసే బోనాల పండుగను నేను.
నెత్తురోడిన అమరవీరుల రుధిరాన్ని
తిలకంగా దిద్దుకొని ఉద్యమాల జెండాను
ఎగరేసిన ఆత్మగౌరవ పతాకాన్ని నేను.
సబ్బండ వర్ణాల తెలంగాణను నేను.
– అశోక్ గోనె, 9441317361.