ఆంధ్రా ప్రయోజనాలు ముఖ్యమా.. మోదీని మోయడం ప్రధానమా?

చంద్రబాబు, పవన్‌ బాబులూ కళ్లు తెరవండి!

కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన మెజార్టీ రాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం బీజేపీని, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని భుజాల మీద మోస్తున్నారు. నేనే నిజమైన రాజును అనే వారెప్పుడూ నిజమైన రాజు కారు. మోదీ తరపున యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచిన చంద్రబాబు దయపై కేంద్రంలో బీజేపీ మనుగడ ఆధారపడి ఉంది. చంద్రబాబు భారత రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడు. తనకు తాను ఆంధ్రాకు సీఈవోగా చెప్పుకునేందుకు ఇష్టపడుతారు. ఆంధ్రాకు ఏమి కావాలో అన్నీ ఇచ్చేస్తే, చంద్రబాబుకు అంతకంటే మించి ఏమికావాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. యుద్ధం చేసి గెలిచిందేమో చంద్రబాబు, ఆ గెలుపు నిజమైన రుచిని మాత్రం నరేంద్రమోదీ ఆస్వాదిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు జనసేనాని పవన్‌కల్యాణ్‌ చేసిన కృషి చాలా ఉంది. టీడీపీని, బీజేపీని ఒక వేదికపైకి తెచ్చారు. ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆంధ్రాకు ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. అందుకే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఇద్దరూ మోదీకి భేషరతుగా మద్దతు ఇస్తున్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌  ప్రభుత్వం 2014లో హామీ ఇచ్చింది. ఈ డిమాండ్‌ పదేళ్లుగా పెండిరగ్‌లో ఉంది.

ఈ అంశంపై పదేళ్లలో చాలా చర్చ జరిగింది. టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో, మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్‌ తెరపైకి వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీస మెజార్టీ 272 సీట్లు ఉండాలి. బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. అంటే 32 సీట్లు తక్కువగా వచ్చాయి. టీడీపీకి 16 సీట్లు, జనసేనకు 2 సీట్లు వచ్చాయి. అందుకే ఈ రెండు పార్టీల మద్దతు బీజేపీకి ప్రాణవాయువు లాంటిదని చెప్పవచ్చును. చంద్రబాబు ఎందుకో నోరుమెదపడం లేదు. ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తేవడం లేదు. ఈ మౌనం వెనక కారణమెంటో బహిర్గతం కావడం లేదు. గతంలో 2014-18 మధ్య ప్రత్యేక హోదాపై కేంద్రంపై పెద్ద వొత్తిడి తెచ్చారు. కాని ఆశించిన ఫలితం రాలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బతింది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం వచ్చింది. రాష్ట్రంలో ఎన్డీఏ  కూటిమికి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. అదే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌ బతకాలంటే, టీడీపీ-జనసేన మద్దతు తప్పనిసరి. ఈ రోజు బీజేపీకి టీడీపీ మద్దతు చాలా అవసరం. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు బీజేపీపై వొత్తిడి పెంచాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. కాని ఎందుకో మోదీ పట్ల బాబు ఉదారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మోదీ ఆడిరదే ఆటగా పాడిరదే పాటగా ఎన్డీఏ  సర్కార్‌ తయారైంది.

ఆంధ్రప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రంపై వొత్తిడి తేవాల్సిందే. మీరు కేంద్రంలో ఏమి చేసుకుంటారో చేసుకోండి. మీరే రాజులు. మేము వజీర్లు మాదిరిగా ఉంటామన్నట్లుగా టీడీపీ వైఖరి ఉంది. ఈ మధ్య కోర్కెలు, డిమాండ్ల చిట్టాతో చంద్రబాబు ఢల్లీికివెళ్లారు. కాని కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి వొత్తిడి తీసుకురాలేదు. పలువురు మంత్రులను చంద్రబాబు కలిశారు. హోదా డిమాండ్‌పై మాత్రమే 2018లో చంద్రబాబు ఎన్డీఏతో జగడం పెట్టుకుని బయటకు వచ్చారు. ఈ రోజు అదే హోదా అడగకుండా నిర్లక్ష్యం చేస్తున్నారా అనిపిస్తోంది. ఈ రోజు బిహార్‌ తదితర రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. జేడీయూ పార్టీ ఇప్పటికే బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసంది. లోక్‌ జనశక్తి అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ కూడా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ లేదా హోదా ఏ ఒక్క రాష్ట్రానికి ఇచ్చినా, మిగిలిన రాష్ట్రాలు  ఊరుకోవు.   ఇది ఒక రకంగా తేనే తుట్టను కదిపినట్లే. ఇప్పటికి మాత్రం చంద్రబాబు ఈ డిమాండ్‌ అమలు కోసం కేంద్రంపై వొత్తిడి తేవకపోవచ్చును. ఎందుకంటే, ఈ డిమాండ్‌ పైన మాత్రం సరిగ్గా ఆరేళ్ల క్రితం చంద్రబాబు బీజేపీకి దూరమయ్యారు.

 

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వొత్తిడి పెంచారు. కాని ఈ రోజు తన దయా దాక్షిణ్యాలపై కేంద్రం ఆధారపడి ఉన్నా చంద్రబాబు అవలంభిస్తున్న మౌన రాగంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కేంద్రం ఏది ఇచ్చినా తీసుకోవాలని అనే ధోరణితో చంద్రబాబు ఉన్నారు. స్పెషల్‌ ప్యాకేజీ పేరుతో ఏమి వచ్చినా ఆహ్వానించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వేచి చూసే వైఖరితో చంద్రబాబు ఉన్నారా ? రాష్ట్రంలో ప్రజలకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి చంద్రబాబు వచ్చారు. సంక్షేమ కార్యక్రమాలకు బోలెడు నిధులు కావాలి. రాష్ట్ర ఖజానా ఖాళీఅయింది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మక మౌన విధానాన్ని అవలంభిస్తున్నారా అనే వారు ఉన్నారు. కేంద్రంతో ఘర్షణ వల్ల సాధించేందేమీ ఉండదనే విషయం చంద్రబాబుకు తెలుసు.

ఈ రోజు బీజేపీతో కలిసి నడవడం తప్ప మరో దారి చంద్రబాబుకులేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. ప్రాజె క్టుల నిర్మాణానికి, సంక్షేమానికి నిధులు కావాలి. హామీలను నెరవేర్చేందుకు నిధులు వస్తే చాలనే సంతృప్తితో బాబు ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి తన పబ్బం గడిస్తే చాలనే వైఖరితో టీడీపీ ఉంది.  చంద్రబాబు రాజకీయ జీవితం విశ్లేషిస్తే ఇతనేమీ మౌనీ బాబా కాదు. అసాధ్యుడు. కుటిలపన్నాగాలు , ఎత్తుగడలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట. కేంద్రం నుంచి నిధులు కావాలి. పోలవరం, అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేయాల నేది చంద్రబాబు సంకల్పం. ఈ ప్రాజెక్టులకు భారీ నిధులు కావాలి. ఖజానా చూస్తే ఖాళీ అయింది. కఠినవైఖరిని అవలంభించకుండా, మోదీతో సఖ్యతగా ఉండి వీలైనన్ని నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవాలనే ధోరణితో ఉన్నట్లు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.

ఆంధ్రాలో టీడీపీ బలంగా ఉంది. ఇక్కడ బీజేపీ  పాతుకుపోదామని, బలాన్ని విస్తరించుకుందామనే వ్యూహంతో ఉంది. టీడీపీ, జనసేన సహాయంతో తన బలాన్ని పెంచుకుందామనే ఎత్తుగడలు బీజేపీకి ఉన్నాయి. నరేంద్రమోదీ 2014, 2019లో ఉన్నట్లుగా ఇప్పుడు లేరు. అప్పుడు మోదీకి ఎదురు లేదు. ఈ రోజు టీడీపీ లేకపోతే మోదీ లేరు. అందుకే చాలా అంశాల్లో నరేంద్రమోదీ కొత్త వ్యూహాలతో కదులుతున్నారు. ఇదే అదునుగా భావించి బీజేపీకి చెక్‌ పెట్టే విధంగా చంద్రబాబు పాచికలు  కదపాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే డిమాండ్లను కేంద్రంలో ఎన్టీఏ సర్కార్‌ అమలు చేసే విధంగా చంద్రబాబు వ్యూహ రచన చేయాలి. టీడీపీ, జనసేన పార్టీలు , ఆంధ్రరాష్ట్రం కాని ద్వితీయశ్రేణి పౌరులు, పార్టీలు కానే కాదనే వైఖరిని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేయాలి. చంద్రబాబు లేకపోతే మోదీ లేరు. టీడీపీకి 16 సీట్లు రాకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు. ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు ఇంతకంటే మించిన అవకాశం వస్తుందా? ఈ అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఉపయోగించుకోవాలి.
-శామ్‌ సుందర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page