కాలం ఎంత మిడిసి పడ్డా/ అక్షరం ఎప్పటికీ అక్షరమే అని తరతరాలకు తరగని వెలుగై విరాజిల్లే అక్షర శక్తి బలిమిని బలంగా చెప్పిన కవి డా.ఎన్. గోపి. తన అమృతోత్సవం సందర్భంగా 75 కవితల సమాహారంతో రేపటి మైదానం అన్న సంపుటిని ఆయన వెలువరించారు. తొలి కవిత రేపటి మైదానం జీవనరంగస్థలపు దృశ్యీకరణతో సాగింది. ఈ మైదానం/ కేవలం ఖాళీ స్థలం అనుకునేరు/ చరిత్రను కడుపులో దాచుకున్న/ జ్ఞాపకాల పురా స్థలం అన్నారు. కరోనా నేపథ్యంగా రాసిన స్తబ్ధకోశం అన్న కవితలో ఎవరి బతుకులు స్థిమితంగా లేని పరిస్థితిని చెప్పి కవిత్వం రాయక మూడు నెలలైంది/ భావుక లోకంలో దివాళా/ ప్రతి చిన్న కదలిక ఒక జల్‌జలా అని వేదన చెందారు. భయపడితే లొంగుతామా / ఉదాసీనత నిన్నటి కథ/ శిథిలాలను మళ్ళీ కడతాం/ కుదుట పడి ఎదుట పడదాం/ మనమే సాహసం కావాలిప్పుడు అని శైలారోహణ కవితలో గొప్ప ధైర్యాన్ని నూరి పోశారు. అమండా గోర్‌మస్ అనే నల్ల యువతి రాసిన The Hill we climb అన్న కవితకు శైలారోహణ స్వేచ్ఛానువాదం – జ్వలిద్దాం నిర్భయంగా చలిద్దాం/ రోచిస్సులకు ముగింపు వుండదు అన్న భరోసానిచ్చే వాక్యాలు ఈ అనువాద కవితకు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
అడుగులు కవిత పల్లె భూఖండం కాదు, పేగులతో ముడేసుకున్న మమతల భాండమని తెలిపింది. జ్ఞాననదులు పుస్తకాలేనంటూ మీరేమనుకున్నా పరవాలేదు/ నా చితిపై మాత్రం/ ఓ పుస్తకం పెట్టడం మరచిపోకండి అని వేడుకున్నారు. ఏకాంతమంటే ఒంటరితనం కాదు, సామూహిక స్వప్నానికి పునాది అని చెప్పారు. వయస్సు పెరగొచ్చు కానీ ఆంతరిక విస్ఫార శక్తి మరోతరం దాకా సాగుతుందని ఉజ్వం కవితలో అన్నారు. సమస్యల చీకటి డొంక తొలగాలంటే మానవీయ తెగువను తురాయిగా ధరించే సాహస రమ్యాన్ని ఆహ్వానించారు. ఏదీ స్థిరం కాదని సౌందర్యం కన్నా సందేశం వైపే నా మొగ్గు అన్నారు. కవిత్వానికి హేతువు/ ప్రతిభ మాత్రమే కాదు/ పాఠకుని సుముఖ ప్రభ కూడా అన్నారు. గురువు ముందు / శిష్యుడు వెళ్లిపోతే/ ఆ గురువు మోసే బరువు/ తండ్రి కన్న తక్కువదేమీ కాదు అని ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అకాల మరణ సమయంలో రాసిన మరణం లేని అక్షరం కవితలో చెప్పారు. మహా పురుషులు మధూళిలా అక్కడక్కడ ఉండడం వల్లనే ఈ భూగోళం పడిపోకుండా ఉందన్నారు. ఎప్పటికీ చెదరని కళాఖంఢాల బంగారు కొండగా నల్లగొండ జిల్లాలోని రాచకొండను అభివర్ణించారు. భావోద్వేగ గాయత్రిగా, మాటలకందని మనోజ్ఞతగా గాయని లతామంగేష్కర్‌ను లత ఒక వొడువని జ్ఞాపకం అన్న కవిత ఆవిష్కరించింది. అనుభూతిని అక్షర వెలుగుగా మార్చే రవీశ్వరుడే రసజ్ఞత కలిగిన కవీశ్వరుడున్నారు. జీవించడమే ఒక అద్భుతమని చెప్పారు. నగరం గతం లిఖించిన సతత హరిత మహాకావ్యమన్నారు.
ఒంటరితనపు చింతనలో మునిగిన మనిషి రుషికన్నా తక్కువేం కాదని చెప్పారు. వ్యాకరణం అపృధానమై వాక్యం గుర్తుపట్టలేనంతగా మారిపోతుందని తెలిపారు. కవి తమ ఊరు భువనగిరిలో చిన్ననాటి జ్ఞాపకాలను ఒక పెద్ద నెమలీకగా అభివర్ణించారు. అప్పటి పాఠశాల అందించిన జ్ఞానజ్వాలలే ఇప్పటి తన వెలుగులని చెప్పుకొచ్చారు. మాయపొరలు అంటకుండా కంటి పాపల్ని చంటి పాపలుగా కాపాడుకొమ్మన్నారు. యాదగిరీంద్రునికి కవితా కైమోడ్పులు అర్పించారు. అంతటా ఖాళీలు ఏర్పడుతూ/ కాలం ఒంటరయ్యిందని శీలా వీర్రాజును స్మరించారు. ఏ నూతన ధీదితులు నిండిన/ నా జీవితం క్షణక్షణం అక్షర భరితం అని గ్రంథోపనిషత్ కవితలో స్పష్టంగా చెప్పారు. చిన్నప్పటి అన్నమ్మ టీచర్‌ను గుర్తు చేసుకుని ఆమె పదవీ విరమణ చేసినప్పుడు అన్నమ్మ టీచర్ లేని స్కూలు/ అన్నం లేని పళ్లెంలా అనిపించేది అని రాసిన వాక్యాలు ప్రతి ఒక్కరికీ వారి టీచర్లను తప్పక గుర్తు చేస్తాయి.
పరామర్శ హృదయ స్పర్శలా, మనిషిలా, రేపటి గమ్యంలా ఉండాలన్నారు. ఇంట్లో పుస్తకాలున్న వారిని నిజమైన శ్రీమంతులతో పోల్చారు. కాలం చెప్పే సత్యమే స్పష్టమైన జ్ఞానమని తెలిపారు. రాజనీతి కవితలో కామన్‌సెన్స్ ఉన్న ప్రతి వాడూ ఓ కాల జ్ఞాని అని చెప్పారు. కవిత్వం వ్యాఖ్యానానికి అందని నిరంతర ఊట, ఎడతెగని పాట అవుతుందన్నారు. పెద్ద ఆకాంక్షలతో పసివాడి బాల్యాన్ని తల్లిదండ్రులు ధ్వంసం చేస్తున్నారని వేదన చెందారు. మార్పును నిన్నటి దూరాల చేర్పు అని చెప్పారు. జన సమ్మర్థంతో అణగిపోయి ఊపిరి పీల్చుకుంటున్న ఖాళీ వీధుల్ని కవి మార్నింగ్ వాక్‌లో చూశారు. జ్ఞాపకాల హృదయ నేత్రుడైన మిత్రుడితో ప్రేమతత్త్వంతో చిరకాలపు నడక సాగించారు. వ్యామోహం స్వభాషనం చంపుతుందని ఖేదపడ్డారు.
అమెరికా నిండా ఎవరికీ వారే యమునా తీరేనని, అదొక అలవి కాని నిశ్శబ్దం అని చెప్పారు. ఏదో ప్రాక్తన సంవేదన ప్రసారం కాగా తల పోతల్లో ముంచిన వేళ్ల కదలిక మిగిల్చిన అరుదైన అక్షరశాలనే కవిత్వమన్నారు. క్లాస్‌రూంను మించిన కార్యశాల మరొకటి ఉండదని భావించారు. అన్నవరం కోసం రాసిన కవితలో అతని నెనరు పరిమళాల పొద అన్నారు. ఊరు తప్పిపోవడం కాదు అభివృద్ధి గొడ్డళ్ల కింద ముక్కలై చచ్చిపోతుందని చెప్పారు. కవులతో కలిసి సాగించిన ప్రయాణాన్ని విశ్వమానవ గానంతో పోల్చారు. రొట్టె పెదవుల్లోంచి రాలిన ప్రేమ ఆకలి గాయానికి లేపనమైందన్నారు. పల్లెల్ని వదలలేక, పట్నంలో ఇరుడలేక మనిషితనం కుంచించుకు పోతుందని చెప్పారు. చూపు మహత్తర లోకాలోకానమవ్వాలన్నారు. కవి పద్యం చదివితే మార్పు తారస పడాలన్నారు. నిశ్శబ్దాన్ని మిత్రుడిగా మార్చుకొని మాటలు పూయిస్తానని చెప్పారు. జ్ఞాపకాలే వృద్ధాప్యానికి మిగిలిన సంపద అని తెలిపారు. రక్తబంధంలో ఆత్మీయతకు చోటు లేదన్నది పరమ సత్యమన్నారు. ఆకలి తిరుగుబాటుకు పునాది అని చెప్పారు. కాలం కళ్లకు కనపడని అనుసంధానమని తెలిపారు. చేతిరాత ఉత్తరం మన మనసుకు దర్పణమంటూ దానికి విడవకండి చిట్టచివరి తర్పణమని అన్నారు. మనిల్లు నీయిల్లుగా/ మారుతున్నప్పుడు/ నాకు మాత్రం/ స్థలం ఎక్కడుంటుందిరా అన్న వాక్యాలు కంటతడిని పెట్టిస్తాయి. ఆనాటి నడక ముందు ఈ నాటి కారు పరుగు ఏ పాటి అని చెప్పారు. నిద్ర బూజును కిరణాల్లో దులుపుకుంటూ స్వప్నాలను సానబెట్టుకున్నారు. నిరంతర వ్యక్తిత్వ వరేణ్యమే చేతిలోని అనన్య, అగణ్య పాంచజన్యమని చెప్పారు.
కవిత్వానిది కుహరాల్లోంచి వెలుగు సీమను వెతికే గుణమని చెప్పారు. గాయాల మాల ధరించిన ఆదివాసి లాంటిది కవిత్వమని భావించారు. వేలాది గొంతులు పొగిలి బయటకొచ్చిన భావాగ్నే దుఃఖపు చుక్క అన్నారు. చొక్కా బటన్ (గుండి)కు గుండె స్పందన విధానం బాగా తెలుసని చెప్పారు. నది అంటే మహోజ్వల నాగరికత అని, పర్వతాలు దూకి/ అలలు తలలు పగులగొట్టుకున్న/ గాయాల చరిత్ర అని తెలిపారు. రొట్టెలో అమ్మ ధిక్కారం, తిరస్కారం, తృణీకారం, మమకారాన్ని చూశారు. దానిమ్మ పైకి సాదాసీదా/ లోపల సద్గుణాల ఖజానా అన్నారు. ఆకాశాన్ని శపించే నిస్సహాయత ఒక సామూహిక భయమని చెప్పారు. కవి మరణించాక ఆయన కీర్తి కాయానికి మాత్రం ఒక్క గది కూడా మిగల్లేదని తెలిపారు. బహురమ్యమై, అనుభూతి పారమ్యమైనదే కవి కవితాత్మ అని చెప్పారు. మైదానంలో కుక్కలు కనిపించకపోతే బలగంలో ఎవరో తప్పిపోయినట్టు కలతపడ్డారు. బహుళార్థ సార్థక జీవితమే నిత్య సారాంశ గీతమని తెలిపారు. జాగ్రత్తగా ఈ కవిత్వాన్ని అధ్యయనం చేస్తే మానవ జీవితం అనే వస్తువుతో పాటు, మనిషిని ఆవరించిన, మనిషి సృష్టించిన అనేకానేక వస్తువుల ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764.