అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం వెనుక తప్పకుండా రాజకీయ కోణం దాగే ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా బిజెపి నాయకులు చెబుతున్నట్లు ట్రిపుల్‌ ఆర్‌లో ఎన్టీఆర్‌ ‌నటనకు ఇంప్రెస్‌ అయి ఆయన్ను మెచ్చుకోవడానికి మాత్రమే ఆహ్వానించి ఉంటే, ఆ సినిమా టీమ్‌నంతా పిలిచి ఉండాల్సింది. అయితే ప్రముఖ సీనియర్‌ ‌నటుడు చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ అం‌దుబాటులో లేడనటం ఎంతవరకు నిజమన్నది ప్రశ్నగా మారింది.

వాస్తవంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌మంచి టాలెంట్‌ ఉన్న వ్యక్తి అన్నది తెలియందికాదు. సినీలాకాశంలో వెలుగుతున్న తార. గతంలోనే ఆయన టిడిపిద్వారా రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన ప్రచార హోరుకు ఫిదా అయిన విషయం తెలియందికాదు. అయితే తన చేతికి అందనంత ఎత్తుకు ఎదుగుతాడేమోనని టిడిపి అధినేత అయన్ను కాస్తా వెనక్కు లాగాడని అప్పట్లో చెప్పుకున్నారు. రాకరాక రాజకీయాల్లోకి వొస్తే తనకు జరిగిన అవమానానికి ఆయన రాజకీయాలకే స్వస్తి పలికి పూర్తిస్థాయిలో సినిమాలకు అంకితమైపోయాడు. అలాంటి వ్యక్తిని ఉన్నట్లుండి అమిత్‌షా డిన్నర్‌కు అహ్వానించడం అంత సులభంగా కొట్టిపారేయాల్సిన విషయం కాదన్నది రాజకీయ పార్టీల నేతలు అంటున్న విషయం. అయితే ఆ భేటీ రహస్యమేంటన్నది మాత్రం బహిర్ఘతం కావడంలేదు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతంవారు మాత్రం పలు ఊహాగానాలు చేస్తున్నారు. ఒక వేళ ఆయన్ను బిజెపిలోకి తీసుకుంటే రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అన్న విషయంలో చర్చ జరుగుతున్నది.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు యువకుల్లో మంచి క్రేజ్‌ ఉం‌ది. దాన్ని వోటు బ్యాంకుగా మార్చుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నదా? రానున్న ఎన్నికల్లో ఆయన్ను ప్రచార అస్త్రంగా ప్రయోగించే అవకాశాలున్నాయా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. ఏ విధంగానైనా రానున్న ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జండా ఎగురవేయాలన్న లక్ష్యంగా ముందుకు కదులుతున్న బిజెపి ఇప్పటినుండే అస్త్రశస్త్రాలను సిద్దంచేసుకుంటున్న విషయం తెలియందికాదు. టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దె దింపేందుకు తెలంగాణలో బలమైన వర్గాలను చేరదీసుకుంటున్నది బిజెపి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన కాంగ్రెస్‌ ‌నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రాజీనామాచేయించి, మునుగోడులో ఉప ఎన్నికలను సృష్టించడంకూడా బిజెపి రాజకీయ ఎత్తుగడగానే రాజకీయవర్గాలు విమర్శిస్తున్నాయి. మునుగోడును గెలువడం ద్వారా వొచ్చే ఎన్నికల్లో బిజెపియే విజయం సాధిస్తుందని ప్రజలకు నమ్మకం కలిగించినట్లు అవుతుందన్నది ఆ పార్టీ వ్వూహం. అలాగే కెసిఆర్‌ ఎత్తుగడలను ఎదుర్కుని, ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయగలిగే సత్తా ఉన్నవారికోసం బిజెపి చాలాకాలంగా టార్చ్‌లైట్‌ ‌వేసి వెతుకుతున్నది.

వారికిప్పుడు జూనియర్‌ ఎన్టీర్‌ ‌లభించాడు. ఈ తారక్‌ అయితే ఇటు తెలంగాణలో సెటిలర్స్ ‌వోట్లను, తెలంగాణలో ఆయన అభిమానుల వోట్లను సంపాదించగలడన్న ఉద్దేశ్యంగానే అమిత్‌షా ఆయన్ను ముగ్గులోకి లాగుతున్నట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పాగా వేయాలను కుంటున్న బిజెపికి ఇది ఒక కీలక మలుపు అవుతుందన్నది స్పష్టం. దశాబ్దాలకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలోనే అయినా ఇక్కడ ప్రస్తుతం ఆ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కాని, ఇంకా ఇక్కడ ఆ పార్టీ అభిమానులకు కొదవలేదు. వారందరిని తమ వైపు తిప్పుకోవాలంటే బిజెపికి తారక్‌ ‌లాంటి వ్యక్తి అవసరం. అందుకే అమిత్‌షా మంచి ఎత్తుగడే వేసినట్లు తెలుస్తున్నది. ఇక ఏపి రాజకీయాలను పరిశీలిస్తే టిడిపి ఇప్పుడక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. చంద్రబాబునాయుడు తర్వాత పార్టీ పగ్గాలను ఆయన కుమారుడు నారా లోకేష్‌ ‌పడతాడన్న విషయంలో ఏమాత్రం సందేహంలేదు. మరెవరూ ఆ స్థాయికి ఎదిగే అవకాశంకూడా లేదు. ఇప్పటికే చాలాసార్లు జూ.ఎన్టీఆర్‌కు పార్టీలో మంచి అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు పలుసార్లు డిమాండ్‌ ‌చేస్తున్నప్పటికీ చంద్రబాబునుండి ఎలాంటి స్పందనలేదు. అయితే ఈ భేటీలో రాజకీయ అంశాలేవీ లేవని జూ. ఎన్టీఆర్‌ అనడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page