అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి

తాండూర్‌కు 30 కోట్లతో నర్సింగ్‌ ‌కళాశాల ఏర్పాటు
ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ఏఎన్‌ఎం‌లు, ఆశాలు ముందుండి పని చేయాలి
రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు
అమ్మ పాత్రలో ఆశా వర్కర్లు..వారి సేవలు మరువలేనివి : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి తాండూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలో విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డితో
కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నేషనల్‌ ‌గార్డెన్‌లో నిర్వహించిన ఆశా సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ…ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాథమిక దశలో ప్రజల అనారోగ్య పరిస్థితిని గుర్తించి చికిత్స అందజేయాలని మంత్రి తెలిపారు. అదే విధంగా ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ముందుండి పని చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి జీతాలను అందిస్తూ ప్రభుత్వం చేయూత నిస్తుందని మంత్రి అన్నారు. కొరోనా సమయంలో, వాక్సినేషన్‌ ‌విషయంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందితో పాటు సీనియర్‌ అధికారులు చేసిన కృషి అభినందనీయమని మంత్రి కొనియాడారు.
రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. గతంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యులు, సిబ్బంది, సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని హంగులతో హాస్పాటల్‌ ‌భవనాలు నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు. గతంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 66 శాతానికి పెరిగిందని మంత్రి అన్నారు. ముఖ్యంగా వికారాబాద్‌ ‌జిల్లాలో ప్రసవాల సంఖ్య 80 శాతానికి పెరగడం అభినందనీయమని అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో కంటే ప్రభుత్వ హాస్పటళ్లలోనే ప్రసవాల సంఖ్య పెరగడం దీనికి ఉదాహరణ అని మంత్రి తెలిపారు. మంత్రి పి.సబితా రెడ్డి మాట్టాడుతూ..ఆశా వర్కర్ల సేవ మరువలేనిదని, వారి సేవలు అభినందనీయమని అన్నారు. ఆశా వర్కర్లు విశేషమైన సేవలందిస్తూ అమ్మ పాత్రను నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page