– నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై
-రేపు విచారణ చేపడతామన్న సుప్రీం కోర్టు
న్యూదిల్లీ, జూన్ 11: మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన క్రమంలో.. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మీనాక్షీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు. తప్పుడు రీతిలో మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. కానీ రాజ్యసభ ఎన్నిక పక్రియ ముగిసిన తర్వాతే ఎలక్షన్ పిటీషన్ నమోదు చేయాలని మీనాక్షికి సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణకు ఆమోదించింది. మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ సీట్ల కోసం జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మ అకస్మాత్తుగా మీనాక్షీ నటరాజన్ పిటీషన్‌ను తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మీనాక్షి అసంపూర్ణంగా డాక్యుమెంట్లు సమర్పించినట్లు అరవింద్ శర్మ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. తనపై కోర్టు కేసు ఉన్న విషయాన్ని ఆమె ఫామ్ 26లో పొందుపరచలేదని ఆర్వో తెలిపారు.2025 అక్టోబర్‌లో హైదరాబాద్ కోర్టుకు నోటీసుకు నటరాజన్ స్పందించారని, కానీ ఫామ్ 26లో ఈ విషయాన్ని చెప్పలేదని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. తెలంగాణలో మీనాక్షీపై కేసు నమోదు అయ్యిందని బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 8వ తేదీన నామినేషన్ ఫైలింగ్‌కు చివరి తేది. మంగళవారం రోజున ఆ పేపర్లను స్క్రూటినీ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నాటరాజన్ తన నామినేషన్‌ను తిరస్కరించినందుకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె కోర్టును కోరారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికలు జూన్ 18న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ జూన్ 9వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) నుంచి తెలంగాణ ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు.
మీనాక్షిపై తెలంగాణలో ఎక్కడా కేసు లేదు : మహేష్ కుమార్ గౌడ్
న్యూదిల్లీ : రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా మహిళ అని కూడా చూడకుండా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహించారు. దిల్లీ వేదికగా గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడా మీనాక్షి నటరాజన్‌పై కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని అన్నారు. బీజేపీ వినాశకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఏఐసీసీ సమావేశంలో చర్చించామని మహేశ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో బతుకుడే కష్టంగా మారిందన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతూ పోతున్నాయని, పెట్రోల్, డీజిల్ నిత్యవసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు. గృహిణులను ఇబ్బంది పెట్టేలా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.