వీబీజీ రామ్ జీపై కేంద్రానికి నిరసన లేఖ

– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీ బీ జీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ స్కీంను వ్యతిరేకిస్తూ శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. జూలై 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలంటూ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను, అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా నిరసన లేఖను రాయనున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. లేఖలో పొందుపరచాల్సిన అంశాలపై ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు తదితర అధికారులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధుల్లో కనీసం 60 శాతం కేంద్రం నుంచి అందాలంటే కొత్త విధానాన్ని అమలు చేయక తప్పదని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఇప్పటికే కొత్త పథకం అమలుకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయని కూడా వివరించారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ డిమాండ్ ఆధారంగా కాకుండా నార్మేటివ్ విధానంలో పని దినాల కేటాయింపును ప్రతిపాదించడం సరికాదన్నారు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజులపాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. పంటల సీజన్‌లోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో వనమహోత్సవం, మొక్కల నాటడం వంటి కార్యక్రమాలు ఉపాధి హామీ పనుల ద్వారా చేపడతామని పేర్కొన్నారు. ఈ సమయంలో 60 రోజుల విరామం విధిస్తే మొక్కల నాటడం నిలిచిపోతుందని, అది కేంద్రం చేపట్టిన గ్రీన్ ఇండియా క్యాంపెయిన్ లక్ష్యాలకు కూడా విరుద్ధమని అన్నారు. ఆదివాసీ, కొండ ప్రాంతాల్లో పంటల సీజన్ 60 రోజులపాటు కొనసాగదని, అలాంటి ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. ఒకసారి పనులు ప్రారంభమైన తర్వాత మధ్యలో 60 రోజుల విరామం ఇవ్వడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు, భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తయ్యే వరకు వాటి నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు తగిన వెసులుబాటు కల్పించేలా కొత్త చట్టం అమలును వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. అయితే, అనివార్య పరిస్థితుల్లో వీబీజీ రాంజీని అమలు చేయాల్సి వస్తే ఉపాధి కూలీలకు ఎలాంటి నష్టం జరగకుండా రాష్ట్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కూలీలకు కలిగే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా ముసాయిదా రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొత్త విధానం అమలుపై ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *