- ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరు.. రాజ్యాంగాన్ని అణచలేరు
- దేశ యువత ఆశలకు ప్రతీక రాహుల్ గాంధీ
- 2029లో దేశానికి ప్రత్యామ్నాయ నాయకత్వం కాంగ్రెస్‌దే
- మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వారి గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ యువత ఉద్యోగాలు అడిగితే లాఠీలు, పరీక్షల్లో పారదర్శకత కోరితే నిర్బంధాలు, జవాబుదారీతనం కోరితే బెదిరింపులు.. ఇదే బీజేపీ పాలనకు అసలు ముఖచిత్రమని విమర్శించారు. దిల్లీలో తాజా పరిణామాలపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ గురువారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్రపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు.. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అణచివేయడమే ప్రజాస్వామ్యానికి అసలైన ముప్పు అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వారి బాధను వినకుండా అధికార అహంకారంతో వ్యవహరిస్తోందన్నారు. భయంతో దేశాన్ని పాలించాలని చూసే ప్రతి ప్రభుత్వం చివరికి ప్రజల తీర్పు ముందు తలవంచాల్సి వచ్చిందని చరిత్ర చెబుతోందన్నారు. విద్యార్థుల మధ్యకు వెళ్లి వారి ఆవేదనను పంచుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడిగా నిలిచారని ఆయన కొనియాడారు. ప్రజల మధ్య నిలబడే నాయకుడు ఒకరు.. ప్రజల నుండి దూరంగా నిలబడి అధికారాన్ని కాపాడుకునే నాయకత్వం మరొకటి.. దేశ యువత ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా గుర్తిస్తోంది అని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలతో, విద్వేష రాజకీయాలతో, దర్యాప్తు సంస్థల భయంతో ప్రజల స్వరాన్ని శాశ్వతంగా అణచివేయలేరని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల కలలను సంకెళ్లతో బంధించలేరు.. యువత ఆశయాలను జైళ్ల గోడల మధ్య నిర్బంధించలేరు.. రాజ్యాంగాన్ని ఎవరూ ఓడించలేరు అని అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన ప్రశ్నించే హక్కును కాపాడటం కాంగ్రెస్ పార్టీ చారిత్రక బాధ్యతగా భావిస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం చేస్తున్న పోరాటం కోట్లాది యువతలో కొత్త ఆశను నింపుతోందన్నారు. దేశ యువత ఇప్పుడు విద్వేషాన్ని కాదు.. విశ్వాసాన్ని కోరుకుంటోందని, అహంకారాన్ని కాదు.. జవాబుదారీతనాన్ని కోరుకుంటోందని, ప్రచారాన్ని కాదు.. పారదర్శక పాలనను కోరుకుంటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలు కేవలం అధికార మార్పు కోసం జరిగే ఎన్నికలు కావని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, యువత భవిష్యత్తును కాపాడే ఎన్నికలుగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి సమగ్ర, సమానత్వ, రాజ్యాంగబద్ధ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందంటూ 2029లో ప్రజల ఆశీర్వాదంతో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తోందని ఉత్తమ్ చెప్పారు. ఇది అణచివేతకు సమయం కాదని ఆత్మపరిశీలనకు సమయమని, ఇది అహంకారానికి సమయం కాదని.. ప్రజల మాట వినే సమయమని ఉద్బోధించారు. భయంతో కాదు.. రాజ్యాంగంతో, ప్రజాస్వామ్యంతో, యువత విశ్వాసంతోనే దేశాన్ని ముందుకు నడిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు.
యువత గొంతు నొక్కితే బీజేపీ పతనమే



