ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు..బ్లాక్‌ ‌లిస్ట్
‌రైతులు ఒకటి, రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్‌కు తేవాలి
క్షేత్ర స్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణతో సజావుగా కొనుగోళ్లు
ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు
మంత్రులు ఉత్తమ్‌, ‌పొంగులేటితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ ‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్‌ ‌లైసెన్స్లు రద్దు చేయాలని, కస్టమ్‌ ‌మిల్లింగ్‌ ‌నిలిపివేసి బ్లాక్‌ ‌లిస్ట్‌లో పెట్టాలని సీఎం ఆదేశించారు. శుక్రవారం సీఎంతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వొచ్చిందని, అందుకే ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు.
నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ఒకటి రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని సీఎం సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్‌ ‌యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వొచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల పక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలని ఆదేశించారు. సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. వడగండ్ల వానలు వొచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్‌ ‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల టైమ్‌ ‌కావటంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశపూర్వక కథనాలు వొస్తున్నాయని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని సీఎం ఆదేశించారు.

వేసవిలో తాగునీటికి ఇబ్బంది రావొద్దు ..

 చర్యలకు అధికారులకు సిఎం ఆదేశం
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమని సీఎం అప్రమత్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటి కంటే భూగర్భ జల మట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వొచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. ఏ రోజుకారోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారధ్యంలో మిషన్‌ ‌భగీరథ, మున్సిపల్‌, ఇరిగేషన్‌, ‌విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ సమస్యను పరిష్కరించే చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.
హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, మరింత డిమాండ్‌ ‌పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నాగార్జునసాగర్‌ ‌డెడ్‌ ‌స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు.  ఇటు సింగూర్‌ ‌నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్‌ ‌రిజర్వాయర్‌ ‌నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ ‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచి పోయిందని ఈ సందర్భంగా సీఎం దృష్టికి వొచ్చింది. ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అకారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వొస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *