చిత్రకళా కవిత్వం…

జ్ఞాపకాలకు మతిమరుపు ఉండదు… తలచుకుంటే వాటంతటికి అవే మరోమారు పిలవకుండగ మనో నేత్రాల ముందు కన్పిస్తాయి అని అక్షరాల జడివానలో కురిపించిన సృజనశీలి. అమెరికా చికాగో నగరంలోని పేలోస్‌ హిల్స్‌ లో నివసిస్తున్న పద్మశ్రీ  ప్రొఫెసర్‌ డాక్టర్‌ యస్‌. వి. రామారావు (శిరందాసు వెంకటరామారావు). గుడివాడలో పుట్టాను… గుడివాడ  హైస్కూల్‌  చిత్రకారుణ్ణి చేసింది.. గుడివాడ కాలేజీ కవిగా మలచింది… ఇవి నా జీవితానికి పునాదులని అక్షరాలా  రాసుకున్న డాక్టర్‌ రామారావు గుడివాడ నుండి బయలుదేరి భారతదేశంలోని నగరాలను దాటి యూరప్‌ ఖండానికి, అక్కడి నుండి అమెరికా వెళ్ళి స్థిరపడ్డా నేటికీ అలుపెరగకుండా, అప్రతిహతంగా చిత్రాక్షర కవిత్వ ప్రవాహ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. విస్తారంగా లోకాన్ని, శాస్త్రాల్ని, వ్యక్తుల్ని, విభిన్నతలను సంతరించుకున్న ఆలోచనల్ని ఆయన చదివారనడానికి ఆ లేఖిని నుండి వెలువడిన కవితా వాక్యాలెన్నో సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఆలోలాంతరాళాలలో అన్న పేరుతో  వెలుగు చూసిన ఆయన కవితా సంపుటిలోని 41 కవితలు మానవతావాదిగా, తాత్త్వికునిగా, చిత్రకారునిగా, కవిగా ఆయన విశిష్ట ముద్రకు దృశ్యీకరణాలుగా నిలిచాయి. భారతీయాత్మను, విశ్వజనీనతను గుండెనిండా చిత్రించుకున్న విశాలాలోచనల అపురూప అనుభూతిని అందించే కవితలిందులో ఉన్నాయి. రూపానికి ప్రాధాన్యత కనబడని అత్యద్భుత రంగుల మేళవింపు, రేఖల ఆకారాన్ని అందిపుచ్చుకుని అలరించే ప్రవాహపు నడకతో నైరూప్య చిత్రాలను వేసి మనసుల్ని కట్టి పడేసే డాక్టర్‌ రామారావు ఖండాంతర ఖ్యాతిని ఏనాడో పొందారు. కవిత్వంలో కూడా మనసు పొరలలోని స్వానుభవాలను దృశ్యకళా వాక్యాలుగా శ్రద్ధగా నిర్మించడంలో తన కౌశలాన్ని ఆయన ఈ సంపుటి ద్వారా లోకానికి చాటి చెప్పారు.

అద్దంలాంటి కొలనులో/  పూర్ణ చంద్రుని మోములా ఒంగి ఒయ్యారంగా ఓ తెల్లని హంస సాగుతున్నదని, నిలబడి ఉన్న చెట్ల గుంపులు సూర్యుడు అస్తమించబోయే ముందు కూని రాగాలు తీస్తున్నాయి/  ఇంటికి వెళ్ళేప్పుడు/  నా సుందర చిత్ర వదన బింబాలను/  ఏరుకొని వెళ్ళాలి  అన్న బెనిన్‌ శిల్పాల గీతలు :  నా ముఖాలు కవితలోని పంక్తులు కవిలోని సునిశితమైన అంతరవలోకననానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. బాణం విసిరిన పిచ్చుక కవితలో ఆయనలోని ప్రతీకాత్మకతను ఎత్తి చూపించింది. గ్రద్ద గోళ్లతో/  జీవన్మరణాల మధ్య/  ఇరుక్కున్న పిచ్చుక అడుగుతుంది/  ఎగిరే నిన్ను/  ఇప్పుడు ఎవరైనా బాణంతో కొడితే  ఎలా ఉంటుంది! అన్న వాక్యాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. వాక్యాన్ని అమ్మను చేసి శిఖరమంత ప్రేమను అమ్మవేసే మొట్టికాయలో ప్రత్యక్షంగా చూపించారు. యవ్వనం పగటి కలగా మారొద్దని హెచ్చరించారు. రోజూ ఇంటికి వచ్చే పిట్టకు దోసిళ్లతో గింజలు విసిరి కడుపారా ఆకలి తీర్చి ఆనందాశీస్సును అందుకున్నారు. కొండ చరియల్లలో పొర్లిపారిన పిల్ల సెలయేర్లతో పాటు  మంచుగడ్డ కూడా తమ ఒంటికి అంటిన మురికిని వదిలించుకోవాలని చలి నీళ్ళలో స్నానం చేస్తున్నాయన్నారు.

మూగ సంగీతంగా తనలోంచి జలపాతాళ ప్రవాహాలుగా వచ్చే చిత్రాలు అనుభూతిని మూటగట్టి అందరికీ  జాగ్రత్తగా అందిస్తాయని  చెప్పారు. కవి తమ అమ్మాయి పద్మ ద్వారా  అమెరికాను చూస్తూ తాను విడిచొచ్చినా యథాలాపంగా  గుర్తొచ్చే గుడివాడ  పంట  కాలువ తడిలోని అవ్యాజానుబంధాన్ని తలుచుకున్నారు. స్వరపేటికను కసిగా కొందరు కోస్తున్నా బలంగా తన్నుకొచ్చే నవ్వుల ధ్వనుల వెనక మర్మమేమిటో తనకే తెలుసునన్నారు. ఎక్కడ, ఎలా పిలవబడినా ఎల్లలెరుగక వెళ్లిన ప్రతి చోటల్లా  నలుగురిలో మంచి అనిపించుకునే మెప్పును తెలుగోళ్లు పొందితే చాలు అని చెప్పారు. లేత పసుపు పసిడి సింధూరపు చిగురాకులలో దాగి ఉన్న ఊహలకు మించిన అలంకారాలను చూస్తూ చిరుగాలుల ఈలలను తృప్తితో వినమన్నారు. భూమి గుండ్రమే, ప్రపంచమే పంజరమని లేతాకుపచ్చని రామ చిలుకను తెలుసుకోమన్నారు. చేతిలో లేని చావు గురించి ఆలోచనే వద్దని తెలిపారు. తన రంగులలో జలకాలాడే పాటల మాటల వినూత్న సంగీతం మలయమారుతంలా హృదయాన్ని తాకుతుంటే శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చిన మనస్సు గాన మాధుర్యంలో పరమానందం చెందుతున్నదని  చెప్పి  చికాగోలో బాల మురళీ కృష్ణ పాటకచేరీని ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతిని అక్షర సాక్ష్యం చేశారు.

శీతల కాలమైన డిసెంబరు నెలలో నగరం గాఢ నిద్రలో ఉండగా ఏం జరిగిందో న్యూఢల్లీి నేపథ్యంగా కవితాత్మకంగా విశ్లేషించి చూపారు. అరటి పువ్వు అందించిన జ్ఞాపకంలో తియ్యటి అనుభూతుల్ని అక్షరాలుగా అల్లారు. పాదాలను తిమ్మిరెక్కించే నీటి రేణువులు తీక్షణతను, తాదాత్మ్యతను వెల్లడిరచారు.  దగాపడ్డ బలిచక్రవర్తిపై జాలి పడ్డారు.
నిశిరాతిరి సుందరిని ఎత్తుకుపోయిన నవయవ్వన సుందరుడు ఉదయ భానుడని మనోజ్ఞంగా వర్ణించారు. చప్పట్ల అలల మధ్య వికసించిన ఓ పద్మపు విప్పారిన నెమలి కన్నుల విసనికఱ్ఱలు విదిలించిన చల్లని జల్లుల్లో తనివారా తడిసి ఆనంద డోలికలలో తేలిపోయారు. తప్పట్ల ధ్వనుల వలయాకృత నృత్యాలను, రంగుల రాగాలను చిరునవ్వులతో వెదజల్లిన కళాతపస్విని పద్మినిని అమెరికా గడ్డపై నిలుచుని తలుచుకున్నారు.

తనకు పద్మశ్రీ బిరుదు వచ్చినప్పుడు డాక్టర్‌ రామారావు చెట్టు విరబూసినంత ఆనందపడ్డారు. చూస్తే తన వంకే తిరిగి చూస్తుదంటూ నిరంతర కాపలాగా ఉండి తనను కాపాడే నీడకు నిజంగా ఋణపడి ఉన్నానని తెలిపారు. అంతర్ముఖంగా తెరుచుకున్న కండ్లలో ప్రాకృతిక దృశ్యాన్ని భద్రంగా దాచారు. నేలపై నివాసముండే పక్షుల కండ్లను ఉదయ భానుని కిరణాల మిరిమిట్లతో పోల్చారు. కండ్లు మూసి తెరిచే లోపునే ఎగిరిపోయిన ఎన్నో అనిర్వచనీయ జ్ఞాపకాలను హృదయసాక్షిగా మననం చేసుకుంటూ వేదన చెందారు. కొండచరియల చెక్కిళ్ళను నిమురుతూ తనలో పుట్టిన ఆలోచనలు ఆకాశమంత విస్తరించి అద్భుతాలకు ఆలవాలమవుతుంటే అంతకంటే జీవించడానికి కారణమేమి కావాలన్నారు.
మొదటి సారిగా అమెరికాను చూసినప్పుడు తన కండ్లు గుర్తు చేసిన గుడివాడ భూమికి శరీరాకృతినిచ్చిన మట్టి దృశ్యాన్ని అక్షరీకరించారు. కండ్లతో చూస్తేనే చిత్రాలను అర్థం చేసుకునే నైజం పెరగాలంటూ భారతీయ, ప్రపంచ చిత్రకళలను సమాదరించే తలలు, తలపులు, సరికొత్త తరాలు ఉండాలన్నారు.

గజిబిజి విదేశీ జీవనంలో జీవన సూర్య గ్రహణాన్ని ఇంకో గ్రహం పట్టుకొని మ్రింగేస్తుందని చెప్పారు. అనామకమై  నిజాన్ని కప్పిపెట్టే మానవుని మనసు కల్పవృక్షాన్ని పోలిన మఱ్ఱిచెట్టుకు తెలుసన్నారు. నీడలనంటుకుని నిరాశగా నడిచే మానవులకు చిగురించే అవకాశం అనుగ్రహించ మన్నారు. ఊహావిహారిణిని త్రోవ చూపే దీపశిఖని కావాలని చెప్పారు. కనుమూసేలోగా ఏదో గొప్ప అనుభవాన్ని చెప్పాలనుకున్నా ఊహించని ఆకస్మిక నిష్క్రమణ బాధామయమని తెలిపారు. రాజకీయం దేశాన్ని హైజాక్‌ చేసేంతగా దిగజారితే ప్రమాదమన్నారు. కరిగిన వెండిలా  మెరిసిపోతున్న  చికాగో నగరాన్ని చూసి ఆ వెనువెంటనే కవితలు రాయాలన్న కోరిక పుట్టిందని చెప్పారు. తానా, ఆటా, నాటాలకే కాదు కొడిగట్టకుండా తెలుగు భాషా దీపాన్ని అరచేతుల్ని అడ్డుపెట్టి కాపాడేందుకు ఏ వేదికైనా, ఏ ఊరైనా సరే తెలుగు వాళ్ళంతా ఊహించని రీతిలో తరలిరావాలని  ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అన్న కవితలో  పిలుపునిచ్చారు. భగవంతునికి మారుపేరే  సత్యమని  తెలిపారు. మూర?త్వమే ప్రపంచ వినాశనానికి మారణాయుధమని తేల్చి చెప్పారు. అవతారాలెన్ని ఎత్తి వచ్చినా భరించే బతుకు కోసం మనిషికి కురుక్షేత్ర యుద్ధం తప్పదని తెలిపారు. విదేశంలో మనిషి బ్రతుకు పుట్టిన చోటును వెదుక్కుంటూ వెనక్కి తిరిగి రాని  నది పరుగులాంటిదని తెలిపారు. బంగారంపై వ్యామోహం తగదన్నారు. చివరగా తన జీవన ప్రస్థానమే నేపథ్యంగా కవి కృతజ్ఞతతో, కరిగిపోయిన హృదయంతో జ్ఞాపకాల జడివాన కురిపించారు. రంగులు, రాగాలు, ఆరాధన, అనురాగాలు, వాస్తవికతల్ని  రంగరించి, రసానుభూతిని అందించిన  కవితలివి.
 -డా.తిరునగరి శ్రీనివాస్‌
                       9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *