Take a fresh look at your lifestyle.

జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కెఎస్‌ఆర్‌
రంగారెడ్డి,ప్రజాతంత్ర,మార్చి20: భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్‌ లో నిర్మించిన క్యాపిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మీడియా సంస్థ భవన సముదాయాన్ని బుధవారం నాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలే పోటీ, ఆపై సోషల్‌ మీడియా విప్లవంతో మీడియా సంస్థల నిర్వహణ నేడు ప్రశ్నర్తకంగా మారిందన్నారు. దీనిని అధిగమించడం కోసం వాస్తవాలకు భిన్నంగా, సంచలనాల కోసం పోటీ పడితే ప్రజల్లో చులకన భావం ఏర్పడడంతో పాటు విశ్వాసం సన్నగిళ్ళుతుందనే విషయాన్ని మాత్రం మీడియా సంస్థల నిర్వాహకులు మరచిపోరాదన్నారు. ప్రజల ఆకాంక్షల్ని పసిగట్టి, వాటి పరిష్కారానికి కృషిచేసే మీడియా సంస్థలకు ప్రజల నుండి ఖచ్చితంగా ఆదరణ ఉంటుందని  శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, గత పదేళ్ల నియంతృత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛను కోల్పోయిందని, ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులకు సంకెళ్లు పడ్డాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అధికారాన్నిచ్చి ప్రజలు స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నారని ఆయన అన్నారు. దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్‌ మాట్లాడుతూ, సమాజంలో జర్నలిజం వృత్తి అతి కీలకమైనదని, ఇందుకుగాను జర్నలిస్టులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తిస్తేనే సత్ఫలితాలు వుంటాయన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ మాట్లాడుతూ, సోషల్‌ మీడియా విప్లవంతో జర్నలిజం వృత్తి కత్తి మీద సాముల మారిందన్నారు. ఓవైపు మీడియా సంస్థలను కాపాడుకోవడం, మరోవైపు   జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం అవిశ్రాంతంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికలు, మెగజైన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యూసుఫ్‌ బాబు, క్యాపిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రచురణకర్త ఎన్‌.శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply