రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ధర్మం వైపు కాట శ్రీనివాస్‌గౌడ్ నిలిచిండు
అధర్మం వైపు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
అశేష జనాధరణ కాట శ్రీనివాస్‌గౌడ్ సొంతం
మెదక్‌లో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మది
కాట శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 26 : కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి అత్యంత అవినీతిపరుడని, అక్రమంగా రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని అన్నారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార రోడ్డు షో కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రోడ్డు షోకు వేలాదిగా జనం తరలిరావడంతో ఇస్నాపూర్ చౌరస్తా జనసంద్రంగా మారిపోయింది. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్ముడితో కలిసి చేసిన అక్రమాలు, అసైన్డ్ భూముల కబ్జాలు, రౌడీయిజాన్ని రూపుమాపుతామన్నారు. 2014 కంటే ముందు మహిపాల్‌రెడ్డి ఆస్తులు, స్థితిగతులను పరిశీలించాలని కోరారు. కాట శ్రీనివాస్‌గౌడ్ వైపు ధర్మం ఉంటే.. మహిపాల్ రెడ్డి వైపు అధర్మం ఉందని అభిప్రాయపడ్డారు. కాట శ్రీనివాస్‌కు అశేష జనాధారణ ఉందని, ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో 9.30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని, ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలని తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ కేసీఆర్ అంటున్నాడని, కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకకు రోడ్లు, నీటి సౌకర్యంతో పాటు నువ్వు చదువుకున్న బడిని సైతం కాంగ్రెస్ కట్టించిందంటూ చెప్పుకొచ్చారు. స్థానికంగా ఉన్న ట్రిపుల్ ఐటీని కాంగ్రెస్ ఇచ్చిందని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చి.. ఓఆర్ఆర్, ఫార్మా కంపెనీలు, కృష్ణా, గోదావరి జలాలను తీసుకురావడం.. వ్యవసాయ శాస్త్రవేత్తలను తయారు చేసింది కాంగ్రెస్ కాదా..? అంటూ ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా, బిర్లా మందిర్ మెట్ల మీద కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకుని బతికేటోళ్లని మండిపడ్డారు. నాడు రబ్బర్ చెప్పులు లేనోళ్లు నేడు హెలికాప్టర్, బెంజ్ కార్లలో ఏలా తిరుగుతున్నారని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని, అక్కడ కేసీఆర్‌ను, ఇక్కడ మహిపాల్‌రెడ్డిని బొందపెట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ది జరిగిందన్నారు. పదేళ్లు కేసీఆర్‌ను తెలంగాణను లూటీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో దుర్ఘటనలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడిన అవస్థలు తెలుసని చెప్పారు. ఈనెల 30న జరిగే పోలింగ్ లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాట శ్రీనివాస్ గౌడ్ ను పటాన్ చెరు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




