– 15 ఏళ్లుగా అధికారంలో బెంగాల్ వెనకబాటు
– కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
కోల్‌కతా, ఏప్రిల్ 20 : పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దానికిపైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేవలం 5 నుంచి 8 ఏళ్లలో అభివృద్ధి సాధించాయని, దేశ ఆర్థిక వృద్ధిలో 10 శాతంగా ఉన్న పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధికారంలోకి వొచ్చాక 5 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ మార్పును తీసుకురావాలని వోటర్లను కోరారు. సోమవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వరుసగా మూడుసార్లు టీఎంసీకి అధికారం ఇచ్చారని, 15 ఏళ్లు అంటే అదేమీ తక్కువ సమయం కాదని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారని, ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈసారి బీజేపీకి బాసటగా నిలవాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. భయాందోళనల మధ్య ఇక్కడి ప్రజలు కాలం నెట్టుకొస్తున్నారు. వారందరికీ ఒకటే చెప్పదలచుకున్నాను. ఈసారి మార్పు తప్పనిసరిగా రావాలి. బీజేపీకి మీరంతా అండగా నిలబడాలి అని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధానమంత్రి మోదీ స్థిరనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఇవాళ కాకపోతే, రేపు అది జరిగి తీరుతుంది అని భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయావకాశాలపై రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పలేను కానీ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చితీరుతుందన్నారు. మూడింట రెండొంతుల సీట్లు ఖాయమని చెప్పారు.




