– పీఎం క్రీడా ఉత్సవంలో గవర్నర్
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24. యువత ఒక శక్తివంతమైన, ప్రగతిశీల దేశానికి నిజమైన నిర్మాతలని, వారి ఉత్సాహం, క్రమశిక్షణ మరియు దృఢ సంకల్పం భారతదేశ నిర్భయ స్ఫూర్తికి ప్రతిబింబాలని రాష్ట్ర గవర్నర్ కొనియాడారు. శు క్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ‘ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీలో ప్రసంగించిన గవర్నర్, క్రీడలు కేవలం గెలుపు ఓటములకే పరిమితం కాదని, అవి వ్యక్తిత్వ వికాసానికి మరియు సామాజిక ఐక్యతకు పునాదులని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్రీడల పట్ల చూపుతున్న ఆసక్తిని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ క్రీడలు లేదా ఆసియా క్రీడలు జరుగుతున్నప్పుడు ప్రధాని రాత్రంతా మేల్కొని మరీ క్రీడాకారులను ఉత్సాహపరుస్తారని గుర్తుచేశారు. ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కొత్త విద్యా విధానం ద్వారా క్రీడలను ప్రధాన స్రవంతి విద్యలో భాగం చేయడం వల్ల భవిష్యత్తులో గొప్ప ఛాంపియన్లు తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు. క్రీడలు టీమ్ స్పిరిట్ ను పెంపొందించడమే కాక సహనాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని గవర్నర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రతిభను ఏకం చేయడంలో ఈ మహోత్సవం ఒక బలమైన వారధిలా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎంపీ డీకే అరుణ కృషిపై ప్రశంసలు
ఇటీవల తాను ఢిల్లీలో ప్రధానిని కలిసినప్పుడు, తెలంగాణలో క్రీడల ప్రోత్సాహం గురించి చర్చించానని గవర్నర్ తెలిపారు. స్థానిక ఎంపీ డీకే అరుణ తన నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, ఆమె ఆహ్వానం మేరకే నేడు తాను ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారతదేశ ప్రాచీన సంప్రదాయాలైన యోగా, మార్షల్ ఆర్ట్స్ శరీరం, మనస్సును సమతుల్యం చేస్తాయని, వీటిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడాకారుల ప్రయాణమే రేపటి ‘వికసిత భారత’్కు బాటలు వేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం : రామచందర్ రావు
దేశ భవిష్యత్తును నిర్మించే యువత శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని, స్వస్థ భారత్-ఫిట్ ఇండియా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ వేదికగా యువ క్రీడాకారుల ఉత్సాహం మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతలో భాగంగా 2020లో తీసుకొచ్చిన నూతన విద్యా, క్రీడా విధానాలు నేడు దేశవ్యాప్తంగా అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. ‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తిస్తూ విద్యార్థులను క్రీడల వైపు మళ్లించడం అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ క్రీడా వేడుకలను నిర్వహించడం ద్వారా గ్రామీణ, పాఠశాలస్థాయి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు గొప్ప అవకాశం లభిస్తోందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో కొంతమంది యువత మత్తు పదార్థాల (డ్రగ్స్) బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ యువతను వ్యసనాలకు దూరంగా ఉంచి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు క్రీడలే ఉత్తమ మార్గమని హితవు పలికారు. కేవలం చదువుకే పరిమితం కాÅ£ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. క్రీడల వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. ‘నశా ముక్త్ భారత’, ‘ఆత్మనిర్భర్ భారత’, 2047 నాటికి ‘వికసిత భారత’ లక్ష్యాలను సాధించడంలో యువత కీలక పాత్ర పోషించాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. పాఠశాలస్థాయి నుండే ప్రతిభను గుర్తించి ఈ క్రీడా మహోత్సవాన్ని దిగ్విజయం చేసిన నిర్వాహకులను, పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




