– నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
– సవరించిన భూముల మార్కెట్ విలువను అమలులోకి తెండి
– కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
– ‘హిల్ట’ని ఆహ్వానిస్తున్నాం: ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : హైదరాబాదు నగరంతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెటుకుని ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హిల్ట్’ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్) తీసుకు వచ్చిందని, ఈ పాలసీని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఈ పాలసీపై సమీక్ష సమావేశంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో కాలుష్యకారక పరిశ్రమలన్నిటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలించాలనేది తప్పనిసరి చేస్తే అందరూ వెళ్ళిపోతారని కొందరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధులు స్వయంగా చెప్పినప్పటికీ తాము అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసకుని ప్రజాస్వామ్య పద్దతిలో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. అన్ డెవలప్డ్ ల్యాండ్ (యూడీఎల్) పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి భూములను అభివృద్ధి చేసుకునే ఆలోచన చేయాలన్నారు. ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని, చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సూచించారు. ఈ సూచనలను స్వాగతిస్తున్నామని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని, నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కేబినెట్ లక్ష్యం అని చెప్పారు. ఓఆరఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్‌లతో చర్చించి హిల్ట్ పాలసీ అమలును వేగవంతం చేసుకుందామన్నారు. ఈ పాలసీ గైడ్‌లైన్స్ రూపొందించే ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధుల ఆలోచనలకు చోటు కల్పించే ప్రయత్నం చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు బాగా నడవాలి, కాలుష్యం ఉండకూడదు.. ఈ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్‌గా ఉంది అని కమిటీ సభ్యుడు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి చేశామని వెల్లడించారు. కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు.
‘హిల్ట్’ పాలసీని ఆహ్వానిస్తున్నాం: శ్రీనివాసరెడ్డి
హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పాలసీని ఇస్టారాజ్యాంగా అమలు చేసుకుంటూ పోతే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇబ్బందిపడతారని కొంతమంది నాయకులు చెప్పారని, అయితే ఇది ప్రభుత్వ నిర్ణయం, జీవో ప్రకారం అమలు జరుగుతుంది.. ప్రస్తుతం తాము ఉంటున్న భూములను 30 సంవత్సరాల క్రితమే ఆనాటి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాం.. తమ వద్ద సేల్‌డీడ్‌లు సైతం ఉన్నాయని వివరించినట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కన్వర్షన్ చార్జీలను రోడ్డు విస్తీర్ణాన్నిబట్టి 30% నుంచి 50% వరకు నిర్ణయించారు.. ఈ పాలసీ అమలులో ఎక్కడా నగదు బదిలీ లేదు కాబట్టి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధిగా తాము వారికి స్పష్టం చేశామని కేబినెట్ సబ్ కమిటీకి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు-రీజినల్ రింగ్ రోడ్డు వద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, యూడీఎల్ పాలసీ కింద భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు సహకరించాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుల్లో కనీస సౌకర్యాలు అsయిన కార్మికులు, ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. పాలసీ అమలకు ఆరు నెలు సమయం ఇవ్వాలని, ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుల్లో పరిశ్రమలకు ఉన్న విద్యుత్తు, మంచినీరు వంటి వసతులను ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఏర్పాటు చేసుకునే పరిశ్రమలకు షిఫ్ట్ చేసేందుకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని ఆయన కోరారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని, కన్వర్షన్ చార్జీలను స్వల్పంగా తగ్గించాలని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సెక్రటరీ సత్యనారాయణ మంత్రులను కోరారు. హిల్ట్ పాలసీ ఎక్కువమంది పారిశ్రామికవేత్తలకు ఆమోదయోగ్యంగా ఉంది.. సబ్సిడీలు ఇవ్వకపోయినా పర్వాలేదు.. భూమి చూపించి ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షుడు నరేంద్రబాబు సూచించారు.
కాగా, రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలోని భూముల వివరాలు సేకరించాలని, వాటిలో ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైనవి, శాఖల అందుబాటులో ఉన్న వాటి వివరాలు సేకరించాలని, జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సమాచారం సేకరించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. రిసోర్స్ మొబిలైజేషన్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు కచ్చితంగా అమలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, అశ్రద్ధ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




