– నిజాయతీ ఉంటే ముందుకు రండి
– బీఆర్ఎస్ నాయకత్వానికి మంత్రి పొంగులేటి సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే వెంటనే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదంటే స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బీఆరఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తోందని, భారీ ఆర్థిక దోపిడీ, కమీషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతోందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఇదే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక ప్రకటనలో ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాలు కుంగిపోవడం, పంప్ హౌజ్‌లు దెబ్బతినడం వంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రాజెక్టులో జరిగిన పెద్ద ఎత్తున అవినీతికి నిదర్శనాలేనని పేర్కొన్నారు. ఆనాటి బీఆరఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత దెబ్బతిన్నదని, అదే విధంగా నిర్మించిన చెక్‌డ్యాములు కూడా కుప్పకూలిన ఘటనలు ప్రజల ముందు ఉన్న వాస్తవాలేనని మంత్రి గుర్తు చేశారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్నట్టు గోబెల్ ప్రచారానికి దిగడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, ఇది బీఆరఎస్ మాయాజాల రాజకీయాలే అని విమర్శించారు. నిజాన్ని దాచేందుకు ప్రచార యంత్రాంగాన్ని వినియోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. బీఆరఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ఈ అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, విచారణ నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్పు్రాక్టుపై పూర్తిస్థాయి పారదర్శక విచారణ జరగడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత అని అన్నారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై లెక్క చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





