మేధస్సు కంటే చిత్తశుద్ధే ముఖ్యం

– క్షేత్రస్థాయిలో మీ విచక్షణే అసలైన పరీక్ష
– ప్రజాసేవలో ఫైలు వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు
– గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి దిశానిర్దేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది.. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి.. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తుంచుకోండి అని నూతనంగా ఎంపికైన గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచఆర్‌డీ)లో ఆరు వారాలపాటు జరిగిన గ్రూప్-1 ఫౌండేషన్ కోర్స్ (బ్యాచ్-2) ముగింపు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 214 మంది అధికారులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగిస్తూ ప్రజా సేవలో పాటించాల్సిన నైతిక విలువలు, పరిపాలనలో మానవీయ కోణాన్ని మర్చిపోవద్దని దిశానిర్దేశం చేశారు. పరిపాలనలో వేగం పెరగాలని, ప్రతి నిర్ణయం పేదవాడి దరి చేరాలని సూచించారు. వ్యవస్థలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.. కానీ అందులో పనిచేసే వ్యక్తులు చూపే సానుభూతి (ఎంపతీ) మాత్రమే మార్పును తెస్తుంది అని అన్నారు. రైతు ఆశ, విద్యార్థి కల, రోగి ప్రాణం.. ఇవన్నీ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. చట్టాలకు లోబడి ఉంటూనే మానవీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి అని భట్టి పేర్కొన్నారు. ఫైళ్లు, సమీక్షల హడావుడిలో పడి సామాన్యుడిని విస్మరించవద్దన్నారు. పోటీ పరీక్షల్లో మీ మేధస్సు నిరూపితమైంది కానీ క్షేత్రస్థాయిలో మీ విచక్షణకు పరీక్ష ఎదురవుతుందని, ఒత్తిళ్లకు లొంగకుండా నైతిక విలువలతో పనిచేసినప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న సమ్మిళిత వృద్ధిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని గుర్తు చేశారు. నేటి ఆధునిక యుగంలో ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో వాడుకోవాలని, అయితే సాంకేతికత ఎన్నటికీ మానవత్వంతో కూడిన సానుభూతిని భర్తీ చేయలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి వంటి ప్రతిష్టాత్మక పథకాలను ప్రజలకు చేరవేయడంలో యువ అధికారులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రజలతో మీరు మాట్లాడే తీరు, వారిని గౌరవించే విధానం, నిజాయతీయే ప్రభుత్వానికి అసలైన ముఖచిత్రం అని ఆయన స్పష్టం చేశారు. ఒక పింఛను సకాలంలో అందడం, ఒక చిన్న సమస్య పరిష్కారం కావడం ద్వారానే సుపరిపాలన పునాదులు బలపడతాయన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అది నిష్పాక్షికంగా ఉందా నిజాయతీగా ఉందా అని ఒక్కసారి సరిచూసుకోవాలని సూచించారు. రాజీ పడటం సులభం కావచ్చు.. కానీ నిబద్ధతతో నిలబడటమే అసలైన ప్రజా సేవ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తమ సహచార కేబినెట్ మంత్రులు కానీ అధికారాన్ని అనుభవించడం కోసం పనిచేయడం లేదని, ఆ అధికారాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని కోట్లాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.  ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన వివరించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించి మిమ్మల్ని ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చాయని, ఆ వ్యవస్థ పట్ల కృతజ్ఞతతో ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూనే మిమ్మల్ని ఇంతటి వారిని చేసిన ఈ రాష్ట్రానికి మీరు తిరిగి ఏమి ఇవ్వగలరో ఆలోచించాలని కోరారు. ప్రభుత్వ ఆశయాలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీహెచఆర్‌డి జనరల్ డైరెక్టర్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *