మహిళలకు ప్రభుత్వం గ్రీన్ గిఫ్ట్

– ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పార్కుల నిర్వహణ బాధ్యతలు
– కాంట్రాక్టర్లకు బదులు మహిళలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : మహిళల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంఎంసీ పరిధిలోని ప్రతి జోన్‌లో కనీసం రెండు పార్కులను స్వయం సహాయక సం|ఘాల మహిళలకు నిర్వహణ కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎల్‌బీ నగర్ జోన్ పరిధిలోని రెండు పార్కులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఎల్‌బీ నగర్ జోన్‌లో సర్కిల్-12, సరూర్‌నగర్ పరిధిలోని హుడా సి-టైప్ పార్కు నిర్వహణను జన్మభూమి ఎంపీఎస్ స్వయం సహాయక సంఘానికి అప్పగించారు. సర్కిల్-14, హయత్‌నగర్ పరిధిలోని యశోద ఎన్‌క్లేవ్ కాలనీ పార్కు నిర్వహణను ఆదర్శ ఎంపీఎస్ స్వయం సహాయక సంఘానికి అప్పగించారు. ఉప్పల్ జోన్‌లో ఉప్పల్ సర్కిల్ చిలుకనగర్ వార్డులోని బ్యాంక్ కాలనీ పార్కు వేంకటేశ్వర స్వామి ఎస్‌హెచ్ జి, జీవనజ్యోతి ఎస్‌హెచ్‌జి, సైలాన్‌బాబా ఎస్‌హెచ్‌జిలకు అప్పగించారు. నాచారం సర్కిల్ శక్తి సాయి నగర్ లోని గోకుల్ నగర్ కాలనీ పార్కు మునీర ఎస్‌హెచ్‌జికు అప్పగించారు.
మల్కాజ్‌గిరి జోన్‌లో కీసర సర్కిల్‌లోని ప్రశాంత్ విహార్ కాలనీ పార్కు నిర్వహణను మల్లన్న స్వయం సహాయక సంఘానికి, సాయి కృష్ణా ఎన్‌క్లేవ్ పార్కును వారాహి స్వయం సహాయక సంఘానికి అప్పగించారు. అల్వాల్ సర్కిల్‌లోని భూదేవి నగర్ పార్కును విజయ గణపతి స్వయం సహాయక సంఘానికి, బోయిన్‌పల్లి సర్కిల్‌లోని నెహ్రూ నగర్ పార్కు నాగశ్రీ స్వయం సహాయక సంఘానికి అప్పగించారు. పార్కుల నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, మొక్కల సంరక్షణ, నీటి సరఫరా, ఉద్యానవన నిర్వహణ తదితర రోజువారీ పనులను ఆయా సంఘాల మహిళలే నిర్వహించనున్నారు. ఈ పనులు యూబీడీ సిబ్బంది సాంకేతిక మార్గదర్శకత్వంలో కొనసాగుతాయి. ఈ పైలట్ ప్రాజెక్టులో మహిళల పనితీరు సంతృప్తికరంగా ఉంటే, ప్రస్తుతం కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇతర పార్కులను కూడా దశలవారీగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రాజెక్టు డైరెక్టర్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, డీపీఓలు తరచూ పార్కులను సందర్శించి పనితీరును పర్యవేక్షించనున్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఈ పైలట్ ప్రాజెక్టులో పాల్గొనే స్వయం సహాయక సంఘాలకు ఈఎండీ, జీఎస్టీ, లేబర్ లైసెన్స్ తదితర రుసుముల నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది.

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అధికారులు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 92వ రోజు సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం భారీ స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టి రహదారులు, కాలనీలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు నగర పరిశుభ్రతతోపాటు పచ్చదనం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని యూబీడీ డైరెక్టర్ సునంద తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *