నిశ్శబ్ద శ్వాసే….నిశ్చల మనస్సుకు తొలి అడుగు

సైకాలజిస్ట్,వరంగల్
సాధారణంగా కౌన్సిలింగ్ అనగానే కేవలం సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించటం, మార్గదర్శకం చేయటం అనుకుంటారు. కానీ నేటి ఆధునిక మనస్తత్వశాస్త్రంలో కేవలం మానసిక విశ్లేషనే కాకుండా శారీరక స్పందనలను కూడా క్రమబద్ధీకరించడం ఆవశ్యకమని నిపుణులు గుర్తిస్తున్నారు. మానసిక గాయాలు (Trauma ) తీవ్రమైన ఆందోళనలు కేవలం మనసులోనే కాదు శారీరక కణజాలాలలో కూడా నిగూఢంగా పేరుకు పోతాయి. అందుకే ప్రస్తుత కాలంలో కౌన్సిలింగ్ ప్రక్రియలో ‘యోగా ఒక అద్భుతమైన చికిత్స సాధనంగా(therapeutic tool) పరిణమించింది.యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు,అనవసరపు ఆలోచనలను,ఒత్తిడిని నియంత్రించి నిద్రను మెరుగుపరచడంలో చురుగ్గా పనిచేస్తుంది. భావోద్వేగ సమతుల్యతను సాధించటంలో సహాయపడే సమగ్ర మానసిక ఆరోగ్య సాధనం. ” బాధలు బాహ్య ప్రపంచాన్ని ముంచెత్తిన వేళ…. శ్వాస నిశ్శబ్దంగా అంతరంగపు గాయాలను మాన్పుతుంది. కౌన్సిలింగ్ ఆలోచనల దిశను మారిస్తే యోగ ఆ ఆలోచనలకు నిశ్చలత్వాన్ని ఇస్తుంది.”
మనోవిశ్లేషణలోయోగా: భాష రహిత భావవ్యక్తీకరణ డిప్రెషన్ లేదా భయాందోళనలతో సతమతమయ్యేవారు తమ అంతర్గత వేదనను మాటలలో వ్యక్తపరచలేరు. అటువంటి క్లిష్ట సమయాల్లో యోగాసనాలు మరియు ప్రాణాయామం వంటి వాటి ద్వారా వారు తమ శారీరక బిగుతును సడలించి మానసిక ఒత్తిడి నుండి సులభంగా విముక్తి పొందుతారు.
నాడీ వ్యవస్థను ప్రశాంత పరచడం: మానసిక సమస్యలతో బాధపడే వారి శరీరం నిరంతరం రక్షణ ధోరణిలోనే (fight/flight) ఉంటుంది.యోగాలోని ‘శ్వాసక్రియలు’మెదడుకు స్థిరత్వాన్ని చేకూర్చే *పారాసింపథెటిక్* నాడీ వ్యవస్థను ఉత్తేజ పరుస్తాయి. *అంతరంగిక అవగాహన (Mindfulness)*: కౌన్సిలింగ్ కు వచ్చే వ్యక్తికి తన ఆలోచన సరళిని గమనించే విచక్షణ అవసరం.యోగా సాధన వల్ల లభించే ఏకాగ్రత సదరు వ్యక్తి తన ప్రతికూల ఆలోచనలను తనే విశ్లేషించుకుని, వాటిని సకారాత్మకంగా మార్చుకునేందుకు( Cognitive Restructuring) తోడ్పడుతుంది. *భావోద్వేగ సమతుల్యత*: యోగ సాధన ద్వారా క్రోధం, విచారం, భయం మొదలగు తీవ్రమైన భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే మానసిక పక్వత లభిస్తుంది. దీనివల్ల కౌన్సిలర్ సూచించే అంశాలను క్లైంట్ మరింత ఆశాజనకంగా స్వీకరించడానికి వీలవుతుంది.
మనో విశ్లేషకులు అవలంబించాల్సిన సూత్రాలు:
1. మానసిక స్థితిని అంచనా వేయాలి :- ఇందులో భాగంగా తీవ్ర ఆందోళన ఉన్నవారికి నేరుగా క్లిష్టమైనఆసనాలు కాకుండా కేవలంప్రాథమిక శ్వాసక్రియలతో చికిత్సను ప్రారంభించాలి.
2.శారీరక పటిష్టతను గమనించాలి :- క్లైంట్ కు ఉన్న శారీరక రుగ్మతలు ముందే అడిగి తెలుసుకుని వారికి అనువైన భంగిమలను మాత్రమే సూచించాలి.
3 . స్వచ్ఛందతకు ప్రాధాన్యత :- యోగ అనేది అంతర్గత ప్రశాంతతను ఇవ్వాలి. కానీ సరి కొత్త భారంగా మారకూడదు. క్లైంట్ కు సంపూర్ణ ఇష్టం లేనప్పుడు బలవంతంగా రుద్దకూడదు.
4 . ఆహ్లాదకర వాతావరణం :- కౌన్సిలింగ్ గదిలో యోగ లేదా ధ్యానం చేయించేటప్పుడు నిశ్శబ్దంగా తగినంత వాయు ప్రసరణ మరియు వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
5 . క్రమశిక్షణతో కూడిన ఆరంభం :- మొదటి రోజే ఎక్కువ సమయం కాకుండా రోజుకు 5 నుండి పది నిమిషాల మైండ్ ఫుల్ నెస్ తో క్రమంగా వ్యవధిని పెంచాలి. కౌన్సిలింగ్ అనేది మనసును పునర్నిర్మించే ప్రక్రియ. అయితే యోగ ఆ ప్రక్రియను వేగవంతం చేసే ఇంధనం లాంటిది. మాటల వైద్యానికి యోగ సాధన తోడైనప్పుడు మానసిక సమస్యల నుండి వ్యక్తులు అత్యంత త్వరగా కోలుకుంటారు .అందుకే సైకాలజిస్టులు కౌన్సిలింగ్ తో పాటు యోగాను ఒక సమగ్ర విధానంగా అనుసంధానిస్తున్నారు.





