– ఆ మహోన్నత సాధనమే యోగా
– గవర్నర్ శివప్రతాప్ శుక్లా
– సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ‘1డే కౌంట్ డౌన్ యోగా’
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఈ రోజు మనం ఒక శారీరక వ్యాయామ విధానాన్ని మాత్రమే జరుపుకోవడం కాదు.. వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారత దేశపు సనాతన జ్ఞాన సంప్రదాయానికి గౌరవం తెలుపుతున్నాము అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఒక రోజు ముందుగా 1డే కౌంట్ డౌన్ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ యోగా అనేది కేవలం వ్యాయామం కాదు.. అది జీవన విధానం. శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే ఒక మహోన్నత సాధనం అని పేర్కొన్నారు. భారత దేశం ప్రపంచానికి అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని నేడు ప్రపంచమంతా స్వీకరించడం మనకు గర్వకారణమన్నారు. నేడు యోగా దేశాల సరిహద్దులు, భాషలు, సంస్కృతులను దాటి ప్రపంచ మానవాళిని ఏకం చేసే శక్తిగా నిలిచిందని తెలిపారు. ఆధునిక జీవితంలోని సవాళ్లు, ఒత్తిళ్లు, అసమతుల్యతల మధ్య యోగా మనకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల శక్తిని ప్రసాదించే మహత్తర సాధనం అని, ఏ దేశానికైనా అసలైన బలం కేవలం దాని ఆర్థిక వ్యవస్థలో, సహజ వనరుల్లో లేదా సాంకేతిక పురోగతిలో ఉండదని, ఆ దేశపు సంస్కృతి, నాగరికత, విలువలలోనే దాని నిజమైన శక్తి దాగి ఉంటుందని తెలిపారు. ఒక సమాజం తన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడే భవిష్యత్తు వైపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందన్నారు. గత 12 సంవత్సరాలలో భారత్ ‘వికాస్ భీ-విరాసత్ భీ’ అనే మంత్రంతో సాంస్కృతిక పునరుజ్జీవనానికి నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పారు. నేడు దేశానికి చెందిన 44 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ప్రపంచ వేదికపై మన గొప్ప సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తున్నాయని, 11 భారతీయ భాషలకు శాస్త్రీయ భాష హోదా లభించిందని, అందులో దక్షిణ భారత దేశపు గర్వకారణమైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలు కూడా ఉన్నాయని, వేల సంవత్సరాలుగా ఈ భాషలు జ్ఞానం, సాహిత్యం, ఆధ్యాత్మికత, సంస్కృతి వంటి అమూల్య సంప్రదాయాలను పరిరక్షిస్తూ భారత నాగరికత వైభవాన్ని మరింత సమృద్ధిగా తీర్చిదిద్దాయని వివరించారు. ఇది మన భాషా, సాంస్కృతిక వైవిధ్యానికి లభించిన గౌరవం అని అన్నారు. మన ప్రాచీన జ్ఞాన సంపదను సంరక్షించేందుకు 12 లక్షలకు పైగా ప్రాచీన గ్రంథాలు, కళాఖండాలను డిజిటలైజ్ చేశారని, విదేశాలకు వెళ్లిన భారత వారసత్వ సంపదలోని 668 అమూల్య పురాతన కళాఖండాలను తిరిగి స్వదేశానికి తీసుకురావడం సాంస్కృతిక పరిరక్షణ పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక రంగాలకు కొత్త ఊపునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద’ పథకం కింద సుమారు రూ.1,700 కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 11 గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంల స్థాపన ద్వారా గిరిజనుల వారసత్వానికి, స్వాతంత్య్ర సంగ్రామంలో వారి సేవలకు తగిన గౌరవం లభిస్తోందన్నారు. నేడు అయోధ్య, కాశీ, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలు కేవలం భక్తి కేంద్రాలుగానే కాక సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకలుగా నిలిచాయన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా నేడు ఒక ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారిందని, గత కొన్నేళ్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో 26 కోట్లకుపైగా ప్రజలు పాల్గొనడం భారతదేశపు ఈ ప్రాచీన జ్ఞానం ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతోందని స్పష్టం చేస్తోందని చెప్పారు. అభివృద్ధి మరియు సంప్రదాయం పరస్పర విరుద్ధమైనవి కావన్నారు. ఆధునికతను స్వీకరిస్తూనే మన సాంస్కృతిక మూలాలతో అనుసంధానమై ఉండవచ్చుననేది భారత దేశ మార్గం అని, అదే మన ప్రత్యేకత.. అదే మన అతి పెద్ద బలం.. అని అన్నారు. యోగాతో ఆరోగ్యం.. యోగాతో సమతుల్యత.. యోగాతో ఆత్మబలం.. యోగాతో ఈ సృష్టి బలపడుతుంది అని గవర్నర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




