-కేటీఆర్‌కు టీఎస్ ఈఏ ప్రతినిధుల విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: రాష్ట్రంలోని సుమారు పది వేల ప్రభుత్వ పాఠశాలల్లో 2 కిలోవాట్, 3 కిలోవాట్, 5 కిలోవాట్ రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు కోసం ఇటీవల విడుదల చేసిన టెండర్‌లో కనీస వార్షిక టర్నోవర్ ₹150 కోట్లు ఉండాలి, అలాగే ఒకే సంవత్సరంలో 25 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను అమలు చేసిన అనుభవం ఉండాలి అనే అర్హత ప్రమాణాలు విధించారు.. ఈ నిబంధనల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను అమలు చేస్తున్న స్థానిక సోలార్ ఎంఎస్ ఎంఈలు దాదాపు పూర్తిగా అనర్హులుగా మారుతున్నారని సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీఎస్ ఈఏ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు వారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం కలిసి తమ సమస్యను విన్నవించారు. గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో వార్షిక రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు చాలా సందర్భాల్లో 20 మెగావాట్లను కూడా మించలేదు. అలాంటి పరిస్థితిలో ఈ టెండర్ నిబంధనలు కొద్దిమంది పెద్ద సంస్థలకు, ముఖ్యంగా రాష్ట్రానికి వెలుపల ఉన్న కంపెనీలకు మాత్రమే అనుకూలంగా రూపొందించినట్లు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ పారిశ్రామికవేత్తలు తమ సొంత రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇంతకుముందు విడుదలైన పాఠశాల సోలార్ టెండర్ కూడా రాష్ట్రానికి వెలుపల ఉన్న కంపెనీలకే కేటాయించబడింది. అయితే సంవత్సరం గడిచినప్పటికీ ఆ ప్రాజెక్టు అమలులో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదని సమాచారం. స్థానిక పరిశ్రమ సామర్థ్యాలను వినియోగిస్తూ భాగస్వామ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్న సమయంలో, కొత్త టెండర్ మరింత కఠినమైన అర్హత ప్రమాణాలతో స్థానిక సంస్థలకు అడ్డంకులు సృష్టిస్తోందని వివరించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి సానుకూల స్పందన లభించలేదు. అందువల్ల నాణ్యత ప్రమాణాలను కాపాడుతూ తెలంగాణకు చెందిన సోలార్ సంస్థలు కూడా పోటీ పడగలిగే విధంగా టెండర్ అర్హత ప్రమాణాలను హేతుబద్ధంగా సవరించాలని వారు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో భాగంగా తెలంగాణకు చెందిన సోలార్ పారిశ్రామికవేత్తలకు పాఠశాలలలో సోలార్ ప్రాజెక్టుల అమలులో సమాన అవకాశాలు కల్పించబడ్డాయని వారు గుర్తుచేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో బుర్ర అశోక్ కుమార్ గౌడ్అ, ధ్యక్షుడు తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీఎస్ ఈఏ) ,శ్రీహరిబాబు -జనరల్ సెక్రటరీ , బాబు నాయుడు-జాయింట్ సెక్రటరీ, శ్రీనివాస్ కుక్కడపు -జాయింట్ సెక్రటరీ, రాజేష్ పరకాల-వైస్ ప్రెసిడెంట్, ఈసీ మెంబర్లు బదరి నారాయణ, జాన్ విల్యం, రాఠి తదితరులున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


