కాంగ్రెస్ వైఖరిపై గళమెత్తిన నారీ లోకం

–  ‘మహిళా ఆగ్రహ యాత్ర’ విజయవంతం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి కపట బుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు. దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు వరకు కొనసాగిన ఈ భారీ పాదయాత్రలో వేలాదిమంది మహిళలు పాల్గొని కాంగ్రెస్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ గారు, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని మహిళా లోకానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. బీజేపీ మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు సామాన్య మహిళామణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంటనగరాల నలుమూలల నుంచి తరలివచ్చిన నారీలోకంతో ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు వరకు రహదారులన్నీ కాషాయమయమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మారిస్తే కాంగ్రెస్ రాజకీయం చేస్తూ అడ్డుకుందని నేతలు విమర్శించారు. యాత్ర ముగింపులో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన నిరసన సభలో మహిళా నాయకులు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. నారీ శక్తి ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అంతర్థానం కావడం ఖాయమని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ’ తీసుకువచ్చి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే దానిని రాజకీయం చేస్తూ అడ్డుకున్న ఘోర చరిత్ర కాంగ్రెస్, ఇండీ కూటమిదని విమర్శించారు. మహిళా శక్తి ఎదగడం ఇష్టం లేని కాంగ్రెస్.. డీలిమిటేషన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని మహిళల అభివృద్ధిని కాలరాస్తోందని మండిపడ్డారు. సభలో రామచందర్ రావు మాట్లాడుతూ బీఆరఎస్, కాంగ్రెస్‌లు మహిళా వ్యతిరేక శక్తులని మండిపడ్డారు. తెలంగాణలో తొలిసారి బీఆరఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రికి కూడా చోటు కల్పించని చరిత్ర వారిదని, మహిళా లోకంపై వారికి ఉన్న గౌరవం ఎంటో దీనినిబట్టే అర్థమవుతుందని విమర్శించారు. నేడు రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ ఈ అంశాన్ని ఉత్తర-దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతను గుర్తించినప్పటికీ దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ మహిళా లోకానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఏప్రిల్ 17ని దేశ చరిత్రలో మహిళా లోకానికి జరిగిన అవమానకరమైన చీకటి రోజుగా అభివర్ణించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తే ఆ బిల్లును అడ్డుకుని, కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లోపల, బయట సంబరాలు చేసుకోవడం వారి మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. నేడు బీసీ జనాభా గణన గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ పని చేయలేదని నిలదీశారు. మహిళలకే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గండికొడుతూ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని ప్రజలంతా తిప్పికొట్టాలని, మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా అందరూ ఏకం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారరన్నారు. గత ప్రభుత్వాలు జనాభా లెక్కల సాకుతో దశాబ్దాల కాలం మహిళా రిజర్వేషన్లను వాయిదా వేస్తూ వచ్చాయని, కానీ మోదీ ప్రభుత్వం 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 2029 నాటికే రిజర్వేషన్లు అమలు చేసేలా అడుగులు వేస్తోందని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలకు ఒక్క సీటు కూడా తగ్గకుండా పైగా సీట్ల సంఖ్య పెరిగేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని.. తద్వారా మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం పెరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియను అడ్డుకోవడం అంటే కేవలం మహిళలనే కాకుండా, దళిత, గిరిజన వర్గాల హక్కులను కూడా కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా 2029లో 33 శాతం రిజర్వేషన్ల అమలును ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. మహిళల హక్కులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు ఇంటింటికీ వెళ్లి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో ఎలాంటి అన్యాయం జరగకుండా దేశమంతా సమన్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా వేలాదిమంది మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు లభిస్తే తమ ఉనికి ఎక్కడ కోల్పోతామో అన్న భయంతోనే కాంగ్రెస్, ఇండి కూటమి నేతలు ఈ బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిసినా.. అబద్ధాలు, అపోహలతో దేశ ప్రజలను ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత దక్కకుండా కుట్రలు చేస్తున్న పార్టీలకు రాబోయే రోజుల్లో నారీలోకం సరైన బుద్ధి చెబుతుందని ఆమె హెచ్చరించారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ 1996 నుండి దాదాపు 30 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్వీర్యం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ‘మహిళలకు శక్తినిద్దాం.. దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టండి’అని మోదీ పార్లమెంటులో కోరినా కాంగ్రెస్ తన అబద్ధపు ప్రచారాలతో అడ్డుకుందని ధ్వజమెత్తారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ దక్షిణ భారతదేశం నుండి కాంగ్రెస్ కొత్త అబద్ధాలను వల్లె వేస్తోందని చేశారు. మహిళా బిల్లు విషయంలో ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినా తప్పకుండా 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని మోదీ మాట ఇచ్చారని గుర్తుచేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *