– రాహుల్ వర్సెస్ మోదీ!
– 2023లో ఆమోదించిన బిల్లును అమలు చేయండి
– లేదా కొత్త బిల్లును తీసుకు రండి
– ప్రస్తుత బిల్లు మహిళా సాధికరతకు పెట్టింది కాదు
– బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల క్రూర చర్య
– మోదీ ఓ మెజీషియన్ అంటూ రాహుల్ తీవ్ర విమర్శ
– రాహుల్ తీరుపై మండిపడ్డ స్పీకర్, మంత్రులు
న్యూదిల్లీ, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, దానినే అమలు చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లు మహిళల సాధికారత కోసం పెట్టింది కాదని విమర్శించారు. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. అంతగా కావాలంటే పాత బిల్లును రద్దు చేసి మళ్లీ తీసుకురండి. మేం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మద్దతిస్తాం. బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల ఈ బిల్లు క్షమించరాని, క్రూరమైన చర్య అని, ఓబీసీ సోదరుల నుంచి అధికారం లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కులగణన ప్రారంభమైందని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పుడు కులగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ ఎందుకు జరుగుతోందని, విపక్షాలన్నీ దీన్ని ఓడిస్తాయని రాహుల్ అన్నారు. న్యాయవ్యవస్థ, ప్రైవేటు రంగం వంటి కీలక రంగాల్లో ఓబీసీలు, దళితులు ఎక్కడున్నారు.. దేశ అత్యున్నత బ్యూరోక్రసీలో వీరు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. ఓబీసీలకు అధికారం, భాగస్వామ్యం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని, తన ప్రాబల్యం తగ్గిపోతోందన్న భయం ఆ పార్టీకి పట్టుకుందని విమర్శించారు. దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలను బీజేపీ గౌరవించడం లేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మోదీని పరోక్షంగా ఇంద్రజాలికుడంటూ రాహుల్ వ్యాఖ్యానించడం సభలో గందరగోళానికి కారణమైంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేయగా బీజేపీ సభ్యులు కూడా రాహుల్ తీరుపై మండిపడ్డారు. ప్రధానమంత్రిని అవమానిస్తున్నారని, ఇందుకు రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా దేశంలో కులగణన డిమాండ్‌ను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ’ఈ బిల్లు ఆమోదం పొందదని బీజేపీకి తెలుసు. వాళ్లంత తెలివతక్కువ వాళ్లు కాదు.. ఈ బిల్లును విపక్షంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారని తెలిసినా ప్రధాని రెండు సందేశాలు పంపాలనుకున్నారు.. ఇందులో మొదటిది.. దేశ ఎలక్టోరల్ మ్యాప్‌ను ఆయన మార్చాలనుకున్నారు.. రెండవది తాను మహిళా పక్షపాతినని మరోసారి చాటిచెప్పాలనుకున్నారు.. బాలాకోట్ మెజీషియన్, డీమోనిటైజేషన్ మెజీషియన్, సిందూర్ మెజీషియన్ అక్షస్మాత్తుగా పట్టుబడ్డారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానిపై అభ్యంతరకరమైన భాష వాడటాన్ని తప్పుపట్టారు. బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ ప్రస్తావనతో దేశాన్ని, మిలటరీని అవమానపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి గురించి విపక్ష నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఆ వ్యాఖ్యాలను రికార్డులను నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





