శాస్త్రీయ విధానంలో ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ పనులు

– వానాకాలం నాటికి పరీక్షలు
– ఎన్డీఎసఏ చైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) చైైర్మన్ అనిల్ జైన్‌తో శుక్రవారం భేటీì అయ్యారు. బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక ను చర్చించారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను వివరించారు. అన్ని కోణాల్లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రస్తుతం పరీక్షలు చేపడుతున్న తీరుపై ఎన్‌డీఎసఏ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తాను స్వయంగా బ్యారేజీల సందర్శనకు వస్తానని చెప్పారు.

దశలవారీగా శాస్త్రీయ పరీక్షలు

బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నిపుణుల సంస్థలను ప్రభుత్వం నియమించింది. డిజైనింగ్, టెస్టింగ్ సంస్థలు రంగంలోకి దిగాయి. డిజైన్‌కు ముందు అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను సీడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థ చేస్తుంది. బ్యారేజీల పునరుద్ధరణ కోసం జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) స్కానింగ్ , డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలతో భూమి, అక్కడ నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు.

సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ

వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇరిగేషన్ శాఖ అధికారులు, సీడబ్ల్యూపీఆరఎస్ ప్రతినిధులు, డిజైనింగ్ సంస్థ ప్రతినిధులు, ఇతర టెక్నికల్ ఏజెన్సీలు సభ్యులుగా ఉన్నారు. పరీక్షలు సకాలంలో జరిగేలా చూడడం.. అవసరమైన డేటా సమయానికి అందించడం, అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగేందుకు, కేంద్రస్థాయి నిపుణుల పర్యవేక్షణ కూడా ఉండేలా± ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని కూడా ఇందులో చేర్చే అవకాశముంది.

అన్ని కోణాల్లో విశ్లేషించి..

ప్రస్తుతం బ్యారేజీల ఫౌండేషన్, కట్ ఆఫ్ వాల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయనున్నారు. అన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడున్న నిర్మాణ లోపాలు గుర్తించి పూర్తి సమాచారం విశ్లేషణల ఆధారంగా వాటికి అనుగుణంగా పునరుద్ధరణ పనులకు డిజైనింగ్ సంస్థ కొత్త డిజైన్లు సిద్ధం చేస్తారు. ఈ డిజైన్‌ను  ఎన్‌డీఎస్ఏ కి పంపి వాళ్ళు ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

వానాకాలానికి ముందే పరీక్షలు

రానున్న మూడు నాలుగు నెలల్లో (వర్షాకాలం ముందు) అన్ని పరీక్షలు పూర్తి చేసి డిజైన్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాకాలం తరవాత పునరుద్ధరణ పనుల ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పునరుద్ధరణ పనులు పూర్తిగా శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం అమలు చేసి భవిష్యత్తులో 50 నుంచి 100 ఏళ్లపాటు బ్యారేజీలు సురక్షితంగా భద్రంగా ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

శాస్త్రీయ పద్దతుల్లో బాగు చేస్తం : మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వ లోపాల వల్ల దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను శాస్త్రీయ పద్ధతుల్లో బాగు చేయడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  స్పష్టం చేశారు. ఇందుకోసం ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యూసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఐఐటి ముంబయిలోని నిపుణుల సహకారంతో అత్యధునాతన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా భూసార పరీక్షలు పూర్తి చేసి వర్షాకాలం తర్వాత శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. పారదర్శకత కోసం ప్రత్యేక కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నరని మంత్రి చెప్పారు.

20న సిఎం మేడిగడ్డను పరిశీలన

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డికి, తమ ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ దిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఎసఏ చైర్మన్ అనిల్ జైన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, పునరుద్ధరణపై చర్చించామని, గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై కేసీఆర్ హయాంలో చేసిన పొరపాటు తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. దాదాపు రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించారని, ఏటా రూ.10వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మేడిగడ్డ డ్యామేజ్ సాయిల్ టెస్ట్, డిజైన్ల ఖర్చులను కాంట్రాక్టుసంస్థలే భరిస్తాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *