– రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి దక్కేనా..
– తీవ్ర అసంతృప్తితో మునుగోడు ఎమ్మెల్యే
– వలస నేతలకే ప్రాధాన్యం అంటూ సంచలన వ్యాఖ్యలు
– కీలక పీఏసీ భేటీకి గైర్హాజరు
(మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
మునుగోడు ఎంఎల్‌ఏ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వైఖరి కాంగ్రెస్‌లో కల్లోలాన్ని సృష్టిస్తున్నది. ఆయనపై చర్యలు తీసుకోలేక, కట్టడి చేయలేక పార్టీ సతమతమవుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి రాజగోపాల్‌రెడ్డి విషయం నలుగుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పడి ముప్పై నెలలు దాటినా మంత్రిపదవి అన్నది ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్రంలో ఇంకా ఇద్దరిని మంత్రి పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉండగా రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి లభిస్తుందా లేదా అన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి తిరిగి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరేముందు అధిష్టానం ఆయనకు మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చిందన్నది రాజగోపాల్‌రెడ్డి చెబుతున్న మాట. తనకు హామీ ఇచ్చిన మేరకు మంత్రిపదవి విషయంలో అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం చుట్టూ రాజగోపాల్‌రెడ్డి చక్కర్లు కొడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా మంత్రులను తీసుకుంటున్నారన్నప్పుడల్లా ఆయన మాట ప్రముఖంగా వినిపిస్తున్నా పదవిమాత్రం దక్కటంలేదు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవిలో ఉండడం, పదవుల పందారంలో పలు ఈక్వేషన్లు ఆయన పదవికి అడ్డంకిగా మారాయి. అదే నిజమైతే ఒకే కుటుంబానికి చెందిన వారు పలు పదవుల్లో ఉండడాన్ని ఆయన ఎత్తి చూపించినా లాభం లేకపోయింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకున్న ప్రత్యేకత దృష్ట్యా ఎన్ని మంత్రిపదవులిచ్చినా తక్కువే అన్నట్లుగా ఆయన చేసిన వాదనలను పెద్దలు పట్టించుకోవడంలేదు. దీంతో ఆయన కోపం నషాళానికి ఎక్కింది. పార్టీ నాయకత్వంపైనే తీవ్రంగా విరుచుకుపడడం ప్రారంభించారు. పలు సందర్భాల్లో అలిగారు.. కోపగించుకున్నారు.. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవ పాలన సాగటంలేదంటూ పార్టీ నేతలపైనే దాడి ప్రారంభించారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్రకు చెందిన మీడియా చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నదని, పార్టీతో సంబంధం లేని వారు తెలంగాణను పాలిస్తున్నారని, ఇతర పార్టీలనుండి వచ్చినవారే ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి పేరుతో వేల కోట్ల దోపిడీ చేస్తున్నారని ఇలా పలు సందర్భాల్లో పలు సభల్లో ఆయన తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. తాజాగా ఆయన తనకు రాజకీయాలను మార్చే శక్తి ఉందని, తమిళనాడు తరహా రాజకీయాలను తీసుకొస్తానని, కొత్త రాజకీయ శక్తులను ప్రోత్సహిస్తాననడం వెనుక ఆయన తన మంత్రి పదవి విషయంలో మరింత సీరియస్‌గా ఉన్నారన్న విషయం స్పష్టమవుతున్నది. దీంతో ఆయన కొత్త పార్టీ ఏమైనా పెట్టే ఆలోచనలో ఉన్నారా.. నిజంగానే ఆయనకు కొత్త పార్టీని నెలకొల్పి నిర్వహించే సామర్ద్యం ఉందా అన్న విషయంలోకూడా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమంది కార్యకర్తలు ప్రాణాలను ఒడ్డారని, మొదటినుండి పార్టీలో ఉన్నవారిని కాదని ఇతర పార్టీలనుండి వచ్చినవారికే ప్రాధాన్యం దక్కుతున్నదని, పార్టీలో వారి పెత్తనం ఎక్కువైందని, పార్టీ ముఖ్య నేతలు వారికే ప్రాధాన్యతనిస్తూ దశాబ్ధాలుగా జెండా మోసిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయాన్ని ఆయన ఎత్తిచూపుతున్నారు. వలస నేతలకే ప్రాధాన్యమివ్వడమన్నది గతంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పిదాన్నే రాష్ట్ర కాంగ్రెస్ చేస్తున్నదన్న ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని పాత కొత్త నేతల మధ్య ఉన్న విభేదాలను చెప్పకనే చెబుతున్నాయి. ఇదిలాఉంటే కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్వర్యంలో తాజాగా ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంకూడా కాంగ్రెస్ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. నల్లగొండ జిల్లా పొలిటికల్ ఆఫైర్ కమిటి(పిఏసి) సమావేశాన్ని భువనగిరిలో ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యమైన ఈ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు హాజరుకాలేదన్న దానిపై పలు రకాలుగా వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. సొంత జిల్లాలో జరిగిన ఈ సమావేశాన్ని ఆయన బహిష్కరించారా.. ఇక కాంగ్రెస్ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండదల్చుకున్నారా.. ఆయన భవిష్యత్ కార్యక్రమమేమై ఉంటుంది.. కొత్త పార్టీ ఏమైనా ఏర్పాటు చేస్తారా లాంటి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటికీ తెరతీస్తూ తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. దానితోపాటు తాను మరే ఇతరుల నాయకత్వంలో పనిచేయనంటున్న రాజగోపాల్‌రెడ్డి 2022లో బీజేపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగి 2023 అక్టోబర్ 25న తిరిగి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి మిస్టరీ వీడేది ఎప్పుడో?
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





