సభాపతిని, దళితులను అవమానిస్తే సహించం

– అంటరానితనం, దొర అహంకారం పేరుకుపోయాయి
– కుట్రదారులు ఎంతటివారైనా అట్రాసిటీ కేసులతో కఠిన చర్యలు:
– అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9: శాసనసభలో సభాపతి స్థానాన్ని, దళిత వర్గాలను అవమానించేలా బీఆర్ ఎస్‌ నాయ‌కులు వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభలో బుధ‌వారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యా రంగంలో అక్రమాలు, ధరణి సమస్యలు, 22-ఎ వివాదంపై సభలో చర్చ జరగాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. అయితే పదేళ్ల పాలనలో జరిగిన దురాగతాలు, చేసిన అప్పుల వివరాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే ఫామ్‌హౌస్‌లో కుట్రలు పన్ని తమ సభ్యులతో సభను అడ్డుకున్నారని ఆరోపించారు. సభాపతి స్థానాన్ని, వారి తల్లిని కూడా అవమానించేలా వ్యవహరించడం ఉన్మాద చర్య అని సీఎం అభివర్ణించారు.

దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడమా?

ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లను కల్పించింది కాంగ్రెస్ పార్టీ..  ఇది కాంగ్రెస్ విధానం అని తెలిపారు. కర్ణాటకలో ఒక చిన్న గ్రామంలో పుట్టి రజాకార్ల దాడులలో తండ్రిని కోల్పోయి కార్మిక నాయకుడిగా రాణించి జాతీయ స్థాయికి ఎదిగిన నేత మల్లికార్జున ఖర్గే.. 60 ఏళ్లుగా ఆయన ప్రజలకోసం పనిచేస్తున్నారు.. ఉత్తరాఖండ్ లో ఒక మైదానంలో జరిగిన సభలో ఆయన పాల్గొంటే ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ ఆ మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం హేయమైన చర్య.. దీన్ని ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది..  పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతిని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారని సీఎం తెలిపారు. ఇదిలా ఉండగానే రాష్ట్రంలో మరో దురదృష్టకర సంఘటన జరిగింది.. ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాక సభాపతి కుర్చీని అవమానించేలా వ్యవహరించారు.. వ్యక్తినే కాక ఆయ‌న‌ తల్లిని కూడా అవమానించారు మహిళలను శక్తిగా కొలిచే సమాజం మనది.. భారత దేశాన్ని భారత మాత అని, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తున్నాం.. సభాపతిగా ఉన్న మీ మనసుకు గాయం చేయాలని ఉన్మాదంతో మాట్లాడారు.. ప్రతిపక్ష నాయకుడు కెసీఆర్ సభాపతికి క్షమాపణ చెప్పి వారి సభ్యులతో క్షమాపణ చెప్పించి సభ సజావుగా జరిగేలా చూస్తారని అంతా భావించారు.. కానీ అలా జరగకపోగా మరింత ఉన్మాదంతో వ్యవహరించారు.. అందుకే ఏ ఫామ్ హౌస్‌లో కుట్ర జరిగిందో ఆ ఫామ్ హౌస్ ముందు దండోరా వేయాలని ప్రజాస్వామ్యవాదులు నిరసనకు దిగారు.. వాళ్లలా ఉన్మాదానికి తెగబడలేదు.. కేవలం డప్పు దరువులతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపారు.. ఫామ్‌హౌస్ వద్దకు వెళ్లిన దళిత సోదరులను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అవమానించారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం దొర అహంకారానికి, అంటరానితనానికి నిదర్శనం అన్నారు.  ప్రతిపక్ష నాయకుడిగా బాధలో ఉన్నవారి సమస్యను పరిష్కరించే బాధ్యత వారిపై ఉంది.. ఆ ప్రతినిధులను లోపలికి పిలిచి మాట్లాడి జరిగిన సంఘటనపై కెసీఆర్ బాధ్యతతో వ్యవహరించాల్సి ఉండే కానీ అలా వ్యవహరించకుండా ఉన్మాదంతో వ్యవహరించారు.. దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించి తీవ్రంగా అవమానించారు.. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ప్ర‌శ్నించారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదు.. మీ మనసుల్లో పేరుకుపోయిన అహంకారాన్ని, మనువాద ఆలోచనలను అని హితవు పలికారు. మల్లికార్జున ఖర్గే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ సమాజానికి జరిగినట్లేనన్నారు. తీవ్రవాదులకు, ఉన్మాదంతో సభాపతిని అవమానించిన వారికి పెద్ద తేడా లేదు అని వ్యాఖ్యానించారు.

క్రిమినల్ కేసులు.. కఠిన శిక్షలు ఖాయం

సభాపతిని అవమానించిన వారిని, కుట్రదారులను చట్టపరంగా తీవ్రంగా శిక్షిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 6న జరిగిన కుట్రతోపాటు తదనంతర ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. చట్టాల సందుల నుంచి బెయిల్ పొందవచ్చేమో కానీ, తెలంగాణ సమాజం మాత్రం బెయిల్ ఇవ్వదని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *