– అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలిచింది బీజేపీ మాత్రమే
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభ, శాసనమండలి వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు రోజులుగా ఆడుతున్న కపట నాటకాలను యావత్ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే తమ బతుకులు మారేలా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని వివిధ వర్గాల ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తారన్నారు. వారి ఆశలను వమ్ము చేస్తూ అసెంబ్లీని ఈ రెండు పార్టీలు తమ వ్యక్తిగత దూషణలకు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్షానికి, పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం వేలాదిగా ప్రజా సమస్యల అర్జీలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. లక్షలాదిమంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన రూ.50వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వివాదాస్పద 22-ఎ భూముల జాబితా అంశం, ఉద్యోగుల సమస్యలైన పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుతోపాటు రాష్ట్ర ఆర్థిక, సామాజిక సంక్షోభాలపై సభలో చర్చించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని అరాచకాల నుంచి విముక్తిని, మార్పును కోరుకుని ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే బీఆర్ఎస్లాగే కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రజాద్రోహ విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక తీవ్ర సమస్యలకు మూలకారణం గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలేనని అన్నారు. తమ పాపాలు, వైఫల్యాలు, అసమర్థత బయటపడకుండా ఉండేందుకు ఇరు పార్టీలు అసెంబ్లీని పక్కదోవ పట్టిస్తున్నాయని రామచందర్రావు ఆరోపించారు. పరస్పర బూతుల తిట్ల పురాణంతో, కేవలం టీఆర్పీలు, కెమెరా పబ్లిసిటీ స్టంట్ల కోసమే సభా సమయాన్ని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వెల్లో బీజేపీ పక్షాన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 22-ఎ నిషేధిత భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాలు కూడా చర్చకు రాకుండా అడ్డుకున్నాయని విమర్శించారు. ఈ పార్టీలు తమ రాజకీయ స్వార్థాన్ని, నాటకాలను పక్కనపెట్టి మిగిలిన మూడు రోజుల సమావేశాలనైనా ప్రజా సమస్యలపై చర్చించేందుకు సద్వినియోగం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుందంటూ కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రామచందర్ హెచ్చరించారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





