బాలిక జీవితంతో చెలగాటమాడితే సహించం

– తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు నోటీసులు
– మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క

ఏటూరునాగారం, ప్రజాతంత్ర, మే 28 : ఏటూరునాగారంలో ఒక మైనర్ బాలిక వ్యవహారానికి సంబంధించి కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల‌ మంత్రి సీతక్క అన్నారు. ఈ ఘటనలో అసలు వాస్తవాలను, పోలీసులు, మహిళా-శిశు సంక్షేమ శాఖ అధికారుల దర్యాప్తులో తేలిన విషయాలను ప్రజల ముందుంచేందుకు ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారుల విచారణ వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే కొందరు మీడియా ప్రతినిధులు దానిని బహిష్కరించి నిరసన చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒక కాంగ్రెస్ నాయకురాలి కుమారుడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసినందుకు వాస్తవానికి రోడ్డెక్కి నిరసన చేయాల్సింది మీరు కాదు.. మేము అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. రేటింగ్స్, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు వార్తలు ప్రచురించి ఒక మైనర్ బాలిక జీవితంతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ దుష్ప్రచారం వల్ల ఆ బాలిక కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తున్న వారి వద్ద నిజంగా సరైన ఆధారాలు ఉంటే వాటిని పోలీసులకు సమర్పించి నిలదీయాలని మంత్రి సీతక్క సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *