ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం

– చింతపల్లిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

నల్లగొండ, ప్రజాతంత్ర, మే 28 : రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునే క్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీఏసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో రాష్ట్రవ్యాప్త యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని కులకచర్లలో ప్రారంభమైన ఈ యాత్ర నేడు నిర్మల్ జిల్లా సారంగపూర్ లో బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. నల్గొండ జిల్లా వరి సాగులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ శాఖ నుండి ధాన్యం ఉత్పత్తి అంచనాలపై నివేదికలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోందని, ఐకేపీ కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం గన్నీ బ్యాగులు, రవాణా, హమాలీ చార్జీలకు కావలసిన నిధులు సమకూరుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయడంలేదని మండిపడ్డారు. ప్రతి బస్తాకు నాలుగు కిలోల చొప్పున తేమ, తరుగు పేరుతో కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని, హమాలీ చార్జీలను కూడా రైతుల నుండే వసూలు చేయడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు తడిసి మొలకలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్రం ఏటా ఎంఎస్పీని పెంచుతూ రైతులను ప్రోత్సహిస్తుంటే రాష్ట్రం మాత్రం కొనే చిత్తశుద్ధి లేక సాకులు వెతుకుతోందని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ, రెవెన్యూ మంత్రులు కళ్లు తెరిచి తడిసిన ధాన్యం సహా ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. రైతుల దగ్గర రూపాయి కూడా వసూలు చేయకూడదని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *