ప్రజలు మార్పును కోరుకుంటున్నారు

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు

సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 29 : దేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) అనే సిద్ధాంతంతో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట లో శుక్రవారం జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నక్సలైట్లు, జిహాదీల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల బలిదానాల వల్లే నేడు దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు కొలువుదీరాయని చెప్పారు. తెలంగాణలో కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలతో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని గుర్తు చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణ అంతటా బీజేపీ జెండా ఎగురుతుందంటూ కార్యకర్తలు అంకితభావంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు. గత 12 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సుమారు రూ.13 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ములుగు సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, బీబీనగర్ ఎయిమ్స్, జాతీయ రహదారుల విస్తరణ, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, ఎంఎంటీఎస్ సేవలు అన్నీ మోదీ చొరవ వల్లే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. కాగా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరగగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయన్నారు. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాý్లోని మంత్రులు రైతులకు ఏమీ చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక, లారీలు, టార్పాలిన్లు అందుబాటులో లేక అన్నదాత పడుతున్న బాధ వర్ణనాతీతమని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తేమ పేరుతో కోతలు విధిస్తూ మిల్లర్లతో కుమ్మక్కవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు. బీజేపీ రైతు గోస- బీజేపీ భరోసా యాత్రతోనే ప్రభుత్వం కదిలిందన్నారు. కేంద్రం అన్ని రకాలుగా నిధులను రీయింబర్స్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *