పదేళ్ల అధికారంలో ప్రజలను ఎందుకు కలవలేదు

– ఇప్పుడే పాదయాత్ర ఎందుకనో
-కేటీఆర్‌పై విమర్శలు గుప్పించిన కవిత
– ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తాం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేది అధికార పార్టీయేనని, అందుకే కాంగ్రెస్‌ను టార్గెట్ చేశానని కవిత తెలిపారు. ఆయా సమస్యల ఆధారంగా బీఆర్ఎస్‌పై కూడా మాట్లాడతానన్నారు. పరిగిలో రైతు దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్నానని చెప్పి హరీష్ రావు హౌస్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. హరీష్ రావు ఫోన్ చేస్తే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి హౌస్ అరెస్టు చేశారంటూ ఆయన పరిగిదాకా కూడా పోలేదని ఎద్దేవా చేశారు. తాము పరిగి వెళ్లి రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఏ విధంగానైతే పోరాటం చేశామో అలాగే పరిగిలో కూడా పోరాటం చేశానని చెప్పారు. భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. తాను పెట్టబోయే పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎర్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో కవితను పలువురు కలిశారు. ఆమెను కలిసిన వారిలో సీపీయూఎస్‌ ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు ఉన్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ తన లక్ష్యమని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. మారోజు వీరన్న అనుచరుల మద్దతు ఎంతో శక్తిని ఇస్తుందన్నారు. ఏదైనా శని ఉంటే తొలగిపోయేందుకే తాను వారణాసి వెళ్లి పూజలు చేశానని చెప్పారు. తాను పెట్టే పార్టీ సక్సెస్ కావాలని కోరుకున్నానన్నారు. బీఆరఎస్‌కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని, పేర్లు చెప్పనని అన్నారు. ప్రజా సమస్యలపై బీఆరఎస్‌ను ముందుగా టార్గెట్ చేశానని, తనను ఆ పార్టీ సస్పెండ్ చేసిందని ప్రస్తావించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *