రాహుల్ కేరళ నుంచి ఎందుకు పోటీ చేశారు

– యూపీ నుంచి రాజ్యసభ దక్కడం గౌరవమే
– డబ్బుల మూటలతో రేవంత్ రాజకీయం
– మహిళా రిజర్వేషన్లపై విమర్శలు తగవు
– రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం

న్యూదిల్లీ, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. తుపాకీ పట్టుకొని ఆయన ఎవరి పక్కన నిలుచున్నారో అందరికీ తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేరళ నుంచి ఎందుకు పోటీ చేశారంటూ రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావ్వడం తెలుగు వాడిగా తనకు గౌరవంగా ఉందన్నారు. తనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుధవారం ధిిల్లీలో లక్ష్మణ్ స్పందించారు. నీతులు చెబుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహిళల వాటా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా.. ఎస్సీ, ఎస్టీ వాటా అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్నారా అంటూ విపక్షాలకు ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే అని వ్యంగ్యంగా అన్నారు. దిల్లీకి ఆయన డబ్బుల మూటలు మోశారని విమర్శించారు. నగదు కేంద్రంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బున్న వాళ్లకి ఓటు విలువ ఎక్కువ అనేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారని, జీహెచఎంసీ పరిధిలో 150 సీట్లను 300 చేశారని పేర్కొన్నారు. ఏ శాస్త్రీయ పద్ధతిలో గ్రేటర్ హైదరాబాద్‌ను విభజించారంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా అవి పెరుగుతాయని  తెలిపారు. 543 సీట్లలో మహిళా రిజర్వేషన్లు పెంచమనడం వెనుక ఎస్సీ, ఎస్టీ మహిళలకు నష్టం చేయాలన్న కుట్ర దాగి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అందుకే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల పట్ల రాజ్యాంగ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది కాంగ్రెస్ విధానమా అనేది స్పష్టం చేయాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జీడీపీలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదన చేస్తున్నారని, వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *